Animal Review: ‘యానిమల్‌’మూవీ రివ్యూ | Animal Movie Review And Rating In Telugu | Sakshi
Sakshi News home page

Animal Review: ‘యానిమల్‌’మూవీ రివ్యూ

Published Fri, Dec 1 2023 12:26 PM | Last Updated on Fri, Dec 1 2023 3:03 PM

Animal Movie Review And Rating In Telugu - Sakshi

టైటిల్‌: యానిమల్‌
నటీనటులు: రణ్‌బీర్‌ కపూర్‌, రష్మిక మందన్నా, అనిల్‌ కపూర్‌, బాబీ డియోల్‌ తదితరులు
నిర్మాణ సంస్థలు:టి-సిరీస్, భద్రకాళి పిక్చర్స్
దర్శకత్వం: సందీప్‌ రెడ్డి వంగా
నేపథ్య సంగీతం: హర్షవర్ధన్ రామేశ్వర్
సినిమాటోగ్రఫీ: అమిత్ రాయ్
ఎడిటింగ్‌: సందీప్‌ రెడ్డి వంగా
విడుదల తేది: డిసెంబర్‌ 1, 2023



‘యానిమల్‌’ కథేంటంటే..
బల్బీర్‌ సింగ్‌(అనిల్‌ కపూర్‌) దేశంలోనే అత్యంత ధనవంతుడైన వ్యాపారవేత్త. అతని కొడుకు రన్‌ విజయ్‌ సింగ్‌ బల్బీర్‌(రణ్‌బీర్‌ కపూర్‌). విజయ్‌కి చిన్నప్పటి నుంచే కాస్త అగ్రెసివ్‌.  తండ్రి అంటే చాలా ఇష్టం. అతనితో గడిపేందుకు చాలా ప్రయత్నిస్తాడు. కానీ బల్బీర్‌ బిజినెస్‌ పనుల్లో బిజీ కావడంతో ఫ్యామిలీకి టైమ్‌ కేటాయించేవాడు కాదు. ఇదిలా ఉంటే.. విజయ్‌ స్కూల్‌ డేస్‌లో తన అక్కను ఒకరు ర్యాగింగ్‌ చేశారని గన్‌తో బెదిరిస్తాడు. ఈ విషయం బల్బీర్‌కి తెలియడంతో బోర్డింగ్‌ స్కూల్‌కి పంపిస్తాడు.

తండ్రికి దూరంగా పెరిగిన విజయ్‌..కొన్నాళ్లకు తిరిగి వస్తాడు. నాన్న 60వ బర్త్‌డే సెలబ్రేషన్స్‌లో బావతో గొడవ పడతాడు. దీంతో మళ్లీ తండ్రి కొడుకుల మధ్య దూరం పెరుగుతుంది. స్కూల్‌మేట్‌ గీతూ అలియాస్‌ గీతాంజలి(రష్మిక మందన్నా)ని పెళ్లి చేసుకొని విజయ్‌ అమెరికాకు వెళ్తాడు. కొన్నాళ్లకు తండ్రిపై అటాక్‌ జరిగిందని తెలిసి తిరిగి ఇండియాకు వస్తాడు. నాన్నను చంపేందుకు ప్రయత్నించివారిని తలలు నరుకుతానని ప్రామిస్‌ చేస్తాడు. అసలు బల్బీర్‌పై అటాక్‌ చేసిందెవరు? వారిని విజయ్‌ ఎలా కనిపెట్టాడు? తండ్రిని కాపాడుకోవడం కోసం విజయ్‌ ఏం చేశాడు? సొంత బావను ఎందుకు చంపాల్సివచ్చింది?  అబ్రార్‌ హక్‌(బాబీ డియోల్‌) ఎవరు? అతనికి బల్బీర్‌ సింగ్‌ ప్యామిలీకి మధ్య ఉన్న శత్రుత్వం ఏంటి?  చివరకు విజయ్‌ తన తండ్రిని కాపాడుకున్నాడా? లేదా? అనేది తెలియాలంటే సినిమా చూడాల్సిందే. 


ఎలా ఉందంటే.. 
తండ్రి కోసం ఏదైనా చేయగలిగే ఓ కొడుకు పిచ్చి ప్రేమ కథే ‘యానిమల్‌’.  ఇదొక రివేంజ్‌ డ్రామా.  కానీ సందీప్ రెడ్డి వంగా  ఈ కథను చాలా బోల్డ్‌గా, వయోలెంట్‌గా  తెరపై చూపించాడు. కథగా చూస్తే..ఇందులో తండ్రి కొడుకుల ప్రేమ, కుటుంబ అనుబంధాలు, భార్య భర్తల బాండింగ్‌ ఇవన్నీ ఉంటాయి. కానీ ఫ్యామిలీతో కలిసి చూడలేని విధంగా కథనం సాగుతుంది. అలాగే కామెడీ కూడా బోల్డ్‌గానే ఉంటుంది.

సినిమా మొత్తం సందీప్‌రెడ్డి వంగా స్టై‍ల్లోనే  సాగుతుంది. నాన్న పాటతో చాలా ఎమోషనల్‌గా కథ ప్రారంభం అవుతుంది. ఆ తర్వాత హీరో పాత్ర అగ్రెసివ్‌గా ఉంటుందని ఒకటి, రెండు సన్నివేశాలతో తెలియజేశాడు. హీరోయిన్‌ ఎంట్రీ చాలా సింపుల్‌గా ఉంటుంది. ఎంగేజ్‌మెంట్‌ అయిన హీరోయిన్‌ని..తన మాటలతో హీరో ప్రేమలో పడేసే సీన్‌ చాలా కొత్తగా,థ్రిల్లింగ్‌గా అనిపిస్తుంది. ఫస్టాఫ్‌లో హీరో హీరోయిన్ల మధ్య వచ్చే సీన్స్‌ చాలా బోల్డ్‌గా ఉంటాయి. అలాగే వయోలెన్స్‌ కూడా ఎక్కువే. ముఖ్యంగా ఇంటర్వెల్‌ ముందు వచ్చే యాక్షన్‌ సీన్‌ అయితే అదిరిపోతుంది. తనదైన స్క్రీన్‌ప్లేతో ఫస్టాఫ్‌ని చాలా ఇంట్రెస్టింగ్‌గా నడిపించాడు సందీప్‌ రెడ్డి.

ఇక సెకండాఫ్‌లో చాలా సన్నివేశాలు సాగదీతగా అనిపిస్తాయి. హీరో ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్‌ అయి వచ్చిన తర్వాత ఇంట్లో డాక్టర్లతో మాట్లాడే మాటలు చాలా బోల్డ్‌గా ఉంటాయి. హీరో నగ్నంగా ఆరు బయటకు రావడానికి గల కారణం కన్విన్సింగ్‌గానే ఉంటుంది. ఈ సీన్‌ కంటే ముందు వచ్చే సన్నివేశాల్లో రణ్‌బీర్‌ ఫెర్ఫార్మెన్స్‌ అదిరిపోయేలా ఉంటుంది. విజయ్‌ ఎంత క్రూరంగా ప్రవర్తించినప్పటికీ.. గీతాంజలి ఎందుకు భరిస్తుందో తెలియజేసే సీన్‌..భార్య భర్తల మధ్య ఉన్న బాడింగ్‌ని తెలియజేస్తుంది.

ఇక జోయాతో రొమాన్స్‌ తర్వాత..గీతాంజలి, విజయ్ మధ్య వచ్చే సీన్లు చాలా మెచ్యుర్డ్‌గా ఉంటాయి. బాబీ డియోల్‌ పాత్ర ఎంట్రీ సీన్‌ అదిరిపోతుంది. క్లైమాక్స్‌లో బాబీ, రణ్‌బీర్‌కి మధ్య వచ్చే యాక్షన్‌ సీన్‌ సినిమాకు మరో హైలెట్‌. యాక్షన్‌, ఫ్యాక్షన్‌ కలబోసిన ఓ ఎమోషననల్‌ ఫ్యామిలీ డ్రామా ఇది. అయితే మితిమీరిన హింస, శృంగార సన్నివేశాల కారణంగా ఫ్యామిలీ ఆడియెన్స్‌ కు కాస్త ఇబ్బంది అనిపించొచ్చు కానీ, మిగతావారికి మాత్రం ఓ డిఫరెంట్‌ మూవీ చూశామనే ఫీలింగ్‌ కలుగుతుంది.

ఎవరెలా చేశారంటే..
రణ్‌బీర్‌ కపూర్‌ నటన గురించి అందరికి తెలిసిందే. ఎలాంటి పాత్రలో అయినా పరకాయ ప్రవేశం చేస్తాడు. రణ్‌ విజయ్‌ సింగ్‌ పాత్రలో ఆయన ఒదిగిపోయాడు. టీనేజ్‌.. యంగ్‌ ఏజ్‌, ఓల్డ్‌ ఏజ్‌ ఇలా మూడు దశల పాత్రల్లోనూ తనదైన నటనతో అదరగొట్టేశాడు. ఈ క్యారెక్టర్‌లో రణ్‌బీర్‌ తప్ప మరొకరు నటించలేరు అనేంతలా అతని యాక్టింగ్‌ ఉంటుంది. గీతాంజలి పాత్రకు రష్మిక న్యాయం చేసింది. రణ్‌బీర్‌, రష్మికల మధ్య ఆన్‌స్క్రీన్‌ కెమిస్ట్రీ బాగా వర్కౌట్‌ అయింది. రొమాంటిక్‌ సీన్స్‌లో ఇద్దరూ జీవించేశారు. జోయా గా తృప్తి దిమ్రి తన పాత్ర పరిధిమేర నటించింది. బల్బీర్‌ సింగ్‌ పాత్రలో అనిల్‌ కపూర్‌ ఒదిగిపోయాడు. కథ మొత్తం ఆయన పాత్ర చుట్టే తిరుగుతుంది.  బాబీ డియోల్‌ విలనిజం బాగా పండించాడు. 

ఇక సాంకేతిక విషయాలకొస్తే.. ఈ సినిమాకు మరో ప్రధాన బలం రామేశ్వర్‌ నేపథ్య సంగీతం. తనదైన బీజీఎంతో సినిమాను ఓ రేంజ్‌కు తీసుకెళ్లాడు. యాక్షన్‌ సీన్స్‌కి అతను అందించిన బీజీఎం వేరే లెవెల్‌. ఈ చిత్రం నిడివి 3.23 గంటలు. అయితే చాలా సన్నివేశాలను తొలగించే అవకాశం ఉన్నప్పటికీ..డైరెక్టర్‌ సందీప్‌ రెడ్డే ఎడిటర్‌గా వ్యవరించడంతో కత్తిరించడానికి మనసు ఒప్పుకోనట్లుంది. సెకండాఫ్‌లో కొన్ని సీన్స్‌ని మరింత క్రిస్పీగా కట్‌ చేసి నిడివిని కాస్త తగ్గిస్తే బాగుండేది. సినిమాటోగ్రఫీ బాగుంది. నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగ్గట్లు ఉన్నతంగా ఉన్నాయి. 
- అంజి శెట్టె, సాక్షి వెబ్‌డెస్క్‌

No comments yet. Be the first to comment!
Add a comment
Rating:

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement