అవినాష్‌ను స్కానింగ్ కోసం బయటకు తీసుకెళ్లారు. ఆరోగ్యం బాగోలేక ఎలిమినేట్ అయి వెళ్లిపోతున్నాడేమోనని హౌస్ మొత్తం ఏడ్చేసింది. కట్ చేస్తే కొన్ని గంటలకే లోనికి వచ్చాడు. నామినేషన్స్ ఈసారి డిఫరెంట్‌గా జరిగాయి. ముఖ్యంగా మెగా చీఫ్‌కు ఇది కత్తి మీద సామే అయింది. అదెలాగో తెలియాలంటే నేటి (అక్టోబర్ 28) ఎపిసోడ్ హైలైట్స్ చదివేయండి..
హౌస్ మొత్తం ఏడుపు
కడుపు నొప్పితో అవినాష్ మెడికల్ రూమ్‌కు వెళ్లాడు. అతడిని పరీక్షించిన వైద్యుడు స్కానింగ్ కోసం హౌస్ నుంచి బయటకు రావాల్సి ఉంటుందన్నారు. కడుపు నొప్పి భరించలేకపోతున్నాను, అందుకే హౌస్ నుంచి వెళ్లిపోతున్నా అంటూ అవినాష్ హౌస్‌లో ఎమోషనల్ అయ్యాడు. ఎప్పుడూ నవ్విస్తూ ఉండే అవి ఎలిమినేట్ అవుతున్నాడనుకుని దాదాపు హౌస్‌మేట్స్ అందరూ భారంగా ఏడుస్తూ వీడ్కోలు చెప్పారు. అవినాష్‌ను హాస్పిటల్‌కు తీసుకెళ్లి స్కాన్ చేయించిన బిగ్‌బాస్ టీమ్.. అతడిని తిరిగి హౌస్‌లోకి పంపారు.
నామినేషన్స్.. మెగా చీఫ్‌పై భారం
మెగా చీఫ్ విష్ణుప్రియ.. ఇంట్లో ఉండేందుకు అర్హత లేని ఐదుగురు సభ్యులను నామినేట్ చేసి జైల్లో పెట్టి తాళం వేయాలన్నాడు. చీఫ్‌ను చేయడంతో పాటు విలన్‌ను కూడా చేసేస్తున్నారని మనసులో అనుకుంటూనే ముందుగా గౌతమ్‌ను నామినేట్ చేసింది. లేడీస్ వీక్ అంటూ ఆడాళ్లకు గౌరవమిస్తానంటావ్.. కానీ ఒకరిపై నన్ ఆఫ్ యువర్ బిజినెస్ అని అరవడం బాగోలేదని తెలిపింది. అందుకు గౌతమ్.. ప్రేరణతో మాట్లాడుతుంటే యష్మి మధ్యలో వచ్చిందని వివరణ ఇచ్చే ప్రయత్నం చేశాడు.
పాయింట్లు వెతకడానికే నీతో ఉన్నా
తన పేరు రావడంతో యష్మి గొడవకు దిగింది. ఈ క్రమంలో గౌతమ్.. యష్మిని అక్కా అనేశాడు. క్రష్ అంటావ్, అక్కా అంటావ్.. నన్ను అక్కా అని పిలవకు అని యష్మి హెచ్చరించగా అది చూసి విష్ణు పకాపకా నవ్వింది. నాకంటే ఎక్కువపాయింట్లు ఉన్నోళ్లు నీ చుట్టూ ఉన్నా నామినేట్ చేయవని గౌతమ్.. విష్ణుపై అసహనం వ్యక్తం చేశాడు. నిన్ను నామినేట్ చేయడానికి దగ్గరుండి పాయింట్లు వెతికానంది విష్ణు. ఈమె మాటలు విన్న పృథ్వీ వెటకారంగా నవ్వాడు.
మనసు చివుక్కుమంది, అందుకే..
నన్ను ఫేక్ ఫ్రెండ్ అన్నావ్, అందర్నీ గాలికొదిలేసి నీ కోసమే బజ్జీలు వేసుకున్నావంటూ ప్రేరణను జైల్లో పడేసింది. సంచాలకుడిపై అరవడం వల్ల నా మనసు చివుక్కుమందంటూ తేజను నామినేట్ చేసింది. పృథ్వీ ఇచ్చిన ఎంకరేజ్‌మెంట్‌తో నయనిని సైతం జైల్లో వేసింది. వైల్డ్‌కార్డ్స్ వచ్చాక నీలో పన్ యాంగిల్ కనిపించడం లేదంటూ నబీల్‌ను నామినేట్ చేసింది. వెంటనే నబీల్.. నువ్వు పృథ్వీతో ఉంటే నేనెక్కడ కనిపిస్తానంటూ భలే కౌంటరిచ్చాడు. నీలో ఫైర్ ఏముందని నాకు చెప్తున్నావ్ అని తిరిగి ప్రశ్నించాడు.
నామినేషన్స్‌లో రెండో లెవల్
అలా విష్ణుప్రియ వల్ల గౌతమ్, ప్రేరణ, నయని పావని, తేజ, నబీల్ నామినేట్ అయ్యారు. మన టీమ్‌వాళ్లు మెగా చీఫ్ అవ్వాలని ఆడితే ఇప్పుడు నన్నే నామినేట్ చేసిందని నబీల్ ఏడ్చాడు. చేసిందంతా చేసిన విష్ణు.. నబీల్‌కు సారీ చెప్పింది. తర్వాత నామినేషన్స్‌లో రెండో లెవల్ మొదలైంది. జైల్లో ఉన్నవారిని విడిపించే అవకాశాన్ని హౌస్‌మేట్స్‌కు ఇచ్చాడు. బజర్ మోగిన ప్రతిసారి జైలు తాళం చెవిని పట్టుకున్నవారికి ఒకరిని నామినేషన్ నుంచి సేవ్ చేసే ఛాన్స్ ఉంటుంది. అయితే ఆ వ్యక్తికి బదులుగా మరొకరిని నామినేట్ చేసి జైల్లో వేయాల్సి ఉంటుంది.
ఫైనల్ లిస్ట్ ఇదే
మొదటగా పృథ్వీ తాళం అందుకుని.. నబీల్‌ను జైలు నుంచి విడిపించాడు. అతడి స్థానంలోకి అవినాష్‌ను పంపించాడు. తర్వాత బజర్‌కు యష్మి.. ప్రేరణను విడిపించి హరితేజను జైల్లోకి పంపింది. రోహిణి.. అవినాష్‌ను బయటకు తీసి పృథ్వీని లోనికి పంపించింది. అవినాష్.. తేజను విడిపించి యష్మిని జైల్లో వేశాడు. ప్రేరణ.. పృథ్వీని విడిపించి తేజను లోనికి పంపించింది. ఫైనల్‌గా ఈ వారం గౌతమ్, నయని, హరితేజ, యష్మి, తేజ నామినేట్ అయినట్లు ప్రకటించారు.
Comments
Please login to add a commentAdd a comment