టైటిల్: బేబీ
నటీనటులు: ఆనంద్ దేవరకొండ, విరాజ్ అశ్విన్, వైష్ణవి చైతన్య, నాగబాబు, వైవా హర్ష, ప్రభావతి లిరీష తదితరులు
నిర్మాణ సంస్థ: మాస్ మూవీ మేకర్స్
నిర్మాత: ఎస్‌కేఎన్
దర్శకత్వం: సాయి రాజేశ్
సంగీతం: విజయ్ బుల్గానిన్
సినిమాటోగ్రఫీ: ఎమ్ఎన్ బాల్ రెడ్డి
విడుదల తేది: జులై 14, 2023
బేబీ కథేంటంటే..
ఆనంద్(ఆనంద్ దేవరకొండ) ఓ బస్తీ యువకుడు. అతని ఎదురింటిలో ఉండే అమ్మాయి వైష్ణవి(వైష్ణవి చైతన్య) అతన్ని ప్రేమిస్తుంది. ఆనంద్ కూడా వైష్ణవిని ఇష్టపడుతుంది. వీరి ప్రేమ స్కూల్ డేస్‌లో మొదలవుతుంది. అయితే పదో తరగతి ఫెయిల్ కావడంతో ఆనంద్ ఆటో డ్రైవర్ అవుతాడు. వైష్ణవి మాత్రం ఇంటర్ పూర్తి చేసి బీటెక్ కాలేజీలో జాయిన్ అవుతుంది. అక్కడ వైష్ణవికి ఓ ధనవంతుడి కొడుకు విరాజ్(విరాజ్ అశ్విన్) పరిచయం అవుతాడు. మొదట్లో ఫ్రెండ్స్‌గా దగ్గరవుతారు. ఆ తర్వాత పబ్బులో రొమాన్స్ చేస్తారు. ఓ కారణంగా 31 రోజుల పాటు డేటింగ్ కూడా చేస్తారు. ఈ విషయం ఆనంద్‌కు తెలిసిందా? తెలిసిన తర్వాత ఎలా రియాక్ట్ అయ్యాడు? ఇద్దరిలో వైష్ణవి ప్రేమించిదెవరిని? బస్తీలో పుట్టి పెరిగిన వైష్ణవికి పబ్ కల్చర్ ఎలా అలవాటు పడింది? వైష్ణవి చేసిన ఒక తప్పు ఆమె జీవితాన్ని ఎలా నాశనం చేసింది? వైష్ణవి, ఆనంద్, విరాజ్‌ల ట్రైయాంగిల్ లవ్‌స్టోరికి ఎలాంటి ముగింపు పడింది? అనేది తెలియాలంటే బేబీ మూవీ చూడాల్సిందే.
ఎలా ఉందంటే..
ఈ తరం యువతీయువకుల్లో చాలా మంది ఈజీగా ప్రేమలో పడుతున్నారు. అయితే ఆ ప్రేమ ఒకరికి మాత్రమే పంచడం లేదు. ఒకరికి తెలియకుండా మరొకరితో రిలేషన్‌లో ఉంటూ చివరికి తమ జీవితాలను నాశనం చేసుకుంటున్నారు. ఇదే కాన్సెప్ట్‌తో తెరకెక్కిన సినిమా బేబీ. ప్రస్తుతం జరుగుతున్న వాస్తవ పరిస్థితులను అద్దం పట్టేలా ఈ చిత్రాన్ని రూపొందించారు దర్శకుడు సాయి రాజేష్.
పాఠశాల, కాలేజీల్లో ఈతరం ప్రేమ కథలు ఎలా ఉంటున్నాయి ? తెలిసి తెలియక చేసిన చిన్న చిన్న తప్పులు ఎక్కడికి దారితీస్తున్నాయి? మన చుట్టూ ఉండే స్నేహితులు, పరిస్థితుల ప్రభావం తెలియకుండానే మనపై ఎలా పడతాయి? తదితర విషయాలను కళ్లకు కట్టినట్లు చూపించారు. దీంతో పాటు ప్రతి వ్యక్తి తొలి ప్రేమను మర్చిపోలేరనే విషయాన్ని అంతర్లీనంగా చూపించారు.
బేబీ కథ కొత్తది అని చెప్పలేం. నిత్యం మనం వార్తల్లో చూస్తున్న, వింటున్న సంఘటనలే సినిమాలో కనిపిస్తాయి. ఈ తరహా ట్రైయాంగిల్ లవ్‌స్టోరీలు తెలుగు ప్రేక్షకులకు కొత్తేమి కాదు కానీ కాస్త భిన్నంగా కథనం సాగుతుంది. ఆనంద్ విషాదకరమైన జీవితానికి సంబంధించిన సీన్‌తో కథ ప్రారంభం అవుతుంది. ఆ తర్వాత స్కూల్‌డేస్ లవ్‌స్టోరీ చాలా సహజంగా హృదయాలను హత్తుకునేలా సాగుతుంది. ఆనంద్ పదో తరగతి ఫెయిల్ అవ్వడం.. వైష్ణవి పై చదువుల కోసం ఓ పెద్ద కాలేజీలో చేరడంతో కథ మలుపు తీసుకుంటుంది.
బస్తీ నుంచి వచ్చిన వైష్ణవి సిటీ కల్చర్‌కి అలవాటు పడడం, తోటి స్నేహితులను చూసి తన లైఫ్ స్టైల్‌ని మార్చుకోవడం.. అది ఆనంద్‌కు నచ్చకపోవడం..ఇద్దరి మధ్య గొడవ.. ప్రతి సీన్ చాలా సహజంగా సాగుతుంది. విరాజ్ పరిచయంతో ఈ ప్రేమకథ ట్రయాంగిల్ లవ్‌స్టోరీగా మారుతుంది. ఇంటర్వెల్ ముందు మద్యం మత్తులో ఆనంద్‌కి వైష్ణవి కాల్ చేసి అమ్మాయిల గురించి చెప్పే సంభాషణలు అదిరిపోతాయి.
ఇక ఇంటర్వెల్ ట్విస్ట్ అదిరిపోవడంతో పాటు సెండాఫ్‌పై ఆసక్తిని పెంచుతుంది. అయితే ద్వితియార్థంలో కథనం కాస్త నెమ్మదిగా సాగినట్లు అనిపిస్తుంది. అలాగే కొన్ని సన్నివేశాలు గత సినిమాలను గుర్తుకు తెస్తాయి. క్లైమాక్స్ భావోధ్వేగభరితంగా ఉంటుంది. ఓ బూతు పదాన్ని హీరోయిన్ చేత పదే పదే అనిపించడం, విరాజ్‌తో బెడ్‌రూమ్ సీన్ ఫ్యామిలీ ఆడియన్స్‌కి కాస్త ఇబ్బందిగా అనిపిస్తాయి. కానీ ఈ తరం యూత్‌కి మాత్రం బాగా కనెక్ట్ అవుతుంది.
ఎవరెలా చేశారంటే..
ఈ సినిమాలో ఆనంద్ దేవరకొండ చాలా కొత్తగా కనిపించాడు. భగ్న ప్రేమికుడు, ఆటో డ్రైవర్ ఆనంద్ పాత్రలో ఒదిగిపోయాడు. హీరోయిన్‌తో కెమిస్ట్రీ బాగా వర్కౌట్ అయింది. క్లైమాక్స్‌తో ఎమోషనల్ సన్నివేశాల్లోనూ చక్కగా నటించాడు. ఇక సంపన్న కుటుంబానికి చెందిన విరాజ్ పాత్రకి విరాజ్ అశ్విన్ న్యాయం చేశాడు.
వైష్ణవి చైతన్యకు బెస్ట్ మూవీ ఇది. తొలి సినిమాతోనే నటనకు స్కోప్ ఉన్న పాత్ర లభించింది. బస్తీ అమ్మాయిగా, గ్లామర్ గాళ్‌గా లుక్స్‌లోనే కాదు నటనలోనే వేరియేషన్ చూపించి ఆకట్టుకుంది. సినిమా మొత్తం ఈమె పాత్ర చుట్టే నడుస్తుంది. ఇకవైపు అందాలను ఒలకబోస్తూనే, కావాల్సిన చోట, ముఖ్యంగా ఎమోషనల్ సన్నివేశాల్లో చక్కటి నటనను కనబరిచింది. హీరోయిన్ తండ్రిగా నాగబాబు, హీరో స్నేహితులుగా హర్ష, సాత్విక్ తమ పాత్రల పరిధిమేర నటించారు.
ఇక సాంకేతిక విషయాలకొస్తే.. ఈ సినిమాకు ప్రధాన బలం విజయ్ బుల్గానిన్ సంగీతం. మంచి పాటలతో పాటు అదిరిపోయే బీజీఎంతో సినిమా స్థాయిని పెంచాడు. సాయి రాజేశ్ సంభాషణలు ఆకట్టుకోవడంతో పాటు ఆలోచింపజేస్తాయి. ఎమ్ఎన్ బాల్ రెడ్డి సినిమాటోగ్రపీ బాగుంది. ఎడిటర్ పనితీరు పర్వాలేదు. నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగ్గట్లు ఉన్నతంగా ఉన్నాయి.
-అంజి శెట్టె, సాక్షి వెబ్‌డెస్క్
Comments
Please login to add a commentAdd a comment