నాగార్జున వచ్చీరావడంతోనే ఈ వారం డబుల్ ఎలిమినేషన్ ఉంటుందని ప్రకటించాడు. అయితే టికెట్ టు ఫినాలే గెలిచి అవినాష్ ఈ నామినేషన్స్ నుంచి తప్పించుకుని నేరుగా ఫైనల్‌కు వెళ్లిపోయాడని గుడ్‌న్యూస్ చెప్పాడు. అంతేకాదు ఫస్ట్ ఫైనలిస్ట్ అంటూ అతడికి ఓ ట్రోఫీ కూడా ఇచ్చారు. మరి హౌస్‌లో ఇంకా ఏమేం జరిగాయో నేటి (నవంబర్ 30) ఎపిసోడ్ హైలైట్స్ చదివేయండి..
నోరు తీపి చేసిన బిగ్‌బాస్
ఫస్ట్ ఫైనలిస్ట్ అవినాష్‌ను మనసులో కోరిక చెప్పమనగా.. మందు బాటిల్స్, స్వీట్స్ కావాలంటూ చిట్టా బయటపెట్టాడు. మందు కుదరదు కానీ స్వీట్స్‌తో సరిపెట్టుకోమంటూ బిగ్‌బాస్ గులాబ్‌జామూన్ పంపించి హౌస్‌మేట్స్ నోరు తీపి చేశాడు. అలాగే టికెట్ టు ఫినాలే టాస్క్‌లో అతడికి హౌస్‌మేట్స్ పెట్టిన బ్యాడ్జ్ ప్రకారం రూ.4 లక్షలు ప్రైజ్‌మనీలో యాడ్ చేశారు. అలా ప్రైజ్‌మనీ రూ.54,30,000కి చేరింది.
బ్లాక్ టికెట్.. గోల్డెన్ టికెట్
తర్వాత నాగ్.. హౌస్‌లో కొందరికి బ్లాక్ టికెట్, మరికొందరికి గోల్డెన్ టికెట్ ఇచ్చాడు. ఎవరికి బ్లాక్ టికెట్ ఇవ్వాలని నిఖిల్‌ను అడగ్గా తేజ పేరు చెప్పాడు. గౌతమ్ వంతు రాగా.. అతిథులు బ్లాక్ బ్యాడ్జ్ ఇస్తే వారితో సరిగా ప్రవర్తించలేదని ప్రేరణ పేరు సూచించాడు. దీంతో ఆమె ఫౌల్ గేమ్ ఆడిన వీడియో నాగ్ ప్లే చేశాడు. ఇలా ఆడితే బ్లాక్ బ్యాడ్జ్ ఇవ్వకపోతే ఏం చేస్తారన్నట్లు క్లాస్ పీకాడు. రోహిణి.. ఫౌల్ గేమ్ ఆడాడంటూ పృథ్వీకి బ్లాక్ టికెట్ ఇవ్వాలంది.
గేమ్స్ గెలిస్తే టైటిల్ రాదు!
అవినాష్.. నబీల్‌కు, తేజ.. విష్ణుకు బ్లాక్ టికెట్ ఇవ్వాలన్నారు. ఈ సందర్భంగా ఎవరు ఈ సీజన్ విన్నర్ అనుకుంటున్నావని విష్ణును అడగ్గా తనే గెలుస్తానంది. గెలవాలంటే ఈ ఆట సరిపోదుకదా అని నాగ్ అంటుంటే.. ఆటలన్నీ గెలిచినవారు టైటిల్ సాధించినట్లు బిగ్‌బాస్ చరిత్రలోనే చూడలేదని వేదాంతం చెప్పింది. అది తప్పని, జనాలు.. ఆట, మాట.. ఇలా ప్రతి ఒక్కటి చూస్తారని స్పష్టం చేశాడు.
గౌతమ్‌కు గోల్డెన్ టికెట్
ప్రేరణ.. గౌతమ్‌కు బ్లాక్ టికెట్ ఇవ్వాలంది. గౌతమ్ అందుకు అర్హుడంటూ నబీల్, విష్ణు, పృథ్వీ, నిఖిల్ కూడా చేయెత్తారు. అప్పటివరకు హౌస్‌మేట్స్ చెప్పిన అందరికీ బ్లాక్ టికెట్ ఇచ్చుకుంటూ పోయిన నాగార్జున.. గౌతమ్‌కు మాత్రం బ్లాక్ టికెట్ ఇవ్వనంటూ గోల్డెన్ టికెట్ ఇచ్చాడు. అలాగే రోహిణి, నిఖిల్, అవినాష్‌కు సైతం గోల్డెన్ టికెట్ ఇచ్చాడు. అనంతరం దమ్ము-దుమ్ము అని ఓ గేమ్ ఆడించాడు. ట్రోఫీని పైకి ఎత్తగల దమ్మున్న ప్లేయర్ ఎవరు? ఫినాలే వరకు రాకుండా దుమ్ముదుమ్మయిపోయే వ్యక్తి ఎవరు? అనేది చెప్పాలన్నాడు.
నిఖిల్ దమ్మున్న ప్లేయర్
నబీల్, పృథ్వీ, విష్ణుప్రియ.. నిఖిల్ దమ్మున్న ప్లేయర్ అని, తేజ దుమ్ము అని తెలిపారు. రోహిణి.. గౌతమ్ దమ్మున్న ప్లేయర్ అని, ప్రేరణ ఫినాలే వరకు రాకపోవచ్చంది. తేజ.. ఎంటర్‌టైనర్లు కూడా గెలవగలరని నిరూపిస్తారంటూ అవినాష్ దమ్మున్న ప్లేయర్ అన్నాడు. విష్ణు ఉట్టి దుమ్మున్న ప్లేయర్ అన్నాడు. గౌతమ్.. రోహిణి దమ్మున్న ప్లేయర్ అని, ప్రేరణ దుమ్ము అని తెలిపాడు. అవినాష్.. నబీల్ దమ్మున్న ప్లేయర్ అని, ఫౌల్ గేమ్స్ ఆడతాడంటూ పృథ్వీని దుమ్ము కంటెస్టెంట్‌గా పేర్కొన్నాడు.
గౌతమ్‌పై కోపాన్నంతా కక్కేసిన తేజ
తర్వాత తేజ.. గౌతమ్‌పై తన కోపాన్నంతా కక్కేశాడు. టికెట్ టు ఫినాలే ఆడే క్రమంలో ఓ గేమ్‌లో గౌతమ్ నా పేరు సెలక్ట్ చేయకపోవడంతో బాధేసిందని, అదే విషయం అతడిని నిలదీశానన్నాడు. నామినేషన్స్‌లో ప్రేరణతో అంత గొడవైనా కూడా ఆమెనే ఎందుకు సెలక్ట్ చేశాడు? అక్కడ నేను ఫ్రెండ్ కాబట్టి నన్ను సెలక్ట్ చేస్తే అతడికి సోలో బాయ్ అనే ట్యాగ్ పోతుందని వెనకడుగు వేశాడు. ప్రేరణను సెలక్ట్ చేస్తే తనకు మంచి పేరొస్తుందని లెక్కలు వేసుకున్నాడని తెలిపాడు.
తేజ ఎలిమినేట్
నా మనసుకు ఏదనిపిస్తే అది చేసుకుంటూ పోయా.. నువ్వు నమ్మినా, నమ్మకపోయినా అది నీ ఇష్టం అని గౌతమ్ ఒక్కముక్కలో తేల్చేశాడు. ఇక ప్రేరణ, నిఖిల్.. నబీల్ దమ్మున్న ప్లేయర్ అని, తేజ దుమ్ము కంటెస్టెంట్ అని అభిప్రాయపడ్డారు. తేజ ఆడలేకపోతున్నాడని పేర్కొన్నాడు. అనంతరం నాగార్జున తేజ ఎలిమినేట్ అయినట్లు ప్రకటించాడు. తల్లిని హౌస్‌లోకి తీసుకురావాలన్న కల నెరవేర్చుకున్నాకే వెళ్లిపోతున్నానంటూ తేజ సంతోషపడితే అవినాష్ మాత్రం కంటనీరు పెట్టుకున్నాడు. స్టేజీపైకి వచ్చిన తేజతో నాగ్ ఓ గేమ్ ఆడించాడు. హౌస్‌మేట్స్‌ను కూరగాయలతో పోల్చాలన్నాడు.
టాప్ 2లో గౌతమ్..
అలా అవినాష్ ఉల్లిపాయ అని, ఈ సీజన్‌లో పెద్ద గెలుపు రోహిణిదేనంటూ బంగాళాదుంపతో పోల్చాడు. విష్ణుప్రియ కాకరకాయ అన్నాడు. ప్రేరణ.. మాట సరిగా లేకపోతే నెక్స్ట్ నువ్వే బయటకు వచ్చేస్తావని హెచ్చరిస్తూ బెండకాయ ఇచ్చాడు. పృథ్వీ.. విష్ణుప్రియను వదిలినట్లు కొన్ని గేమ్స్ కూడా వదిలేస్తున్నావంటూ పచ్చిమిర్చి ట్యాగ్ ఇచ్చాడు. గౌతమ్‌లో ఎన్ని పొరలుంటాయో వాడికే తెలీదంటూ క్యాబేజీతో పోల్చాడు. అతడు టాప్ 2లో పక్కాగా ఉంటాడనన్నాడు. నబీల్.. గేమ్‌లో కన్ఫ్యూజ్ అవుతున్నాడని, టాప్ 2లో ఉంటాడనుకుంటే ఇప్పుడు టాప్ 5కి వచ్చేశాడంటూ టమాటతో పోల్చాడు. నిఖిల్.. ఎమోషనల్‌గా వీక్ అంటూ అతడికి సోరకాయ ఇచ్చాడు.
Comments
Please login to add a commentAdd a comment