
అజయ్, ప్రసన్నకుమార్, చదలవాడ శ్రీనివాస్, ముత్యాల రామ్‌దాస్
‘‘పంపిణీదారుడు, నిర్మాత గుండాల కమలాకర్ రెడ్డి మృతి చిత్రపరిశ్రమకు తీరని లోటు’’ అని నిర్మాత చదలవాడ శ్రీనివాస్ అన్నారు. నల్గొండ జిల్లా దామచర్ల మండలం కొండప్రోలు వద్ద బుధవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో కమలాకర్ రెడ్డి మృతి చెందిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా హైదరాబాద్‌లో గురువారం నిర్వహించిన ఆయన సంతాప సభలో చదలవాడ శ్రీనివాస్ మాట్లాడుతూ– ‘‘20 ఏళ్ల క్రితం ‘అభయ్’ సినిమాతో కమలాకర్ రెడ్డి, జనార్దన్ నాకు పరిచయం.
కమలాకర్ మన మధ్య లేకపోయినా అతని మంచి ఆశయాలు మనతోనే ఉంటాయి’’ అన్నారు. ‘‘300 యోధులు, 1000 బీసీ, బలాదూర్’ వంటి ఎన్నో మంచి చిత్రాలను పంపిణీ చేశారు కమలాకర్ రెడ్డిగారు. ముంబయ్‌లో ఉన్న పెద్ద పెద్ద సంస్థలు కమలాకర్‌గారి కె.ఎఫ్.సి సంస్థను సంప్రదించేవి. జనార్దన్‌గారు కమలాకర్‌గారి కుటుంబానికి అండగా నిలవాలని కోరుతున్నా’’ అన్నారు నిర్మాత తుమ్మల ప్రసన్నకుమార్.
‘‘మంచి సినిమాలు చేస్తూ పంపిణీదారునిగా మంచి పేరున్న కమలాకర్ రెడ్డిగారు మన మధ్య లేకపోవడం బాధాకరమైన విషయం’’ అని ఏపీ ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ ఉపాధ్యక్షుడు, నిర్మాత ముత్యాల రామ్‌దాస్ అన్నారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ ఉపాధ్యక్షుడు వి.ఎల్. శ్రీధర్, ‘ఈనాడు’ సినిమా నిర్మాత కుమార్ బాబు, ‘మాతృదేవోభవ’ దర్శకుడు అజయ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.