అనసూయ భరద్వాజ్ గురించి తెలుగు ప్రేక్షకులకు తెలిసిందే. బుల్లితెరపై యాంకర్‌గా కెరీర్‌ని ప్రారంభించి.. వెండితెరపై దూసుకెళ్తోంది. నిడివిని పట్టించుకోకుండా.. విభిన్నమైన పాత్రలను పోషిస్తూ.. టాలీవుడ్‌లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. ముఖ్యంగా రంగస్థలం’లోని రంగమ్మత్త క్యారెక్టర్ అనసూయకు మంచి గుర్తింపుని తేవడంతో పాటు వరుస సినిమా అవకాశాలు వచ్చేలా చేసింది.
అయితే అనసూయ మాత్రం సినిమా ఎంపిక విషయంలో ఆచుతూచి వ్యవహరిస్తోంది. కేవలం డబ్బు కోసమే కాకుండా..గుర్తింపు వచ్చే పాత్ర ఉంటేనే సినిమాలు ఒప్పుకుంటుంది. అందుకే మన దర్శకులు అనసూయ కోసం ప్రత్యేక పాత్రలను క్రియేట్ చేస్తున్నారు. ఇటీవల విడుదలైన పెదకాపు చిత్రంలోనూ.. అనసూయ మంచి పాత్ర పోషించింది. ప్రస్తుతం పుష్ప 2తో పాటు పలు సినిమాల్లోనూ నటిస్తోంది.
కెరీర్ పరంగా ఇలా ఎంత బిజీగా ఉన్నప్పటికీ.. సోషల్ మీడియాలో మాత్రం యాక్టివ్‌గా ఉంటుంది అనసూయ. ఖాళీ సమయం దొరికినప్పుడల్లా తన సోషల్ మీడియా ఖాతాల్లో వ్యక్తిగత ఫోటోలు, వీడియోలు షేర్ చేస్తుంది. ఆమె షేర్ చేసే కొన్ని ఫోటోలు, వీడియోలు కాంట్రవర్సీకి దారి తీసిన సందర్భాలు కూడా ఉన్నాయి. ఆమె పెట్టే పోస్ట్‌లను కొంతమంది నెటిజన్స్ ట్రోల్ చేస్తుంటారు. అందులో ముఖ్యంగా ‘ఆంటీ’అనే పదాన్ని వాడుతూ నెగెటివ్ కామెంట్స్ చేస్తుంటారు. ‘ఆంటీ’ అనే పదం వింటే తనకు ఎందుకు కోపం వస్తుందో తాజాగా ఓ ఇంటర్వ్యూలో వివరించింది అనసూయ.
ఆంటీ అనే పదం తప్పు కాదు కానీ..
ఎదైన అంశంపై నేను స్పందిస్తే చాలు.. ‘ఇంట్లో ఉండి పిల్లలను చూసుకోవచ్చు కదా ఆంటీ ’అని కామెంట్స్ పెడతారు. ‘ఆంటి అనే పదం తప్పు కాదు.. కానీ చాలామంది ఇప్పుడు ఈ పదాన్ని వల్గర్‌గానే వాడుతున్నారు. చిన్న పిల్లలు, తెలిసిన వాళ్ళు వచ్చి ఆంటీ అని ముద్దుగా పిలుస్తారు. అలా వాళ్లు ఆంటీ అని పిలిస్తే నాకు ఇష్టమే. కానీ నా కంటే పెద్దవాళ్లు, తెలియని వాళ్లు ‘ఆంటీ’ అని మరో అర్థం వచ్చేలా పిలిస్తారు. అందుకే నాకు ఆ పదం నచ్చదు. ఆంటీ అంటే ఇంగ్లీష్ లో పిన్ని అని అర్థం. అమ్మ తర్వాత అమ్మ లాంటి వాళ్ళని పిలవడానికి ఈ పదాన్ని వాడతారు. కానీ ఇప్పుడు ఆ పదాన్ని కొంతమంది వల్గర్‌గా వాడుతున్నారు.
వాళ్లే భవిష్యత్తులో రేపిస్టులు అవుతారు
నేను చిన్నప్పుడు చాలా మందిని ఆంటీ అనే పిలిచాను. ఇప్పటికీ కొంతమంది తెలిసిన వాళ్లను అలానే పిలుస్తాను. ఆంటీ అని పిలవడం వాళ్లకు నచ్చకపోతే.. నేను పిలవడమే మానేస్తాను. అలా పిలిస్తే..వాళ్లు హర్ట్ అవుతారని నేను అర్థం చేసుకోగలను. నాకు ఆంటీ అని పిలిపించుకోవడం ఇష్టం లేదని చెప్పిన తర్వాత..మళ్లీ మళ్లీ ఎందుకు అనాలి? పైశాచిక ఆనందం కోసం ఎదుటివాళ్లను హర్ట్ చేయాలా? నా మీద కామెంట్స్ చేసిన వాళ్లను ఈ జన్మలో ఎప్పుడో ఒక్కసారైనా ఎదురెదురుగా చూసే అవకాశం వస్తుందో లేదో నాకు తెలియదు. పైగా నేను ఎలా ఉంటానో అతనికి తెలియదు. ఇలా ఫేస్ టు ఫేస్ పరిచయం లేని వ్యక్తిపైనే ఇంత అయిష్టాన్ని పెంచుకుంటే.. చుట్టుపక్కల ఉన్న మహిళలను ఇంకెలా చూస్తారు? ఇలాంటి వాళ్లే భవిష్యత్తులో రేపిస్టులుగా మారుతారు’అని అనసూయ చెప్పుకొచ్చారు.
Comments
Please login to add a commentAdd a comment