
పదో వారానికిగానూ హౌస్‌కు కెప్టెన్ అవ్వండి అని బిగ్‌బాస్ బంతి టాస్క్ ఇచ్చాడు. ఇందులో అఖిల్, మెహబూబ్ ఫైనల్ వరకు వెళ్లారు. కానీ ఇద్దరూ ఒకరికి ఒకరు సపోర్ట్ చేసుకోవడం ఇష్టం లేదు. నేనే కెప్టెన్ అవుతానంటే నేను అని కీచులాడుకున్నారు. బిగ్‌బాస్ బజర్ మోగించినా ఇంకా ఓ అండర్‌స్టాండింగ్‌కు రాకుండా వాదులాడుకుంటూనే ఉన్నారు. ఎవరి ముఖం ఉన్న బంతి వారు పట్టుకునేందుకు వీల్లేదని చెప్పినా సరే అదే పని చేసి మూర్ఖంగా ప్రవర్తించారు. ఫలితంగా బాస్‌కు కోపమొచ్చింది. టాస్క్ రద్దయింది, కెప్టెన్సీ ఎవరికీ అందకుండా పోయింది. అప్పటి వరకు పడ్డ కష్టం బూడిదలో పోసిన పన్నీరయ్యింది. దీనికి కారణమైన అఖిల్, మెహబూబ్‌కు బిగ్‌బాస్ బాగానే చీవాట్లు పెట్టాడు. తన ఆదేశాలను బేఖాతరు చేశారని మండిపడ్డారు. ఇదే ఆవేశంలో బిగ్‌బాస్.. ఇంటిసభ్యులకు అర్ధరాత్రి పరీక్ష పెడుతున్నాడు. హాయిగా నిద్రపోతున్న ఇంటిసభ్యులను లేపి ముల్లెమూట సర్దుకోమన్నాడు. అనంతరం గార్డెన్ ఏరియాకు రమ్మని పిలిచాడు. ప్రతిసారి మిమ్మల్ని బయటకు పంపే నిర్ణయం ప్రేక్షకుల చేతిల్లో ఉంటుందని, కానీ ఈసారి మీ చేతులోనే ఉందని హౌస్‌మేట్స్‌కు చెప్పాడు. (అఖిల్ నన్ను కాదని నిన్నే సేవ్ చేస్తాడు: మోనాల్)
మీరు ఫైనల్‌కు వెళ్లకుండా అడ్డుపడే స్ట్రాంగ్ ప్లేయర్ ఎవరు అనే ప్రశ్నను సంధించినట్లు కనిపిస్తోంది. దీనికి సమాధానం చెప్పేందుకు ఇంటిసభ్యులు తర్జనభర్జన పడ్డారు. మొత్తానికి ప్రోమోలో మాత్రం అవినాష్.. అరియానా స్ట్రాంగ్ అని, సోహైల్.. మెహబూబ్, అరియానా.. అఖిల్ పేర్లు చెప్పారు. అఖిల్ వంతు వచ్చేసరికి తనకు అడ్డు పడేవారు ఎవరూ లేరని, తన గేమ్ తాను ఆడగలుగుతానని కాన్ఫిడెంట్‌గా చెప్పాడు. అభిజిత్ మాత్రం.. బిగ్‌బాస్ ఒక పేరు చెప్పమన్నారు అని ముందే ఓ క్లారిటీ ఇస్తూ తన పేరునే చెప్పుకున్నాడు. దీన్ని కొందరు ఓవర్ కాన్ఫిడెన్స్ అని విమర్శిస్తుంటే మరికొందరు మాత్రం ఒక్క మాటతో అందరికీ పంచ్ వేశాడు. ఇక అందరూ వారివారి అభిప్రాయాలు చెప్పాక అఖిల్‌ను ఎలిమినేట్ అయినట్లు నమ్మించి సీక్రెట్ రూమ్‌లోకి పంపే అవకాశముందంటున్నారు. అదే కనక జరిగితే చాలామంది లోలోపల సంతోషపడతారు. కానీ మోనాల్ మాత్రం తనలోని నర్మదకు పని చెప్తుంది. మరి నిజంగా అఖిల్‌ను సీక్రెట్ రూమ్‌లోకి పంపుతారా? ఏదైనా ట్విస్టు ఉండబోతుందా? అనేది తెలియాలంటే నేటి ఎపిసోడ్ వచ్చేవరకు ఆగాల్సిందే!
Comments
Please login to add a commentAdd a comment