కంటెస్టెంట్లు పెద్దగా గొడవపడేది నామినేషన్స్‌లోనే! ఇతరత్రా సందర్భాల్లో గొడవపడ్డా దాన్ని గుర్తు చేసుకుని మరీ గొడవకు దిగేది, రచ్చ చేసేది కూడా నామినేషన్స్‌లోనే! బిగ్‌బాస్ 7లో నాలుగోవారం నామినేషన్స్ రసాభాసగా జరిగాయి. ఇంతకీ ఎవరు ఎవర్ని నామినేట్ చేశారో తెలియాలంటే నేటి ఎపిసోడ్(సెప్టెంబర్ 25) హైలైట్స్ చదివేయాల్సిందే!
అతి చేస్తున్న శివాజీ
హౌస్‌లో తనే పెద్ద తోపు, తురుమ్‌ఖాన్ అన్నట్లు ప్రవర్తిస్తున్నాడు శివాజీ. ఎదుటివారిని మాట్లాడనివ్వడు, వారు ఏం చెప్పినా వినిపించుకోడు, పట్టించుకోడు. తను చెప్పిందే వేదం, తను చేసేది శాసనం అన్నట్లుగా ఓవర్ బిల్డప్ ఇస్తున్నాడు. అందరితో బాగుంటూనే అవసరం వచ్చినప్పుడు అసలు స్వరూపం చూపిస్తున్నాడు. ఈ విషయాన్ని ఆలస్యంగా పసిగట్టిన రతిక రోజ్ అతడికి దూరంగా ఉండటమే బెటర్ అని ఫీలైంది. నాగార్జునగారి దగ్గర.. ప్రశాంత్ వెనుక నేను తిరుగుతున్నా అన్నట్లుగా శివాజీ అనడం నచ్చలేదని అమర్‌తో చెప్పింది రతిక.
ఛీ.. ఈయన్నా నేను సపోర్ట్ చేసింది: రతిక
'అసలు ఆయన్ను మనిషి అనాలా? ఇంకేమైనా అనాలా? ఆయన సేఫ్ గేమ్ ఆడుతూ అందరినీ సేఫ్ గేమ్, గ్రూప్స్ ఆడుతున్నారని చెప్తున్నాడు. ఛీ ఈయనకా నేను సపోర్ట్ చేసింది.. పైకి మంచిగా ఉంటూ మార్కులు కొట్టేస్తూ మనల్ని పిచ్చోడిని చేస్తున్నాడు' అని తన ఆవేశాన్నంతా కక్కేసింది. ఆ తర్వాత శివాజీ దగ్గరకు వెళ్లి మరీ గొడవపెట్టుకుంది. ప్రశాంత్ టాపిక్ ఎత్తుతూ.. నాగ్ సర్ ముందు అమ్మాయిగా నా క్యారెక్టర్ గురించి ఇలా అనేశాడేంటి? అనిపించింది అని తన ఆవేదన చెప్పింది. దీంతో అతడు నేనలా అనలేదు. నువ్వే మరోలా ఊహించుకుంటున్నావు.. అంటూ కవర్ చేసేందుకు ప్రయత్నించాడు. కానీ రతిక వినకపోవడంతో సారీ చెప్పాడు. అయినా రతిక వాదిస్తుండటంతో.. ఎందుకు సాగదీస్తున్నావ్.. కాళ్లు పట్టుకోవాలా? అని సీరియస్ అవుతూ అక్కడినుంచి వెళ్లిపోయాడు.
జ్యూరీ సభ్యులను కారణాలతో మెప్పిస్తేనే..
ఇక ఈ వారం నామినేషన్ ప్రక్రియ వినూత్నంగా సాగింది. పవరాస్త్ర పొందిన ముగ్గురు హౌస్‌మేట్స్ శోభా శెట్టి, సందీప్, శివాజీలను బిగ్‌బాస్ జ్యూరీ మెంబర్స్‌గా కూర్చోబెట్టారు. ఒక్కో కంటెస్టెంట్ ఇద్దరిని బోనులో నిలబెట్టి నామినేట్ చేసి అందుకు తగిన కారణాలు చెప్పాలి. జ్యూరీ ఎవరి నామినేషన్‌కు మద్దతు తెలుపుతుందో వారి ఫోటోలను గిల్టీ బోర్డుపై పెట్టాలి. ఒకసారి గిల్టీ బోర్డుకు ఎక్కిన వ్యక్తిని వేరొకరు నామినేట్ చేయడానికి వీల్లేదు. ముందుగా ప్రిన్స్ యావర్.. తనను కంటెండర్‌గా తప్పించిందని ప్రియాంకను, టాస్కులే ఆడట్లేదంటూ తేజలను నామినేట్ చేశాడు. ప్రియాంక గురించి చెప్పింది సబబు అనిపించడంతో జ్యూరీ మెంబర్స్ ఆమె ఫోటోను గిల్టీ బోర్డుపై పెట్టారు.
మళ్లీ కయ్యానికి కాలు దువ్విన యావర్
శుభశ్రీ మాట్లాడుతూ.. బిగ్‌బాస్ రూల్స్ ప్రకారం బయట ఉన్న సెలబ్రిటీల గురించి చెడుగా మాట్లాడకూడదు. కానీ రతిక తన ఎక్స్ గురించి చెడుగా మాట్లాడుతోందని నామినేట్ చేసింది. అలాగే గతవారం నామినేషన్స్ సొంతంగా ఆలోచించకుండా వేరొకరిని గుడ్డిగా ఫాలో అవడం కరెక్ట్ కాదని పేర్కొంది. దీంతో రతికకు మైండ్ బ్లాంక్ అయిపోయింది. నీలా గుసగుసలు ఆడటం రాదు. నా ఎక్స్ గుర్తొచ్చి ప్రియాంకతో చెప్పుకున్నాను. ఆ మాటలు విని నువ్విక్కడ చెప్తున్నావంటే నీ క్యారెక్టర్ ఏంటి? అని ప్రశ్నించింది. దీంతో శుభశ్రీ నోరు అదుపులో పెట్టుకో అని వార్నింగ్ ఇచ్చింది.
మళ్లీ యావర్- గౌతమ్ ఫైట్
కంటెండర్‌గా గుండు గీయించుకోమంటే వెనుకాడాడంటూ అమర్‌ను నామినేట్ చేసింది. అది నా ఇష్టం, నీకేంటి బాధ? అని తనతో గొడవకు దిగాడు అమర్. జ్యూరీ.. అమర్-రతిక ఇద్దరిలో రతికను నామినేట్ చేశారు. అనంతరం గౌతమ్.. గతంలో ప్రిన్స్ తనతో అమర్యాదగా ప్రవర్తించాడని, అతడి కోపం వల్ల మనోభావాలు దెబ్బతింటున్నాయన్నాడు. ఇది వినగానే ప్రిన్స్ మళ్లీ గొడవ షురూ చేశాడు. యావర్- గౌతమ్ ఇద్దరూ ఒకరిపై ఒకరు అరుచుకున్నారు. బోనులో నిలబడకుండా గౌతమ్‌పైకి వెళ్లడంతో అతడిని బోనులో నిలబడమని సందీప్ మాస్టర్, శివాజీ కోప్పడ్డారు. వారిపైనా ప్రిన్స్ నిప్పులు చెరిగాడు.
పిచ్చి కారణాలంటూ శివాజీ ఓవరాక్షన్
ఈ ప్రవర్తనే నచ్చలేదని గౌతమ్ అనగా నీవన్నీ పిచ్చి కారణాలు.. మేము పిలుస్తున్నా యావర్ మా మాట లెక్కచేయలేదు కాబట్టి ఆ ప్రవర్తనకు మాత్రమే నామినేట్ చేస్తున్నాం అంటూ శివాజీ అతి చేశాడు. ఇది నచ్చని గౌతమ్ మీరు పక్షపాతంగా ఉంటున్నారంటూ శివాజీపై ఆగ్రహం వ్యక్తం చేశాడు. ఇంతలో బిగ్‌బాస్.. నామినేషన్‌లో ప్రవర్తనను బట్టి కంటెస్టెంట్లను నామినేట్ చేయకూడదు. కారణాల ఆధారంగానే వారిని ఎంపిక చేయాలి. మీ నిర్ణయాన్ని ఆలోచించి చెప్పండి అని పేర్కొన్నాడు. దీంతో ఎపిసోడ్ ముగిసింది. మరి నామినేషన్‌లో ఇంకా ఎన్ని గొడవలున్నాయో చూడాలంటే నేటి ఎపిసోడ్ చూడాల్సిందే!
Comments
Please login to add a commentAdd a comment