ఈసారైనా దక్కుతుందా.. బిగ్‌బాస్‌ ఎవరు? | Bigg Boss 4 Telugu: Finals On Sunday | Sakshi
Sakshi News home page

అమ్మాయిలకు ఛాన్సెంత?

Published Sun, Dec 20 2020 12:02 AM | Last Updated on Sun, Dec 20 2020 10:24 AM

Bigg Boss 4 Telugu: Finals On Sunday - Sakshi

పోటీలో ముగ్గురు అబ్బాయిలు ఇద్దరు అమ్మాయిలు నిలిచారు. నాలుగో సీజన్‌ ఇది. మూడు సీజన్లనూ అబ్బాయిలే తన్నుకుపోయారు. ఈసారైనా అమ్మాయి విజేతగా నిలుస్తుందా? అరియానా, హారికలకు చాన్స్‌ ఉందా? 100 రోజుల పాటు ప్రేక్షకులను అలరించిన షో ఈరోజు ముగుస్తోంది. భావోద్వేగాల కేంద్రంగా సాగే ఈ షోలో అన్ని రకాల వొత్తిళ్లను అమ్మాయిలు దాటగలిగారు. టైటిల్‌ చేజిక్కించుకోగలరో లేదో చూద్దాం. ఒక అంచనా.

సల్మాన్‌ ఖాన్‌ హోస్ట్‌గా నిర్వహించే హిందీ బిగ్‌బాస్‌లో ఇప్పుడు 14వ సీజన్‌ నడుస్తోంది. పూర్తయిన 13 సీజన్‌లలో ఐదు మంది మహిళా విజేతలు ఉన్నారు. పురుషులకే ఎక్కువగా ఓటింగ్‌ జరిగే క్రేజ్‌ ఉన్నచోట ఒకరకంగా పెద్ద నంబర్‌. హౌస్‌లో ఉన్న కంటెస్టెంట్‌లలో మహిళలే ఉత్తమ మానవ ప్రవర్తనను ప్రదర్శించారని దీనిని బట్టి రుజువైంది. ఎందుకంటే బిగ్‌బాస్‌ షో వ్యక్తుల బలాబలాలు, శక్తి సామర్థ్యాలను కాక మానవ ప్రవర్తనలను ప్రేక్షకుల ముందు పెట్టి ఎవర్ని ఎన్నుకుంటారో మీ ఇష్టం అని చెబుతుంది. మానవ ప్రవర్తనను బయటకు తేవడానికి బిగ్‌బాస్‌ హౌస్‌లో రకరకాల సందర్భాలను సృష్టిస్తారు. ఎత్తుకు ఎదగడానికి, పతనం కావడానికి కూడా సమాన అవకాశం ఉంటుంది. అలాంటి షోలో ఐదు మంది స్త్రీలు గెలిచి తాము మెరుగైన మానవులం అని చెప్పారు. కాని తెలుగులో కూడా అంతటి ప్రతిభావంతంగా రాణించినా పురుషులకు దీటుగా నిలిచినా స్త్రీలకు గత మూడు సీజన్‌లలో టైటిల్‌ దక్కలేదు. ఈసారైనా దక్కుతుందా... తెలియదు.

మిస్సయిన శ్రీముఖి, గీతా మాధురి
తెలుగు బిగ్‌బాస్‌ 1,2,3 సీజన్‌లలో మహిళా కంటెస్టెంట్‌లు గట్టి పోటీ ఇచ్చారు. సీజన్‌ 1లో నటి హరితేజ , నటి అర్చన చివరివరకూ నిలిచారు. సీజన్‌ 2లో గాయని గీతామాధురి రన్నర్‌ అప్‌గా నిలిచారు. నటుడు కౌశల్‌ ఆ సీజన్‌కు విన్నర్‌ అయినా గీతా మాధురి గెలుస్తుందని చాలామంది భావించారు. సీజన్‌ 3 లో శ్రీముఖి రన్నరప్‌గా నిలిచారు. రాహుల్‌ సిప్లిగంజ్‌ టైటిల్‌ గెలుచుకున్నారు. విజేత ఓటింగ్‌ ద్వారా నిర్ణయం అవుతారని నిర్వాహకులు చెబుతారు. కాని ఓటింగ్‌ సరళి పురుషుల ఫేవర్‌లో వెళుతోంది. స్త్రీలను విజేతలకు నిలబెట్టడానికి బయట సరైన బృందాలు పని చేయడం లేదనే భావన కూడా ఉంది.

ఈసారి అరియానా, హారిక
బిగ్‌బాస్‌ 4 సీజన్‌ కరోనాకు వెరవక అట్టహాసంగా సెప్టెంబర్‌ 6న మొదలైంది. మొత్తం 105 రోజుల ఈ షోలో చివరి రోజు ఇవాళ్టితో ముగియనుంది. ఈ సీజన్‌లో మొత్తం 20 మంది కంటెస్టెంట్‌లు పాల్గొన్నారు. వారిలో 10 మంది స్త్రీలు ఉన్నారు. సీజన్‌కు అట్రాక్షన్‌గా నిలుస్తుంది అనుకున్న గంగవ్వ ఆరోగ్య కారణాల రీత్యా నిష్క్రమించాల్సి వచ్చింది. ఫైనల్‌ వరకూ వెళుతుందనుకున్న లాస్య 77వ రోజున నిష్క్రమిస్తే గట్టి పోటీ ఇస్తూ వచ్చిన హీరోయిన్‌ మోనాల్‌ గజ్జర్‌ చివరి వారంలో ఎవిక్ట్‌ అయ్యింది. చివరి ఐదుమంది పోటీదారుల్లో టెలివిజన్‌ యాంకర్‌ అరియానా, యూ ట్యూబ్‌ స్టార్‌ హారికా మిగిలారు.

అమ్మాయిలు గెలుస్తారా?
ఓటింగ్‌ సరళిని, హౌస్‌లో అరియానా, హారికల గేమ్‌ తీరును, ప్రవర్తనను గమనించిన పరిశీలకులు చాలామంది ఈసారి బిగ్‌బాస్‌ టైటిల్‌ గెలిచేంత గట్టిగా వీరిరువురు లేరనే అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. అరియానా ప్రవర్తన నిక్కచ్చిగా ఉండటం ఆమెకు మైనస్‌ అయ్యింది. ఒక దశలో హౌస్‌మేట్స్‌ అందరూ ఆమెను ఎలిమినేట్‌ చేయాలనే వరకూ వెళ్లారు. ఇక హారికా పట్ల అభ్యంతరాలు లేకున్నా ఆమె గట్టిగా ఒక అభిప్రాయాన్ని, ఒక సందర్భాన్ని, ఒక యాటిట్యూడ్‌ని చూపలేకపోయింది. మరోవైపు పురుష కంటెస్టెంట్‌లు అభిజిత్, సొహైల్, అఖిల్‌ తమ సొంత తీరుతో ఓట్లను నిలబెట్టుకున్నారు.

50 లక్షలు ప్రైజ్‌ 
బిగ్‌బాస్‌ 4 విజేతకు 50 లక్షల ప్రైజ్‌మనీ దక్కుతుంది. ఇప్పుడు పోటీలో నిలుచున్న ఐదుగురూ మధ్యతరగతి, ఎగువ మధ్యతరగతి అభ్యర్థులే. ఈ మొత్తం చాలా పెద్దది తమ దృష్టిలో అని వారే చెప్పుకున్నారు. అందరికీ సొంతింటి కలే లక్ష్యంగా ఉంది. ఈ 50 లక్షల కోసం బిగ్‌బాస్‌లో గత 100 రోజులుగా అభ్యర్థులు అనేక అగ్నిపరీక్షలకు లోనయ్యారు. హారికా, అరియానాలు కూడా ఎన్నోసార్లు గట్టి దెబ్బలు తిన్నా తట్టుకుని నిలుచున్నారు. హారికాకు సొహైల్‌కు మధ్య పెద్ద పెద్ద యుద్ధాలే గెలిచాయి. అరియానా సొహైల్‌కు మధ్య కూడా యుద్ధాలే జరిగాయి. హారికా అభిజిత్‌ ఒక జట్టు కడితే సొహైల్‌– అఖిల్‌ ఒక జట్టుగా మారి అరియానాను ఒంటరిని చేశారు. అయితే బయట ప్రేక్షకులలో అరియానా మద్దతుదారులు గట్టిగానే ఉన్నారు. ఎవిక్ట్‌ అయ్యి వెళ్లే ముందు మోనల్‌ గజ్జర్‌ విజేత అయ్యే ఏ లక్షణమూ అరియానాలో లేదు అని చెప్పి వెళ్లింది. కాని ప్రేక్షకుల తీర్పు ఈసారి అమ్మాయిల వైపు మొగ్గితే ఇద్దరిలో ఒకరు గెలిచి మహిళా విజేతల ఖాతా తెరుస్తారు.

నేడే ఫైనల్స్‌
నేడు మా టీవీలో ప్రసారమయ్యే ఫైనల్స్‌లో విజేత ప్రకటన వెలువడుతుంది. చీఫ్‌గెస్ట్‌గా చిరంజీవి వస్తారనే వార్తలు వినిపిస్తున్నాయి. గత సీజన్‌లో వెంకటేశ్‌ హాజరయ్యారు. అంతకు ముందు సీజన్‌ చిరంజీవి వచ్చారు. మళ్లీ ఆయనే రావచ్చు అంటున్నారు. ఏమైనా లాక్‌డౌన్‌ కాలంలో మొదలైన ఈ షో పెద్ద ఆటంకాలు లేకుండా చివరి అంకానికి చేరడం వెనుక టీమ్‌ కష్టం ఎంతో ఉంటుంది. వారికి మెచ్చుకోళ్లు చెప్పక తప్పదు. విజేత ప్రకటన కోసం ఎదురు చూద్దాం. – సాక్షి ఫ్యామిలీ


 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement