Balakrishna About Akhanda Movie Success In Sankranthi Sambaralu Event: ‘‘రకరకాల సినిమాలు ఉండొచ్చు. కానీ ప్రేక్షకులు తమ అభిమాన హీరోలను ఒక రకంగానే ఊహించుకుంటారు. స్టార్స్‌తో (స్టార్ యాక్టర్లు) ప్రయోగాలు చేయకూడదు. గతంలో స్టార్స్ చేసిన ప్రయోగాత్మక చిత్రాలకు జాతీయ అవార్డులు వచ్చాయి కానీ కొన్ని కమర్షియల్‌గా రాణించలేదు. ‘అఖండ’లో నా అఘోరా పాత్ర గెటప్ గురించి బోయపాటిగారు అన్ని జాగ్రత్తలు తీసుకున్నారు’’ అని బాలకృష్ణ అన్నారు. బాలకృష్ణ హీరోగా బోయపాటి శ్రీను దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘అఖండ’. మిర్యాల రవీందర్ రెడ్డి నిర్మించిన ఈ చిత్రం గత ఏడాది డిసెంబరు 2న విడుదలైంది.
ఈ చిత్రం యాభై రోజుల దిశగా వెళుతోందని చిత్రబృందం పేర్కొంది. ఈ సందర్భంగా బుధవారం జరిగిన ‘అఖండ’ థ్యాంక్స్ మీట్‌లో బాలకృష్ణ మాట్లాడుతూ.. ‘‘అఖండ’ సందేశాత్మక, వినోదాత్మక చిత్రం. అందుకే ప్రేక్షకుల ఆదరణ లభిస్తోంది. కొందరి నిర్మాతల్లా కాకుండా కరోనా పరిస్థితులు భయపెడుతున్నా ధైర్యంగా రిలీజ్‌కు ముందడుగు వేసిన మిర్యాల రవీందర్‌వంటి నిర్మాతలు కూడా ఇండస్ట్రీలో ఉండాలి. ప్రపంచం గర్వించదగ్గ దర్శకుల్లో బోయపాటి శ్రీనుగారు ఉన్నారు. సినిమా అనేది ప్రజలకు నిత్యావసర వస్తువు అయిపోయింది.
ఎంతోమంది ఉపాధి ఆధారపడి ఉన్న ఇండస్ట్రీకి ప్రభుత్వాలు సహకరించాలని కోరుకుంటున్నాను. ఇక ఆంధ్రప్రదేశ్‌లో సినిమా టికెట్ ధరల విషయంపై ప్రత్యేకంగా నా అభిప్రాయం అంటూ ఏదీ లేదు. ఇండస్ట్రీలోని అన్ని సెక్టార్ల వారూ ఈ విషయంపై చర్చించుకుని సమష్టిగా ప్రభుత్వాలను సంప్రదించాలి’’ అన్నారు. అలాగే బోయపాటి శ్రీను మాట్లాడుతూ.. ‘‘సాధారణంగా ఒక హీరో సినిమాను ఆ హీరో అభిమానులే ఎక్కువగా చూస్తారు. కానీ ‘అఖండ’ను అందరు హీరోల ఫ్యాన్స్, ప్రేక్షకులు చూసి విజయం అందించారు. ‘అఖండ’కు సీక్వెల్ చేసే అవకాశం ఉంది.
ఇక అన్ని సినిమా యూనిట్స్ వారు సినిమాలు గెలవాలని మాట్లాడుతున్న ఈ టైమ్‌లో నంబర్స్ గురించి మాట్లాడటం కరెక్ట్ కాదు’’ అన్నారు. ‘‘సినిమా విఫలమైతే ఫస్ట్ ఎఫెక్ట్ అయ్యేది డిస్ట్రిబ్యూటర్సే. నా తొలి రెండు సినిమాలకు ఇబ్బంది పడిన డిస్ట్రిబ్యూటర్స్ ‘అఖండ’తో ఫుల్ హ్యాపీగా ఉన్నారు. ఈ రోజుల్లో సినిమాలు ఎక్కువగా ఆడటం లేదు. అలాంటిది ‘అఖండ’ యాభై రోజుల దిశగా వెళుతోంది’’ అన్నారు రవీందర్ రెడ్డి. కాగా ఈ కార్యక్రమంలో శ్రీకాంత్, అయ్యప్ప శర్మ, రాం ప్రసాద్, విజయ చంద్రశేఖర్ తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment