
ప్రస్తుతం బిగ్‌బాస్ హౌస్‌లో కెప్టెన్సీ కంటెండర్స్ టాస్క్ నడుస్తోంది. ఎలాగైనా కెప్టెన్ అయి ఇమ్యూనిటీ సాధించాలని గట్టి పట్టుదల మీదున్నారు కంటెస్టెంట్లు. వీరిని రెండు టీమ్‌లుగా విభజించిన బిగ్‌బాస్.. టాస్క్ ముగిసే సమయానికి ఎవరు ఎక్కువ పాయింట్లు సాధిస్తే ఆ టీమ్ గెలిచినట్లని ప్రకటించాడు. గెలిచిన టీమ్‌లోని సభ్యులు కెప్టెన్సీ కంటెండర్లు అవుతారని తెలిపాడు. సూపర్ హీరోస్ వర్సెస్ సూపర్ విలన్స్ అనే కెప్టెన్సీ కంటెండర్స్ టాస్క్‌లో శ్రీరామ్, షణ్ముఖ్, ప్రియాంక, కాజల్, మానస్ సూపర్ హీరోల టీమ్ కాగా మిగిలిన వారంతా విలన్స్ టీమ్‌లో ఉంటారు. సమయానుకూలంగా ఒక్కో టీమ్ అవతలి టీమ్‌లోని ఇంటిసభ్యుడిని టార్గెట్ చేస్తుంది. వారికి చిత్ర విచిత్ర టాస్కులిచ్చి వాటిలో ఓడిపోయేట్లుగా చేసి ఐ క్విట్ అనిపిస్తేనే పాయింట్ దక్కుతుంది.
ఈ క్రమంలో సూపర్ హీరోస్ టీమ్ రవిని టార్గెట్ చేసింది. అతడిని ఓడిస్తే ఆట సులువు అవుతుందని ప్లాన్ రచించాడు షణ్ముఖ్. ఇందుకోసం అతడితో ఎలాగైనా ఐ క్విట్ అనిపించాలని ఎన్నో కష్టతరమైన టాస్కులిచ్చారు. ఒంటి మీదున్న దుస్తులతో సహా తనకు చెందిన అన్ని బట్టలకు పేడ అంటించాలని చెప్పారు. ఇది విన్న రవి ఏమాత్రం తటపటాయించకుండా రెడీ అంటూ టాస్క్ మొదలుపెట్టాడు. అతడి ధైర్యాన్ని చూసి వెనకడుగు వేసిన అవతలి టీమ్ సభ్యులు అన్ని బట్టలకు పేడ అంటించడం వద్దనేశారు. తర్వాత ఏవేవో పదార్థాలు కలిపి తయారు చేసిన జ్యూస్‌ను తాగాలని చెప్పగా రవి గుటగుటా తాగేశాడు. డ్రింక్ తాగిన వెంటనే స్క్వాడ్స్ చేయమన్నారు. రవికి బ్యాక్ పెయిన్ ప్రాబ్లమ్ ఉంది, కాబట్టి ఆ టాస్క్ చేయనని చేతులెత్తేస్తాడనుకున్నారు, కానీ రవి వెనకడుగు వేయలేదు. దాన్ని కూడా విజయవంతంగా పూర్తి చేశాడు.
ఆ తర్వాత రవితో మరో జ్యూస్ తాగించి గుండ్రంగా తిరగమని చెప్పి మళ్లీ మరో జ్యూస్‌ను చేతికందించారు. ఇవన్నీ పూర్తి చేసినప్పటికీ హీరోస్ టీమ్ ఊరుకోలేదు. ఏదేమైనా అతడితో క్విట్ అనిపించాలని డిసైడ్ అయింది. మరోసారి తాగడానికి వీలు లేని విచిత్ర జ్యూస్‌ను రవితో తాగిపించారు. ఇదంతా చూసి రవి అభిమానులే కాదు పలువురు సెలబ్రిటీలు సైతం ఫీలవుతున్నారు. బిగ్‌బాస్ బ్యూటీ అషూ రెడ్డి అయితే హౌస్‌మేట్స్ మీద ఓ రేంజ్‌లో ఫైర్ అయింది. 'వాళ్లు అతడిని టార్గెట్ చేస్తున్నారు. అది అక్కడ క్లియర్‌గా కనిపిస్తోంది. దీన్ని టార్చర్ అంటారు, కానీ గేమ్ అనరు' అని మండిపడింది. పలువురు రవి ఫ్యాన్స్ సైతం ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. రవికి వెన్ను నొప్పి ఉందని తెలిసీ అతడిని చిత్రహింసలకు గురి చేశారని అంటున్నారు.
Comments
Please login to add a commentAdd a comment