Allu Arjun Interesting Comments On Pushpa Movie Goes Viral - Sakshi
Sakshi News home page

Allu Arjun On Pushpa: ఓ వారం పాటు బాగా నొప్పిగా ఉండేది.. తర్వాత అలవాటైంది: అల్లు అర్జున్‌

Published Wed, Dec 15 2021 5:30 AM | Last Updated on Mon, Dec 20 2021 11:48 AM

Allu Arjun talks abiut Pushpa movie - Sakshi

‘‘నేనెప్పుడూ మార్కెట్, వసూళ్ల గురించి ఆలోచించను. ప్రేక్షకులకు నచ్చేలా ఒక మంచి సినిమా చేయాలనుకుంటాను. ఒక్క మాటలో చెప్పాలంటే ‘పుష్ప’ ఓ సూపర్‌ తెలుగు చిత్రం’’ అని హీరో అల్లు అర్జున్‌ అన్నారు. సుకుమార్‌ దర్శకత్వంలో అల్లు అర్జున్, రష్మికా మందన్న జంటగా తెరకెక్కిన చిత్రం ‘పుష్ప: ది రైజ్‌’. ముత్తంశెట్టి మీడియాతో కలసి మైత్రీ మూవీస్‌ బ్యానర్‌పై నవీన్‌ ఎర్నేని, వై.రవిశంకర్‌ నిర్మించిన ఈ చిత్రం మొదటి భాగం ఈ నెల 17న విడుదలఅవుతోంది. ఈ సందర్భంగా మంగళవారం హైదరాబాద్‌లో అల్లు అర్జున్‌ చెప్పిన విశేషాలు.

► ‘ఆర్య, ఆర్య 2’ తర్వాత నేను, సుకుమార్‌గారు ఓ సినిమా చేద్దామనుకున్నాం. ఓ రోజు సుకుమార్‌ వచ్చి ‘పుష్ప’ లైన్‌ని 10 నిమిషాలు చెప్పగానే సినిమా చేయాలని ఫిక్స్‌ అయ్యా. ఈ చిత్రాన్ని ప్యాన్‌ ఇండియా స్థాయిలో చేయాలనుకోలేదు. ఒక మంచి తెలుగు సినిమా తీద్దాం. కథ బాగా నచ్చి అది హిట్‌ అయితే చాలనుకున్నాం. ఆ తర్వాత ఈ సినిమాని వివిధ భాషల్లో డబ్‌ చేద్దామనుకున్నాం.. అంతే.



► ‘అల వైకుంఠపురములో..’ తర్వాత ‘పుష్ప’ సినిమా స్టార్ట్‌ అయ్యింది. ఈ రెండేళ్లలో దాదాపు 10 నెలలు కోవిడ్‌ వల్ల ఆగిపోయింది. లాక్‌డౌన్‌లో కూడా నా మనసులో ‘పుష్ప’ ఆలోచనలే ఉండేవి. నేను, సుకుమార్‌ కలసి వీడియో కాల్స్‌లో సినిమా గురించి చర్చించుకునేవాళ్లం. చిత్తూరు యాస డైలాగ్స్‌ని ఆ సమయంలో ప్రాక్టీస్‌ చేసేవాణ్ణి. ఈ సినిమా కోసం సుకుమార్, ఆయన టీమ్‌ చాలా పరిశోధన చేశారు.

► ‘పుష్ప’లో నా లుక్‌ కోసం కోసం ముంబయ్‌ నుంచి టీమ్‌ని పిలిపించి, మూడుసార్లు లుక్‌ టెస్ట్‌ చేసి ఫైనల్‌గా ఒక్కటి సెలక్ట్‌ చేశాం. లుక్, మేకప్, క్యాస్టూమ్స్‌.. ఇలా ఈ సినిమా కోసం చాలా కష్టపడ్డాం. పుష్పరాజ్‌ పాత్రకి మేకప్‌ వేసుకోవడానికి రెండున్నర గంటలు, తీయడానికి అరగంట పట్టేది.

► మారేడుమిల్లి అడవిలో షూటింగ్‌ చాలా కష్టంగా అనిపించింది. ముఖ్యంగా యాక్షన్‌ సీన్స్‌ తీయడం. అడవిలో షూటింగ్‌ కోసం నిర్మాతలు కొద్ది దూరం రోడ్డు కూడా వేయించారు.. వారి ప్యాషన్‌కి థ్యాంక్స్‌. అడవిలో షూటింగ్‌ చేస్తున్నప్పుడు చూడటానికి వచ్చేవారితో పాటు యూనిట్‌ వల్ల ప్లాస్టిక్‌ పోగయ్యేది.. ఎప్పుటికప్పుడు క్లీన్‌ చేయించేవాళ్లం. అడవిలో ఓ అందం ఉంది.. దాన్ని మనం పాడు చేయకుండా ఉంటే చాలు.

► పుష్పరాజ్‌ జీవితంలో జరిగే కథే ‘పుష్ప’ చిత్రం. ఈ పాత్ర చాలా అనుభూతులు ఇచ్చింది. స్పెషల్‌ మేకప్‌ గురించి, కొత్త యాస గురించి తెలిసింది. నా లైఫ్‌ ‘ఆర్య’తో టేకాఫ్‌ అయింది. నా వ్యక్తిగత విషయాలు కూడా పంచుకునేంత చనువు సుకుమార్‌గారితో ఉంది. ‘పుష్ప’ టైటిల్‌ని సుక్కుగారే చెప్పారు. నా ఫుల్‌ మాస్‌ లుక్‌కి ‘పుష్ప’ అనే సాఫ్ట్‌ టైటిల్‌ పెట్టాం. నా లుక్, టైటిల్‌ ఒకేసారి వదలడంతో మంచి స్పందన  వచ్చింది.

(ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి)
► పుష్పరాజ్‌ పాత్రకి ఓ భుజం పైకి ఉంటే బాగుంటుందని ముందే అనుకున్నాం. అయితే 2005, 2011లో నా ఎడమ భుజానికి సర్జరీలు జరిగాయి. 2001లో అయితే సర్జరీ తర్వాత కోలుకోవడానికి  11 నెలలు పట్టింది. ‘పుష్ప’లో ఎడమ భుజం పైకి పెట్టుకుని నటించడం వల్ల ఓ వారం పాటు బాగా నొప్పిగా ఉండేది. ఆ తర్వాత అలవాటయింది.

► ‘పుష్ప’ని రెండు భాగాలుగా చేయాలని ముందుగా అనుకోలేదు. ఇది చాలా పెద్ద కథ. నాలుగు గంటల నిడివి ఉంటుంది. అందుకే రెండు భాగాలుగా రిలీజ్‌ చేస్తున్నాం. ఈ ఏడాది ఎలాగైనా తొలి భాగం రిలీజ్‌ చేసి, రెండో భాగం వచ్చే ఏడాది విడుదల చేయాలని ఫిక్స్‌ అయ్యాం. నవంబరులో షూటింగ్‌ అయిపోతుంది ప్రమోషన్స్‌ పెట్టుకోవచ్చు అనుకున్నాం. అయితే షూటింగ్‌ ఆలస్యం అయింది.. అయినా ప్రమోషన్స్‌ ముఖ్యం కాదు.. మంచి ప్రొడక్ట్‌ ఇవ్వాలనేది మా ఆలోచన.

► నేను, సుకుమార్, దేవిశ్రీ ప్రసాద్‌ కలసి ప్రమోషన్స్‌లో పాల్గొంటే సినిమా హిట్‌ అనే ఓ సెంటిమెంట్‌ ఉంది. పోస్ట్‌ ప్రొడక్షన్‌ పనుల్లో వారు బిజీగా ఉండటం వల్ల ‘పుష్ప’ ప్రమోషన్స్‌లో పాల్గొనలేదు.. గురువారంలోపు మేం ఒక ప్రమోషన్‌లో అయినా పాల్గొనాలని ఉంది.. పాల్గొంటాం. ‘పుష్ప’ ప్రీ రిలీజ్‌లో రాజమౌళిగారు నా గురించి నిజాయతీగా మాట్లాడారు. ‘మీతో ఓ సినిమా చేయాలనుంది’ అని నేను అన్నప్పుడు ‘తప్పకుండా చేద్దాం’ అన్నారాయన.

► రష్మిక చాలా స్వీట్‌ గర్ల్‌.. బాగా నటించింది. దేవిశ్రీ ప్రసాద్‌ అద్భుతమైన సంగీతం ఇచ్చాడు. చంద్రబోస్‌గారు ఆణిముత్యాల్లాంటి ఐదు మంచి పాటలు రాశారు. కెమెరామ్యాన్‌ మిరోస్లా క్యూబా బ్రోజెక్‌కి ఈ చిత్రం ఓ ఛాలెంజ్‌.. బాగా పని చేశారాయన. ఫాహద్‌ ఫాజిల్‌ కథ నచ్చి ‘పుష్ప’ చేశారు. మాపై నమ్మకంతో ఎలాంటి ఆంక్షలు పెట్టకుండా ప్రత్యేక పాట చేసిన సమంతకి ప్రత్యేక కృతజ్ఞతలు.

‘రంగస్థలం’ సినిమా అంత హిట్‌ అవుతుందని సుకుమార్‌గారు కలలో కూడా ఊహించి ఉండరు. ‘అల వైకుంఠపురములో..’ చిత్రం నా కెరీర్‌లో అంత బ్లాక్‌ బస్టర్‌ అవుతుందని నేను కూడా కలలో ఊహించలేదు... ప్రేక్షకులు ఆదరించారంతే. వసూళ్లు మా లెక్కలోకి రావు. ‘పుష్ప’ని జనాలు ఏ రేంజ్‌లో ఆదరిస్తారో తెలియదు.. అయితే మూవీ హిట్‌ అయితే చాలు అనుకుంటున్నాం. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement