
ఇదే కరెక్ట్ టైమ్ అని భావించి కారు కొనుక్కుని నా కల నిజం చేసుకున్నాను. అంతే తప్ప ఏదో షో ఆఫ్ చేయడానికి మాత్రం కాదు. అమ్మ ఉంటే ఇంకా బాగుండేది..
బిగ్‌బాస్ రియాలిటీ షో సెలబ్రిటీలను ప్రజలకు మరింత చేరువ చేస్తుంది. అలా వారి పాపులారిటీని పెంచడంతో పాటు మంచి పారితోషికాన్ని కూడా ముట్టచెప్పుతుంది. ఇక షో ముగిశాక బయటకు వచ్చిన సెలబ్రిటీలకు మంచి అవకాశాలు కూడా వస్తుంటాయి. తాజాగా హిందీ బిగ్‌బాస్ 14వ సీజన్‌లో పాల్గొన్న మను పంజాబీ కూడా ప్రస్తుతం పలు ప్రాజెక్టులతో బిజీగా ఉన్నాడు. తాజాగా ఆయన స్వాంకీ కారును సొంతం చేసుకున్నాడు. కొత్త కారులో దిగిన ఫొటోలను సోషల్ మీడియాలో పంచుకున్నాడు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. "మంచి బ్రాండెడ్ కారుకు ఓనర్‌గా ఉండాలని నా చిన్నప్పుడు కలలు కంటుండేవాడిని. మరీ ముఖ్యంగా ఎరుపు రంగులో ఉండే మెర్స్ కారు కొనాలనుకునేవాడిని. ఆ కల ఇప్పుడు నెరవేరింది. కానీ ఈ సమయంలో అమ్మ ఉంటే ఈ సెలబ్రేషన్స్ రెట్టింపయ్యేవి. అయితే ఈ కారు కొనాలంటే ఎంత ఖర్చవుతుందో నాకు బాగా తెలుసు. అందుకే సరైన సమయం కోసం ఎదురు చూశా. ఇప్పుడు నాకు ఆర్థిక సమస్యలేవీ లేవు. అందుకే ఇదే కరెక్ట్ టైమ్ అని భావించి కారు కొనుక్కుని నా కల నిజం చేసుకున్నాను. అంతే తప్ప ఏదో షో ఆఫ్ చేయడానికి మాత్రం కాదు" అని చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం అతడు ఓ మ్యూజిక్ వీడియో చేస్తున్నాడు. దీంతో పాటు ఓ సినిమా ఆఫర్ సైతం చేజిక్కించుకున్నట్లు సమాచారం.