శ్రీలీల.. ఈ పేరు ఇప్పుడు టాలీవుడ్‌లో సంచలనం. తనదైన అందం,అభినయంతో ఈ బ్యూటీ దూసుకెళ్తోంది. తొలి సినిమా పెళ్లి సందD బాక్సాఫీస్ వద్ద ఆశించిన స్థాయిలో ఆడకపోయినా.. శ్రీలీలకు మాత్రం యమ క్రేజీ తెచ్చిపెట్టింది. ఆ తర్వాత ‘ధమాకా’ శ్రీలీల జీవితాన్నే మార్చేసింది. ప్రస్తుతం ఈ అమ్మడు మహేశ్‌బాబు లాంటి స్టార్ హీరోల సినిమాలతో ఫుల్ బిజీగా ఉంది. టాలీవుడ్‌లో ఏ స్టార్ హీరోయిన్‌కు లేనన్ని సినిమాలు శ్రీలీల చేతిలో ఉన్నాయి. దాదాపు 10 సినిమాలు షూటింగ్ దశలో ఉన్నాయంటే ఈ అమ్మడు క్రేజీ ఏ రేంజ్‌లో ఉందో అర్థం చేసుకోవచ్చు.
ఇప్పటికే బడా నిర్మాణ సంస్థలన్నీ శ్రీలీలకు అడ్వాన్స్‌లు ఇచ్చేసుకున్నాయి. కానీ శ్రీలీల మాత్రం తన కెరీర్ విషయంలో ఆచుతూచి వ్యవహరిస్తుంది. వచ్చిన ప్రతి ఆఫర్‌ని స్వీకరించకుండా.. నచ్చిన, పేరొచ్చే ప్రాజెక్టులకే ఓకే చెబుతోంది. తనకు నచ్చకపోతే ఎంత పెద్ద స్టార్ సినిమా అయినా నిర్మోహమాటంగా నో చెబుతోందట. తాజాగా ఈ ‘ధమాకా’ బ్యూటీ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ సినిమానే రిజెక్ట్ చేసిందట. అది కూడా పాన్ ఇండియా మూవీ పుష్ప-2.
వివరాల్లోకి వెళితే.. అల్లు అర్జున్-సుకుమార్ కాంబోలో వచ్చిన పుష్ప చిత్రం ఏ స్థాయిలో విజయం సాధించిందో అందరికి తెలిసిందే. అందులో ఐటమ్ సాంగ్ ‘ఊ అంటావా మావా..’చేసిన రచ్చ అంతా ఇంతా కాదు. సమంత వల్లే ఆ ఐటమ్ సాంగ్‌కి అంత పేరు వచ్చింది. అందుకే పుష్ప -2లో కూడా అలాంటి ఓ ఐటమ్ సాంగ్‌ని ప్లాన్ చేశాడట సుకుమార్. ఇందుకుగాను ట్రెడింగ్‌లో ఉన్న హీరోయిన్స్‌ని చూశారట. తొలుత ఒకరిద్దరు బాలీవుడ్ హీరోయిన్లతో ఈ ఐటమ్ సాంగ్‌ని రూపొందించాలనుకున్నారట. కానీ చివరకు యూనిట్ అంతా శ్రీలీల వైపు మొగ్గు చూపారట.
ఇటీవల శ్రీలీలను సంప్రదిస్తే.. సున్నితంగా తిరస్కరించిందట. ప్రస్తుతం ఈ బ్యూటీ చేతిలో దాదాపు 10 ప్రాజెక్టులు ఉన్నాయి. ఇలాంటి సమయంలో ఐటమ్ సాంగ్ చేస్తే తన కెరీర్‌కి ఇబ్బంది అవుతుందని భావించి రిజెక్ట్ చేసినట్లు తెలుస్తోంది. భారీ మొత్తంలో రెమ్యునరేషన్ ఆఫర్ చేసిన నో చెప్పారట. ఇప్పటికే మహేశ్ బాబు, పవన్ కల్యాణ్ లాంటి స్టార్ హీరోలతో కలిసి నటిస్తున్న శ్రీలీలకు భవిష్యత్తులో అల్లు అర్జున్ సరసన నటించే అవకాశం వస్తే మాత్రం అస్సలు వదులుకోదట. ఇప్పటికే ఓ యాడ్‌లో శ్రీలీల, బన్నీ కలిసి నటించారు. మరి వీరిద్దరు జంటగా నటించే సినిమా ఎప్పుడు వస్తుందో చూడాలి.
Comments
Please login to add a commentAdd a comment