Chiranjeevi And Other Tollywood Celebrities Pay Tributes To Superstar Krishna Death - Sakshi
Sakshi News home page

Superstar Krishna Death: సూపర్‌ స్టార్‌ కృష్ణ మృతి.. సినీ ప్రముఖుల నివాళి

Published Tue, Nov 15 2022 8:45 AM | Last Updated on Tue, Nov 15 2022 12:44 PM

Chiranjeevi And Other Tollywood Celebs Pay Tribute to Krishna Demise - Sakshi

సూపర్‌ స్టార్‌ కృష్ణ మృతితో సినీ పరిశ్రమలో విషాదం నెలకొంది. కొంతకాలంగా శ్వాస సంబంధిత సమస్యలతో బాధపడుతున్న ఆయన ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మంగళవారం (నవంబర్‌ 15) తెల్లవారుజామున తుదిశ్వాస విడిచారు.ఆయన మరణారవార్తతో సినీ పరిశ్రమ తీవ్ర దిగ్భ్రాంతికి గురైంది. ఆయన మృతికి సినీ ప్రముఖులు సంతాపం ప్రకటిస్తున్నారు. మెగాస్టార్‌ చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జున, డైరెక్టర్‌ గొపిచంద్‌ మలినేని, హీరో నాని, నటుడు పవన్‌ కల్యాణ్‌ ఇతర నటీనటులు సోషల్‌ మీడియా వేదికగా ఆయనకు నివాళులు అర్పిస్తున్నారు.

(చదవండి: ఎన్నో ప్రయోగాలు.. మరెన్నో రికార్డులు..కృష్ణని ఎవరూ బీట్‌ చేయలేరేమో!)

ఈ మేరకు చిరంజీవి ట్వీట్‌ చేస్తూ.. ‘మాటలకు అందని విషాదం ఇది. సూపర్ స్టార్ కృష్ణ గారు మనల్ని వదిలి వెళ్లిపోవడం నమ్మశక్యం కావడం లేదు. ఆయన మంచి మనసు గలిగిన హిమాలయ పర్వతం. సాహసానికి ఊపిరి, ధైర్యానికి పర్యాయపదం. ధైర్యం, సాహసం, పట్టుదల, మానవత్వం, మంచితనం.. వీటి కలబోత కృష్ణ గారు.

అటువంటి మహా మనిషి తెలుగు సినీ పరిశ్రమలోనే కాదు, భారత సినీపరిశ్రమలోనే అరుదు. తెలుగు సినీ పరిశ్రమ సగర్వంగా తలెత్తుకోగల అనేక సాహసాలు చేసిన కృష్ణ గారికి అశ్రు నివాళి. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకొంటూ నా సోదరుడు మహేష్ బాబుకు, ఆయన కుటుంబ సభ్యులందరికీ,అసంఖ్యాకమైన ఆయన అభిమానులకి నా ప్రగాఢ సంతాపం, సానుభూతి తెలియ చేసుకొంటున్నాను.. అంటూ మెగాస్టార్ ఎమోషనల్ పోస్ట్ షేర్ చేశారు.

ఆయన కోలుకుని వస్తారనుకున్నా: పవన్‌ కల్యాణ్‌
కృష్ణ మృతిపై నటుడు పవన్‌ కల్యాణ్‌ స్పందించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ ఆయన ఆత్మకు శాంతి చేకూరాలంటూ నివాళులు అర్పించారు. ‘చిత్రసీమలో సూపర్ స్టార్ బిరుదుకి సార్థకత చేకూర్చిన నటులు కృష్ణ గారు. ఆయన మరణించారనే విషయం ఎంతో ఆవేదన కలిగించింది. కృష్ణ గారు అస్వస్థతతో ఆసుపత్రిలో చేరారని తెలిశాక కోలుకొంటారని ఆశించాను. ఇప్పుడు ఈ విషాద వార్త వినాల్సి వచ్చింది. ఆయన పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుణ్ణి ప్రార్థిస్తున్నాను’ అని అన్నారు. 

ఆయన మరణం తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేసింది: బాలకృష్ణ
అలాగే నందమూరి హీరో బాలకృష్ణ కూడా కృష్ణ మృతిపై స్పందించారు. ఘట్టమనేని కృష్ణ గారి మరణం తీవ్ర దిగ్బ్రాంతిని కలిగించిందంటూ ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ‘కృష్ణ గారు తన నటనతో చిత్రసీమలో సరికొత్త ఒరవళ్ళు సృష్టించి ఎనలేని ఖ్యాతి సంపాదించి ప్రేక్షకుల మనసులో చెరగని ముద్ర వేసుకున్నారు. నటుడిగా, నిర్మాతగా, దర్శకుడిగా స్టూడియో అధినేతగా చిత్ర పరిశ్రమకు ఆయన అందించిన సేవలు మరువలేనివి. కృష్ణగారితో మా కుటుంబానికి ఎంతో అనుబంధం ఉంది.

నాన్నగారు, కృష్ణ గారు కలసి అనేక చిత్రాలకు పని చేశారు. ఆయనతో కలిసి నేను నటించడం మర్చిపోలేని అనుభూతి. కృష్ణ గారు లేనిలోటు సినీ పరిశ్రమకూ, అభిమానులకు ఎప్పటికీ తీరనిది. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుడిని ప్రార్ధిస్తున్నాను. ఇటివలే సోదరుడు రమేష్ బాబుని, మాతృమూర్తి ఇందిరాదేవిని కోల్పోయి దుఃఖంలో ఉన్న నా సోదరుడు మహేష్ బాబుకు ఈ కష్టం కాలంలో దేవుడు మనో ధైర్యాన్ని ఇవ్వాలని కోరుకుంటూ.. ఆయన కుటుంబ సభ్యులందరికీ నా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాను’ అంటూ ప్రకటన విడుదల చేశారు. 

సూపర్‌ స్టార్‌ కృష్ణ మృతి సీనియర్‌ హీరో, నటుడు సాయి కుమార్‌ విచారం వ్యక్తం చేశారు. ఈ మేరకు ఆయన ఓ విడుదల చేస్తూ కృష్ణ మృతికి సంతాపం ప్రకటించారు. ‘ఆయన ఒక పరంపర, ఒక సంచలనం, రికార్డుల గని, నిర్మాతల హీరో, చక్కని రూపశీలి, ఎన్నో ప్రయోగాలు చేసిన సాహసి,  జనం మనిషి, అందరు నచ్చే మేచ్చే మహా మనిషి, ఆయనే మన డేరింగ్‌ అండ్‌ డాషింగ్‌ హీరో సూపర్‌ స్టార్‌ శ్రీ ఘట్టమనేని కృష్ణగారు. కృష్ణగారి కథ ఒక చరిత్ర.. ఆ కథ ఈ రోజుతో ఆగింది. కానీ.. చరిత్ర మాత్రం ఎప్పటికీ సువర్ణాక్షరాలతో ఎప్పుడు వెండితెరపై నిలిచే ఉంటుంది. మన గుండెలో ఉంటుంది. వారి కుటుంబానికి ప్రగాఢ సానూభూతి తెలియజేస్తూ.. ఆయన ఆత్మకు శాంతి కలగాలని.. ఆయన కుటుంబానికి, అభిమానులకు భగవంతుడు ఆత్మస్థైరాన్ని ఇవ్వాలని కోరుకుంటూ జై సూపర్‌ స్టార్‌’ అని సాయి కుమార్‌ నివాళులు అర్పించారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement