
సండేను ఫండేగా మార్చేందుకు కింగ్ నాగార్జున రెడీ అయిపోయాడు. బిగ్‌బాస్ హౌస్‌లోని కంటెస్టెంట్లతో రచ్చ చేసేందుకు సిద్ధమయ్యాడు. ఈ క్రమంలో ఇంటిసభ్యులకు నాగ్ సరదా టాస్క్ ఇచ్చినట్లు కనిపిస్తోంది. ఇంకేముందీ... మామూలుగానే రెచ్చిపోయే కంటెస్టెంట్లు నాగ్ ఇచ్చిన టాస్క్‌లో విజృంభించినట్లు కనిపిస్తోంది. తాజాగా రిలీజైన ప్రోమోలో యాంకర్ రవి, హమీదా.. యానీ మాస్టర్, జెస్సీల గొడవను ఇమిటేట్ చేసి నవ్వించారు. షణ్ముఖ్.. ప్రియతో డ్యాన్స్ చేసి అలరించాడు.
ఇక విశ్వ.. లోబోను ఎత్తుకుని తిప్పుతూ తన బలాన్ని ప్రదర్శించాడు. తానేం తక్కువ తినలేదు అన్నట్లుగా సింగర్ శ్రీరామచంద్ర.. సిరిని ఎత్తుకుని తిరిగాడు. ఎప్పుడూ సిరి జపం చేసే జెస్సీ.. ఎందుకు అంత త్వరగా ఎంగేజ్ అయ్యావని మనసులోని మాటను బయటపెట్టడంతో ఆమెకు షాక్ కొట్టినంత పనైంది. కానీ వెంటనే షాక్‌లో నుంచి తేరుకుంటూ నువ్వు వస్తావని తెలీక ఎంగేజ్ అయ్యానని చెప్పింది. అనంతరం నాగ్.. ప్రియాంక క్రష్ ఎవరు అని అడిగాడు. దీనికి సమాధానంగా మానస్‌ను కెమెరాల్లో చూపించారు. అయితే ఈ సమాధానం లోపలున్న కంటెస్టెంట్లతో పాటు ప్రేక్షకులకు కూడా తెలిసిందే.
ఇక తొలి వారం ఎవరు ఎలిమినేట్ అవుతారనేదానిపై సోషల్ మీడియాలో తీవ్రమైన చర్చ నడుస్తోంది. ఇప్పటికే నాగ్.. యాంకర్ రవి, హమీదాను సేఫ్ చేసిన విషయం తెలిసిందే. దీంతో మానస్, కాజల్, సరయూ, జెస్సీ ఇంకా డేంజర్ జోన్‌లోనే ఉన్నారు. ఈ నలుగురిలో సరయూ ఎలిమినేట్ అయిందంటూ ఓ వార్త నెట్టింట తెగ చక్కర్లు కొడుతోంది. మరి ఇందులో నిజమెంతుందో తెలియాలంటే నేటి ఎపిసోడ్ వచ్చేంతవరకు వేచి చూడాల్సిందే!
Comments
Please login to add a commentAdd a comment