Avatar: The Way Of Water Movie Review And Rating In Telugu - Sakshi
Sakshi News home page

Avatar 2 Movie Review: ‘అవతార్‌-ది వే ఆఫ్ వాటర్’ మూవీ రివ్యూ

Published Fri, Dec 16 2022 3:26 PM | Last Updated on Fri, Dec 16 2022 5:07 PM

Avatar The Way Of Water Movie Review And Rating In Telugu - Sakshi

టైటిల్‌: అవతార్‌-ది వే ఆఫ్ వాటర్
నటీనటులు:  సామ్‌ వర్తింగ్టన్‌, జోయా సాల్డానా, స్టీఫెన్‌లాంగ్‌, సిగర్నీ వీవర్‌, కేట్‌ విన్‌స్లెట్‌, క్లిఫ్‌ కర్టిస్‌, జోయెల్‌ డేవిడ్‌ మూర్‌ తదితరులు
నిర్మాణ సంస్థలు: లైట్‌స్ట్రోమ్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌, టీఎస్‌జీ ఎంటర్‌టైన్‌మెంట్‌
నిర్మాతలు: జేమ్స్‌ కామెరూన్‌, జోన్‌ లాండౌ
దర్శకత్వం: జేమ్స్‌ కామెరూన్‌
సంగీతం: సైమన్‌ ఫ్రాంగ్లెన్‌
సినిమాటోగ్రఫీ: రస్సెల్‌ కర్పెంటర్‌
ఎడిటింగ్‌ : స్టీఫెన్‌ ఈ, డెవిడ్‌ బ్రేన్నర్‌, జాన్‌ రెఫౌవా
విడుదల తేది: డిసెంబర్‌ 16, 2022

కథేంటంటే...
మానవ సైన్యంతో పోరాడి పండోరా ప్రపంచాన్ని కాపాడిన  జేక్‌ సెల్లీ ( సామ్‌ వర్తింగ్టన్‌) .. నావీ తెగకు నాయకుడవుతాడు. భార్య నేత్రి(జోయా సాల్డానా) కలిసి అక్కడే ఉంటాడు. వారికి లోక్‌, నితాయాం,  టూక్‌ అనే ముగ్గురు పిల్లలు పుడతారు. అలాగే కిరీ అనే అమ్మాయిని, స్పైడర్‌ అనే అబ్బాయిని దత్తత తీసుకుంటారు. పండోరా ప్రజలను యోగక్షేమాలు చూసుకుంటూ హాయిగా జీవిస్తుంటారు జేక్‌ సెల్లీ ఫ్యామిలీ.

అదే సమయంలో పండోరాని ఆక్రమించేందుకు మనుషులు మరోసారి దండయాత్రకు వస్తారు. జేక్‌ సెల్లీ ఫ్యామిలీని అంతమొందిస్తే పండోరా గ్రహాన్ని ఆక్రమించుకోవచ్చని.. ఆ దిశగా పోరాటం చేస్తుంటారు. మనుషుల నుంచి తన కుటుంబాన్ని రక్షించుకునేందుకు జేక్‌ సెల్లి..మెట్‌ కానియా ప్రాంతానికి పారిపోతాడు. 

సముద్రమే ప్రపంచంగా జీవించే మెట్‌ కానియా తెగ... జేక్‌ సెల్లీ రాకను అడ్డుకుంటుంది. అయితే అక్కడి రాజు టోనోవరి వీరికి అండగా నిలబడతాడు. మెట్‌కానియా తెగ మాదిరే.. జేక్‌ ఫ్యామిలీ కూడా సముద్రంతో అనుబంధం ఏర్పరచుకొని హాయిగా జీవితం గడుపుతుంటారు. ఈ విషయం మనుషులకు తెలుస్తుంది. ఎలాగైన జేక్‌ సల్లీ కుటుంబాన్ని మట్టుబెట్టాలని కల్నల్‌ మైల్స్‌ క్వారిచ్‌(స్టీఫెన్‌లాంగ్‌) అతని బృందంతో కలిసి మెట్‌ కానియా ప్రాంతంపై దండయాత్రకు వస్తాడు. మనుషుల బృందాన్ని జేక్‌ సెల్లీ ఎలా ఎదుర్కొన్నారు. అతనికి మెట్‌ కానియా తెగ ఎలా సహాయం చేసింది. పిల్లలను రక్షించుకోవడానికి నేత్రీ, జేక్‌ సెల్లీ ఎలాంటి పోరాటం చేశారనేదే మిగతా కథ.

ఎలా ఉందంటే.. 
‘అవతార్’ చిత్రంలో పండోరా గ్రహాన్ని సృష్టించి, సరికొత్త  ప్రకృతి అందాలను తెరపై ఆవిష్కరించారు దర్శకుడు జేమ్స్ కామెరూన్. 13 ఏళ్ల క్రితం వచ్చిన ఈ సినిమా అప్పట్లో ఓ సంచలనం. అప్పటి వరకు చూడని వింత జీవులు.. తెలియని ప్రపంచం.. సరికొత్త ప్రేమాయణం.. ఇలా ఎన్నో ప్రత్యేకతలు ఆ సినిమాలో ఉన్నాయి. ప్రేక్షకులకు సరికొత్త అనుభూతిని కలిగించింది. అందుకే 13 ఏళ్లు తర్వాత వచ్చిన సీక్వెల్‌పై సీనీ ప్రేక్షకులు భారీ అంచనాలు ఏర్పరచుకున్నారు. మరోసారి కొత్త ప్రపంచంలోకి వెళ్లోచ్చని ఆశపడ్డారు. నిజంగానే జేమ్స్‌ కామెరూన్‌ మరో ప్రపంచాన్ని చూపించాడు.

సముద్ర గర్భంలో ఓ అందమైన ప్రపంచం ఉందని ప్రేక్షకులకు పరిచయం చేశాడు. సినిమా ప్రారంభంలో కాసేపు ‘అవతార్‌’మాదిరే పండోరా గ్రహంలోని అందాలను చూపించిన దర్శకుడు... ఆ తర్వాత కథను సముద్రంవైపు మళ్లించాడు. సముద్రం అడుగున చూపించే ప్రతి సన్నివేశం ప్రేక్షకులను కట్టిపడేస్తాయి. తిమింగలంతో జేక్స్‌ తనయుడు చేసే పోరాటం ఆకట్టుకుంది. అలాగే పాయకాన్‌(భారీ ఆకారం గల చేప)తో లోక్‌ స్నేహం.. క్లైమాక్స్‌ అది చేసిన పోరాటం సినిమాకు హైలెట్‌ అని చెప్పొచ్చు. నితాయాం చనిపోయే సన్నివేశం హృదయాలను హత్తుకుంటాయి. 

విజువల్స్‌ పరంగా అవతార్‌  కంటే గొప్పగా ఈ చిత్రం ఉంటుంది. కానీ కథలో మాత్రం కొత్తదనం కొరవడింది. సాధారణ రివేంజ్‌ డ్రామాగా కథనం సాగుతుంది. జేక్‌ సెల్లీ ఫ్యామిలీని అంతమొందించేందుకు  కల్నల్‌ మైల్స్‌ ప్రయత్నించడం..అతని దాడిని  జేక్‌ సెల్లీ తిప్పికొట్టడం..ఇదే ఈ సినిమా కథ. నేత్రి పిల్లలను కల్నల్‌ బందించడం.. జేక్స్‌ పోరాటం  చేసి తిరిగి తెచ్చుకోవడం.. కథనం మొత్తం ఇలానే సాగుతుంది. ఈ తరహా కథలు తెలుగులో చాలానే వచ్చాయి. కానీ కొత్త జీవులు, విజువల్స్‌ యాడ్‌ చేయడం వల్ల అవతార్‌ 2 కాస్త డిఫరెంట్‌గా కనిపిస్తుంది. ఇక క్లైమాక్స్‌లో నౌకలో వచ్చే కొన్ని సన్నివేశాలు టైటానిక్‌ సినిమాను గుర్తు చేస్తాయి. విజువల్స్ అండ్ యాక్షన్ సన్నివేశాలు సినిమాకు ప్లస్‌ అయితే..  సినిమా నిడివి(192.10 నిమిషాలు), ఊహకందేలా కథనం సాగడం మైనస్‌.

ఎవరెలా చేశారంటే..
ఈ చిత్రంలో హీరో జేక్‌ సెల్లీగా సామ్‌ వర్తింగ్టన్‌ నటించాడు. ఓ తెగ నాయకుడిగా, పిల్లలకు మంచి తండ్రిగా చక్కని నటన కనబరిచాడు. యాక్షన్‌ సీన్స్‌ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అవతార్‌కు మించిన యాక్షన్స్‌ సీన్స్‌ ఇందులో ఉన్నాయి. నెగెటివ్‌ షేడ్స్‌ ఉన్న కల్నల్‌ మైల్స్‌ క్వారిచ్‌ పాత్రలో స్టీఫెన్‌లాంగ్‌ ఒదిగిపోయాడు. నేత్రిగా జోయా సాల్డానా చక్కని నటనను కనబరిచింది. నౌకలో ఆమె చేసే పోరాట ఘట్టాలు హైలైట్‌.  సిగర్నీ వీవర్‌, కేట్‌ విన్‌స్లెట్‌, క్లిఫ్‌ కర్టిస్‌, జోయెల్‌ డేవిడ్‌ మూర్‌లతో పాటు మిగిలిన నటీనటులు తమ పాత్రల పరిధిమేర నటించారు. సాంకేతిక విషయాల్లో వంక పెట్టనక్కర్లేదు. సంగీతం, సినిమాటోగ్రఫీ, స్క్రీన్‌ప్లే..ప్రతీది అద్భుతంగా ఉన్నాయి. ఎడిటర్‌ తన కత్తెరకు ఇంకాస్త పనిచెప్పాల్సింది. సినిమాలో అనవసరపు సన్నివేశాలు చాలా ఉన్నాయి. వాటిని తొలగించి సినిమా నిడివిని తగ్గిస్తే.. బాగుండేది. నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగ్గట్లుగా ఉన్నతంగా ఉన్నాయి. 
- అంజిశెట్టి, సాక్షి వెబ్‌ డెస్క్‌

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement