ప్రపంచమంతా డబ్బుతోనే, అది లేకపోతే జీవితమేలేదు అన్నది అక్షరాల నిజం. ఇక విజయంతో ఎంతటివాడికైనా రెక్కలు మొలుస్తాయన్నది వాస్తవం. అవకాశం వచ్చే వరకూ ఒక లెక్క, విజయం వచ్చిన తరువాత ఒక లెక్క ఇదీ లోకం. ఈ నగ్న సత్యానికి ఎవరూ అతీతం కాదు. నటి తమన్న విషయానికే వస్తే తొలుత హిందీలో నటిగా పరిచయం అయినా, ఆ తరువాత శ్రీ అనే తెలుగు చిత్రంలో నాయకిగా ఎంట్రీ ఇచ్చారు. 2005లో విడుదలైన ఆ చిత్రం ఆశించిన విజయాన్ని సాధించలేదు. ఆ తరువాత తమిళంలోకి కేడీ చిత్రంతో దిగుమతి అయ్యారు. ఆ చిత్రం నిరాశ పరచింది. అలాంటిది కల్లూరి చిత్రంతో తొలి విజయాన్ని అందుకున్నారు.
ఆ తరువాత తెలుగు, తమిళం భాషల్లో వరసగా అవకాశాలను అందుకున్నారు. అయితే ఎక్కువగా ఈమె అందాలారబోతకే పరిమితం అయ్యారు. నిజం చెప్పాలంటే అదే తమన్నను పాపులర్ చేసింది. మధ్యలో కొన్ని నటనకు అవకాశం ఉన్న పాత్రల్లో నటించినా ఇప్పటి వరకూ గ్లామర్‌నే మెయిన్‌టైన్ చేస్తున్నారు. ఇటీవల రజనీకాంత్ కథానాయకుడిగా నటించిన చిత్రంలోనూ తమన్న అందాల ప్రదర్శన ఆ చిత్రానికీ, ఆమెకు ప్లస్ అయ్యిందని చెప్పక తప్పదు. జైలర్ చిత్రంలో నువ్వు కావాలయ్యా అనే పాట యువతను ఉర్రూతలూగించింది. ఇకపోతే ఈ చిత్రంతో వచ్చిన క్రేజ్‌ను తమన్న పారితోషికం రూపంలో బాగానే వాడుకున్నారనే టాక్ ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. జైలర్ చిత్రం కోసం ఈ బ్యూటీ రూ.3 కోట్లు పారితోషికం పుచ్చుకున్నట్లు సమాచారం.
ఆ తరువాత తమన్న తమిళంలో నటించిన చిత్రం అరణ్మణై 4. నటి రాశీఖన్నా మరో నాయకిగా నటించిన ఈ చిత్రాన్ని సుందర్.సీ తెరకెక్కించారు. ఇటీవల విడుదలైన ఈ చిత్రం టాక్‌కు అతీతంగా మంచి వసూళ్లను సాధిస్తోంది. ఇకపోతే జైలర్ చిత్రం తరువాత తమన్న తన రెమ్యునరేషన్‌ను 30 శాతం పెంచినట్లు సమాచారం. అరణ్మణై 4 (తెలుగులో బాక్) చిత్రానికి రూ. 4 నుంచి రూ.5 కోట్ల మధ్యలో పుచ్చుకున్నట్లు ఇప్పుడు టాక్ స్ప్రెడ్ అవుతోంది. అలా విజయంతో తమన్నా రెమ్యునరేషన్‌కు రెక్కలోచ్చాయన్న మాట. నిజం చెప్పాలంటే తమన్నకు ప్రస్తుతం దక్షిణాదిలో అవకాశాలు లేవు. హిందీలో ఒకటి రెండు చిత్రాలు చేతిలో ఉన్నట్లుంది. ఏమైనా తమన్న లెక్కే వేరప్పా అంటున్నారు నెటిజన్లు.
Comments
Please login to add a commentAdd a comment