
అమలాపాల్ ఇండోనేషియాలోని బాలి దీవికి వెళ్లి అక్కడ ఓ ఆశ్రమంలో బస చేశారు.
వివాదాలకు చిరునామా అమలాపాల్. నటన, ప్రేమ, పెళ్లి, విడాకులు, వివాదాలు, ఆరోపణలు, కేసులతో ఆమె నిత్యం సావాసం చేస్తుంటారు. దక్షిణాది భాషల్లో కథానాయకిగా నటించి గుర్తింపు పొందారు. తమిళంలో మైనా చిత్రంతో వెలుగులోకి వచ్చిన ఈమె ఆ తరువాత ప్రముఖ హీరోల సరసన నటించారు. అదేవిధంగా నటిగా మంచి ఫామ్‌లో ఉండగానే దర్శకుడు విజయ్‌ను ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. అయితే రెండేళ్లలోనే మనస్పర్థల కారణంగా విడాకులు తీసుకున్నారు. ఆ తరువాత నటిగా కొనసాగుతున్న అమలాపాల్ ఆ మధ్య నిర్మాతగానూ మారి కడావర్ అనే చిత్రాన్ని నిర్మించారు. కాగా నటిగా క్రేజ్ తగ్గడంతో తాజాగా ఆధ్యాత్మిక బాట పట్టినట్లు తెలుస్తోంది.
క్రిస్టియన్ మతానికి చెందిన అమలాపాల్ ఇటీవల కేరళలోని ఓ హిందూ దేవాలయానికి వెళ్లారు. అయితే అక్కడి అర్చకులు. ఆలయ నిర్వాహకులు అనుమతించకపోవడంతో భంగపడ్డారు. కానీ తన ఆధ్యాత్మిక పర్యటనను మాత్రం ఆపలేదు. ఇటీవల తమిళనాడులోని పళని కుమారస్వామి ఆలయానికి వెళ్ళి స్వామి దర్శనం చేసుకున్నారు. ప్రస్తుతం అమలాపాల్ ఇండోనేషియాలోని బాలి దీవికి వెళ్లి అక్కడ ఓ ఆశ్రమంలో బస చేశారు. అక్కడ ప్రకృతి సిద్ధమైన ఆహారాన్ని తీసుకుంటూ యోగా ధ్యానంలో నిమగ్నమయ్యారు. ఈ విషయాన్ని అమలాపాల్ తన ఇన్‌స్టాగ్రామ్ వీడియో ద్వారా వెల్లడించారు. ఆ వీడియో ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతోంది.