
ఈజీ మనీ కోసం చాలామంది బెట్టింగ్ యాప్స్ (Betting Apps) వాడి నిండా మునుగుతున్నారు. అదే ఈజీ మనీ కోసం ఎంతోమంది సెలబ్రిటీలు ఈ యాప్స్‌ను ప్రమోట్ చేసి రెండు చేతులా సంపాదిస్తున్నారు. ఈ జాబితాలో బుల్లితెర సెలబ్రిటీలు, బిగ్‌బాస్ కంటెస్టెంట్లే ఎక్కువగా ఉన్నారు. అందులో వాసంతి కృష్ణన్ (Vasanthi Krishnan) కూడా ఉంది. తాజాగా ఆమె బెట్టింగ్ యాప్స్ గురించి మాట్లాడింది.
అవగాహన లేక చేశా..
వాసంతి మాట్లాడుతూ.. బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేయమని ఆఫర్లు వస్తుంటే చేసుకుంటూ పోయాను తప్ప దీనివల్ల జనాలు ఇబ్బందిపడుతున్నారని తెలీదు. ఆ యాప్స్ గురించి నాకంత అవగాహన లేదు. పెద్ద పెద్ద సెలబ్రిటీలు కూడా చాలామంది ప్రమోషన్స్ చేస్తున్నారు కాబట్టి ఇందులో తప్పే లేదనుకున్నాను. కనీస అవగాహన లేకుండానే సోషల్ మీడియాలో ప్రమోట్ చేశాను. అయితే.. ఇలాంటివి ఎందుకు చేస్తున్నావ్ అంటూ నాకు నెగెటివ్ కామెంట్లు రావడం మొదలైంది. ఫాలోవర్లు కూడా తగ్గిపోయారు. నా వల్ల జనాలకు చెడు జరుగుతుందేమోనని ప్రమోషన్స్ ఆపేశాను. ఇప్పటికీ నన్ను ప్రమోషన్స్ చేయమని అడుగుతూనే ఉన్నారు.
రూ.10 లక్షల ఆఫర్
ఏడాదికి ఇంత, రెండేళ్లకు అంత అని ప్యాకేజీలు ఇస్తామన్నారు. అదంతా నావల్ల కాదు అని ఒక వీడియో చేసి ఆపేశాను. అప్పట్లో ఏడాదికి రూ.5 లక్షలు, రూ.10 లక్షలు ప్యాకేజీ ఇచ్చేవాళ్లు. మీరు సోషల్ మీడియాలో ఎలాంటి వీడియో అప్‌లోడ్ చేయనవసరం లేదు. కేవలం వీడియో తీసి సెండ్ చేయమనేవాళ్లు. కానీ నా అభిమానులు డబ్బు కోల్పోతున్నారని తెలిసి బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేయడం ఆపేశాను. అందరూ పాడైపోవాలన్న దురుద్దేశంతో అయితే ప్రమోషన్స్ చేయలేదు అని వాసంతి వివరణ ఇచ్చింది. ప్రస్తుతం ఈ బ్యూటీ సీరియల్స్ చేస్తోంది.
చదవండి: మీరు లేకపోతే నా జర్నీ ఇలా ఉండేది కాదు.. మహాతల్లి ఎమోషనల్ పోస్ట్