అమ్మాయిలు అబ్బాయిలతో మాట్లాడకూడదా? అమ్మాయిలు అబ్బాయిలతో మాట్లాడటం తప్పా? ‘హగ్’ ఇచ్చిపుచ్చుకోవడం తప్పా? ‘బిగ్‌బాస్ 5’లో కంటెస్టెంట్‌లు ఎలాంటి ప్రవర్తనతో ఉండాలో జడ్జిమెంట్స్ జరుగుతున్నాయి. ఈ జడ్జిమెంట్స్ చేస్తున్నది అమ్మాయిలే కావడం గమనార్హం. అసలు బిగ్‌బాస్‌లో ఏం జరుగుతోంది?
ఇన్నేళ్ల స్త్రీ ఉద్యమాలు, మహిళా చైతన్యం, జెండర్ సెన్సిటివిటి ప్రయత్నాలు... ఇవన్నీ చాలామంది సెలబ్రిటీల వరకూ చేరినట్టు లేదు. స్త్రీ, పురుషుల వ్యక్తిగతాల ప్రస్తావన ఎంత చేయాలో కూడా తెలుస్తున్నట్టు లేదు. నటుడు నాగార్జున యాంకర్‌గా పని చేస్తున్న ‘బిగ్‌బాస్ 5’లో కీచులాటలు ఇదే విషయాన్ని రుజువు చేస్తున్నాయి. ఇంతకు మునుపు లేని తకరార్లు కనిపిస్తున్నాయి. ఒక ఎపిసోడ్‌లో కంటెస్టెంట్‌లు రవి, కాజల్‌లు రిపోర్టర్లుగా మారి ప్రతి కంటెస్టెంట్ తో ‘హౌస్ లో ఎవరు భార్య, ఎవరు ప్రియురాలు, ఎవరు పని మనిషి’గా ఉండాలనుకుంటున్నారు అని అడిగితే ‘పనిమనిషి’గా అందరూ మహిళా కంటెస్టెంట్‌ల పేర్లే చెప్పారు, సరదాగానే. వీరందరికీ ‘పనిమనిషి’ స్త్రీయే. ఒక్కరు కూడా ‘పనివాడు’ కోరలేదు... ఫలానా మగ కంటెస్టెంట్‌ను పనివాడుగా పెట్టుకుంటాను అనలేదు. ‘ఇంటి పని’, ‘పని మనిషి’ స్త్రీకే కేటాయించబడుతోంది ఇంకా.
(చదవండి: మిడ్‌నైట్ హగ్.. అడ్డంగా బుక్కైన రవి, వీడియో వైరల్)
బిగ్‌బాస్ హౌస్‌లో వంట విషయం కూడా ప్రతిసారి స్త్రీల వ్యవహారంగా మారుతూ ఉంటుంది. మగ కంటెస్టెంట్‌లు హౌస్‌కు సంబంధించిన ఇతర పని పంచుకున్నా వంటను స్త్రీల పనిగానే స్టీరియోటైప్ చేస్తూ వెళ్లడం కొనసాగుతోంది. గత బిగ్‌బాస్ షో లో నటుడు బాలాజీ వంట పని చేశాడు. ఎన్.టి.ఆర్ బిర్యానీ వండాడు. మగవారిని వంటకు ప్రోత్సహించే ఇలాంటి చర్యలు తక్కువయ్యాయి.
ఇక సోమవారం (సెప్టెంబర్ 20) నామినేషన్ సందర్భంగా నటి ప్రియ కొన్ని అభ్యంతర కరమైన వ్యాఖ్యలు చేసింది. నటి లహరి కేవలం అబ్బాయిలతోనే మాట్లాడుతోందని ఫిర్యాదు. యాంకర్ రవికి హగ్ ఇస్తూ కనిపించిందని మరో ఫిర్యాదు. ఈమె ఈ రెండు మాటలను ‘క్యాజువల్’గా కాక ‘ఫిర్యాదు’ టోన్‌తో ‘చేయకూడని’ పనిగా చెప్పడంతో హౌస్‌లోని అందరూ హతాశులయ్యారు. బిగ్‌బాస్ హౌస్‌లో హగ్ ఇవ్వడం సర్వసాధారణమే అయినా ప్రియా చెప్పిన తీరు ‘నింద’ ను వేసేలా, ‘కంట్రోల్’ చేసేలా దానికి లహరి సంజాయిషీ ఇవ్వాల్సి వచ్చేట్టుగా మార్చింది. అమ్మాయిలు పూర్తిగా అబ్బాయిలతో మాట్లాడటం, స్నేహం చేయడం తప్పు అనే ధోరణిని నటి ప్రియ వ్యక్తపరిచింది. ఇంకా ఆమె ‘లహరి సింగిల్ కనుక ఆమె ఎలా అయినా వ్యవహరించవచ్చు... కాని రవి వివాహితుడు కనుక అలా చేయడానికి లేదు’ అని వ్యక్తిగత ప్రవర్తనలు ఎలా ఉండాలో తీర్పులు వ్యక్తం చేసింది. దాంతో నెటిజన్లు భారీగా ప్రియను ట్రోల్ చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment