
చెన్నై: నటి యాషిక ఆనంద్ నుంచి పోలీసులు వాంగ్మూలం తీసుకున్నారు. శనివారం అర్ధరాత్రి నటి యాషిక ఆనంద్ కారు ప్రమాదానికి గురైన విషయం తెలిసిందే. ఆమెతో పాటు కారులో ఉన్న ఇద్దరు స్నేహితులు తీవ్రంగా గాయపడ్డారు. ఒకరు సంఘటనా స్థలంలోనే మృతి చెందారు. కాగా తీవ్ర గాయాలపాలైన నటి యాషిక ఆనంద్ స్థానిక అడయార్‌లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఆమె నడుము, కుడికాలికి వైద్యులు శస్త్ర చికిత్స నిర్వహించారు.
ప్రస్తుతం ఆమె కోలుకుంటున్నట్లు సమాచారం. పోలీసులు సోమవారం కారు ప్రమాదం గురించి యాషికను కలిసి వాంగ్మూలం తీసుకున్నారు. ఆమె స్నేహితురాలు భవాని సీటు బెల్టు పెట్టుకోకపోవడంతో ప్రమాదంలో కిందపడి ప్రాణాలు కోల్పోయినట్లు వాంగ్మూలంలో యాషిక తెలిపారు. వేగంగా వెళుతున్న కారు అదుపు తప్పడంతో ప్రమాదం సంభవించినట్లు తెలిసింది. కారు నడుపుతున్న సమయంలో యాషిక మద్యం సేవించలేదని విచారణలో తేలింది.
Comments
Please login to add a commentAdd a comment