Bullet Bandi Song Singer Mohana Bhogaraju: 'నీ బుల్లెట్ బండెక్కి వచ్చేత్తపా...' ఇప్పుడెక్కడ విన్నా ఇదే పాట మార్మోగుతోంది. అటు సోషల్ మీడియాను,ఇటు యూత్‌ను షేక్ చేస్తోంది. ఫంక్షన్స్‌లో.. ఆటోల్లో.. కార్లలో.. ఎక్కడ చూసినా ఈ పాటే వినబడుతుంది. వాస్తవానికి ఈ పాట వచ్చి చాలా రోజులైంది. మళ్లీ ఇప్పుడు క్రేజ్ రావడానికి కారణం సాయిశ్రీయ అనే అమ్మాయి. తన పెళ్లి బరాత్‌లో ఈ పాటకు ఆమె చేసిన డ్యాన్స్ సోషల్ మీడియాలో సెన్సేషన్‌గా మారిన సంగతి తెలిసిందే. అంతేకాదు ఆమె స్టెప్పులకు ఫిదా అయిన ‘బుల్లెట్టు బండెక్కి వచ్చెత్తపా’పాట నిర్మాతలు.. తమ తదుపరి పాటకు డ్యాన్స్ చేసే అవకాశం కల్పించారు.
అయితే ఈ పాట అందరికి కనెక్ట్ అయ్యేలా చేసింది మాత్రం సింగర్ మోహనా భోగరాజు. లక్ష్మణ్(మహబూబ్‌నగర్) కలం నుంచి జాలువారిన ఈ పాటకు ఎస్‌కే బాజి సంగీతం అందించగా, తెలంగాణ స్లాంగ్‌లో అద్భుతంగా ఆలపించింది మోహనా భోగరాజు. ఆమె ఎంత అందంగా ఉందో అంతే అందంగా ఈ పాట పాడింది. అయితే ఈ పాట పాడింది ఆమేనని ఇప్పటికి చాలా మందికి తెలియదు. ‘బుల్లెట్ బండి’సాంగ్ వైరల్ అయ్యాక ఈ పాట పాడింది ఎవరు? ఆమె నేపథ్యం ఏంటని ఆరా తీరుస్తున్నారు.
ఎవరీ మోహన భోగరాజు?
మోహన భోగరాజు పుట్టి పెరిగింది అంతా హైదరాబాద్‌లోనే. ఆమె తల్లికి సంగీతమంటే ఎంతో ఇష్టం. అమ్మపాటలు వింటూ పెరిగిన మోహనకు కూడా సంగీతం అన్నా..పాటలన్నా ప్రాణంగా మారింది. అలా చిన్నప్పుటింనుంచే పాటలపై మమకారం పెంచుకున్న మోహన.. ఎక్కడ సంగీతం పోటీలు జరిగినా వెళ్లి పాల్గొనేది. బుల్లితెరలో ప్రసారమయ్యే పలు పాటల పోటీల్లో పాల్గొన్నా..చాలాసార్లు ఆమె సెలక్షన్స్‌లోనే విఫలమయ్యేది. అయినప్పటికీ ఆత్మవిశ్వాసం కోల్పోకుండా మళ్లీ పోటీల్లో పాల్గొనేది. అలా ఒకసారి ఓ పెద్ద కాంపిటీషన్ వెళ్లిన మోహన వాయిస్‌ని మ్యూజిక్ డైరెక్టర్ బాలాజీ విని ఉదయ్ కిరణ్ హీరోగా నటించిన ‘జైశ్రీరామ్’లో అవకాశం ఇప్పించాడు. అందులో ‘సయ్యామమాసం మనదేలే’అనే పాటను పాడింది మోహననే. ఈ పాట పాడిన తరువాత కూడా ఆమె పలు సినిమాలకు కోరస్ గానే పాడారు.
‘మనోహరి’ పాటతో ఫేమస్
తొలి పాట తర్వాత మోహనకు అవకాశాలు పెద్దగా రాలేదు. కోరస్‌గా పాడినప్పటికీ ఆమెకు గుర్తింపు రాలేదు. ఈ క్రమంలో కీరవాణి దగ్గర పనిచేసే ఓ గాయని సహాయంతో తాను రికార్డ్ చేసిన పాటల సీడీని కీరవాణికి అందించింది. ఆ పాటలు బాగా నచ్చడంతో తన టీమ్ మెంబర్‌గా చేర్చుకున్నాడు. మొదట్లో కోరస్ పాడించుకున్న కీరవాణి.. ‘బాహుబలి’లో మనోహరి పాటను ఆమెతో పాడించాడు. అది సూపర్ హిట్ అవ్వడంతో పాటు మోహనకు గుర్తింపు తెచ్చిపెట్టింది. అలాగే ఆమెకు ఆఫర్స్ క్యూకట్టాయి
‘రెడ్డమ్మ తల్లి’పై ప్రశంసల జల్లు
‘భలే భలే మగాడివోయ్’ టైటిల్ సాంగ్, ‘బాహుబలి-2’లోని ‘ఓరోరి రాజా’(తమిళ వెర్షన్) పాటలతో పాటు ప్రత్యేక ఆల్బమ్స్ చేస్తూ వచ్చారు. 2019లో అరవింద సమేత వీర రాఘవ (2019) చిత్రంలోని ‘రెడ్డమ్మ తల్లి’పాటకు మోహనపై ప్రశంసల వర్షం కురిసింది. అంతేకాదు ఈ పాట పాడినందుకు ఉత్తమ మహిళా నేపథ్య గాయనిగా ఫిల్మ్‌ఫేర్ అవార్డుకు మోహన భోగరాజు నామినేట్ అయ్యింది. అలాగే వకీల్ సాబ్‌లోని ‘మగువా మగువా’ ఫిమేల్ వెర్షన్ పాడింది ఈ భామనే. వీటితో ‘సైజ్ జీరో’, ‘అఖిల్’, ‘సోగ్గాడే చిన్నినాయనా’, ‘ఇజం’, ‘శతమానం భవతి’, ‘జవాన్’, ‘భాగమతి’, ‘సవ్యసాచి’, ‘బ్లఫ్ మాస్టర్’, ‘ఎన్టీఆర్ బయోపిక్’, ‘ఓ బేబీ’, ‘వెంకీమామ’, ‘హిట్’ వంటి సూపర్ హిట్ చిత్రాల్లో మోహన పాటలు పాడింది.
బుల్లెట్ బండి అలా పుట్టింది
ఇక ఇటీవల ఆమె విడుదల చేసిన ‘బుల్లెట్ బండి’ పాటకు ఎంత క్రేజ్ వచ్చిందో ప్రత్యేకించి చెప్పనక్కరలేదు. ఊరూ వాడా మారుమోగిపోతోంది. అయితే ఈ పాట ఎలా పుట్టిందో మోహన ఓ ఇంటర్వ్యూలో చెప్పింది. మోపెండ్లీడుకొచ్చిన ఓ యువతి మనోభావాలను పాట రూపంలో చెప్పాలని ఎప్పటి నుంచో అనుకుంటుందట. ఆమె ఎక్కడ పుట్టింది? ఎలా పెరిగింది? ఆమె నేపథ్యం ఏంటి? అనేది తాను పెళ్లి చేసుకునే యువకుడి వివరించాలనేది తన కాన్సెప్ట్. తన ఆలోచనకు తగినట్లుగా లక్ష్మణ్ మంచి లిరిక్స్ అందించాడు. అందుకే మోహన ఈ పాటను వెంటనే ఒప్పేసుకొని ఆస్వాదిస్తూ పాడిందట. సినిమా పాటలు పాడుతున్నప్పటికీ ఫోక్ సాంగ్స్‌ని వదలని చెబుతోంది మోహన.
Comments
Please login to add a commentAdd a comment