
నిబంధనలు పాటించకపోతే కంటెస్టెంట్లకు మొట్టికాయలు వేసే బిగ్‌బాస్ తొలిసారి తను పెట్టిన రూల్స్ కూడా మార్చుకోవచ్చని బంపరాఫర్ ప్రకటించాడు. కావాలనుకుంటే సొంతంగా రూల్స్ పెట్టుకుని మరీ బిగ్‌బాస్ హౌస్‌ను మీకు నచ్చినట్లు వాడుకోండని చెప్పాడు. అయితే ఓ కండీషన్ పెట్టాడు. ఎంటర్‌టైన్ చేయాలని ఆదేశించాడు. అలా "రాజారాణి" టాస్కులో ఇంటిసభ్యులు వారికి వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటూ జనాలను ఎంటర్‌టైన్ చేసేందుకు ప్రయత్నించారు. నిన్న సోహైల్, అభిజిత్, హారిక వంతు రాగా నేడు మోనాల్ వంతు వచ్చింది. వినోదాన్ని పంచేందుకు మోనాల్ అందరిలా కాకుండా కాస్త భిన్నంగా ఆలోచించినట్లు కనిపిస్తోంది. ఇంటిసభ్యులతో ఫన్నీ టాస్క్ చేయిస్తోంది. అందులో భాగంగా అభిజిత్-అరియానా, సోహైల్-హారిక జంటలుగా విడిపోయారు. కాకపోతే ఇందులో ఓ ట్విస్టుంది.
అరియానా గర్ల్‌ఫ్రెండ్‌గా అభి, హారిక గర్ల్‌ఫ్రెండ్‌గా సోహైల్ పాత్రలు పోషించినట్లు కనిపిస్తోంది. అరియానా గారూ.. అంటూ గెంతులు వేసుకుంటూ వచ్చిన అభిని ఆమె బంగారం అంటూ దగ్గరకు తీసుకుంది. ఇంతలో అభి మీద సోహైల్ రంకెలేయడంతో అరియానా రెచ్చిపోయింది. ఎవడ్రా? నా గర్ల్‌ఫ్రెండ్ జోలికి వచ్చేది అని శివాలెత్తించింది. ఆడపిల్లలు అంటే ఆటబొమ్మలైపోయారా అంటూ హారికను కూడా గట్టిగానే వేసుకుంది. మొత్తానికి అరియానా పర్ఫామెన్స్‌తో ఈ స్కిట్టు బాగా పేలినట్లు కనిపిస్తోంది. చూస్తుంటే మహారాణి మోనాల్ రాజ్యంలో మంత్రితో పాటు ప్రజలు కూడా సంతోషంగా ఫీలైనట్లు తెలుస్తోంది. ఏదేమైనా ఈ అధికారం టాస్కులో అరియానా విజృంభిస్తోంది. మొత్తానికి ఈ ప్రేమికుల గొడవను చూసి కడుపుబ్బా నవ్వుకోవాలంటే రాత్రి పది గంటల వరకు వేచి చూడాల్సిందే! (బిగ్‌బాస్: అరియానాపై ఆర్జీవీ కామెంట్స్)
Comments
Please login to add a commentAdd a comment