
Bigg Boss Telugu 5 Runner Up Shanmukh Jaswanth Earnings In Bigg Boss: యూట్యూబ్ స్టార్ షణ్ముఖ్ జశ్వంత్ బిగ్‌బాస్ షోలో అడుగుపెడుతున్నాడనగానే చాలామంది టైటిల్ అతడిదే అని ఫిక్సయిపోయారు. వెబ్‌సిరీస్‌లతో భారీగా అభిమానులను కూడగట్టుకున్న అతడు ఈ సీజన్ ట్రోఫీని ఈజీగా గెలిచేస్తాడని ఫ్యాన్స్ ధీమాగా ఉన్నారు. కానీ షణ్ను ఎంట్రీ ఇచ్చాక సీన్ రివర్స్ అయింది. షో ప్రారంభంలో అయితే ఎందుకొచ్చాన్రా దేవుడా అన్నట్లుగా అతడు ఏదో ఒక మూలన ఉండేవాడు. టాస్కుల్లో ఆడటానికి కూడా పెద్దగా ఆసక్తి చూపేవాడు కాదు. అంతదాకా ఎందుకు.. తన బిడియాన్ని వదిలించుకుని మాట్లాడటానికే అతడికి చాలావారాల సమయం పట్టింది. బిగ్‌బాస్ షో సగానికి వచ్చాక అప్పుడు ఆట మొదలెట్టాడు. మాటకు మాట సమాధానమిచ్చాడు. ఎదుటివారి ఎత్తుగడలను చిత్తు చేస్తూ బ్రహ్మగా పేరు తెచ్చుకున్నాడు. సిరి, జెస్సీలే లోకంగా మోజ్ రూమ్‌లో ముచ్చట్లాడేవాడు. కాకపోతే 'అతి' అతడిని దారుణంగా దెబ్బతీసింది. ఎవరేం చేసినా, ఏం మాట్లాడినా అదంతా గేమ్ అంటూ అతిగా ఆలోచించేవాడు.
జెస్సీ వెళ్లిపోవడంతో సిరిని ఎలాగైనా కాపాడుకోవాలన్న తాపత్రయంలో తనకు తెలీకుండానే సిరిపై అజమాయిషీ చేశాడు. కానీ ఇది చాలామందికి నచ్చలేదనుకోండి అది వేరే విషయం. ఎవరితోనూ పెద్దగా కలవకుండా కామ్‌గా ఉంటూనే కత్తిలాంటి ప్లాన్లు వేస్తూ వచ్చిన షణ్ముఖ్ ఈ సీజన్ రన్నరప్‌గా నిలిచాడు. గెలుపు అంచుల దాకా వచ్చి టైటిల్ మిస్ అయిన ఈ బిగ్‌బాస్ బ్రహ్మకు పారితోషికం మాత్రం గట్టిగానే ఇచ్చినట్లు తెలుస్తోంది. ఒక్క వారానికి అతడికి నాలుగు నుంచి ఐదు లక్షల రూపాయలు ముట్టజెప్పారట. యాంకర్ రవి తర్వాత ఎక్కువ పారితోషికం అందుకుంటున్న షణ్ను మొత్తంగా పదిహేనువారాలకుగానూ రూ.65 లక్షల పైనే రెమ్యునరేషన్ తీసుకున్నట్లు నెట్టింట ఓ వార్త హల్‌చల్ చేస్తోంది. ఇదెంతవరకు నిజమో తెలీదు కానీ ఇది విన్నర్ ప్రైజ్‌మనీ కన్నా కూడా ఎక్కువ కావడం విశేషం.