![Choreographer Rakesh Master Passed Away - Sakshi](/styles/webp/s3/article_images/2023/06/18/Rakesh-Master-Passed-Away.jpg.webp?itok=_LUZMRhy)
తెలుగు చలన చిత్రసీమలో విషాదం చోటు చేసుకుంది. ప్రముఖ సినీ నృత్యకారుడు ఎస్.రామారావు అలియాస్ రాకేశ్ మాస్టర్(53) మరణించారు. ఆదివారం ఉదయం ఆయన రక్తవిరోచనాలు చేసుకున్నారు. దీంతో ఆయనను గాంధీ ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ కన్నుమూశారు. కాగా హైదరాబాద్‌లో ముక్కురాజు మాస్టర్ వద్ద పనిచేసిన రాకేష్ మాస్టర్.. ఆ తరువాత లాహిరి లాహిరి లాహిరిలో, దేవదాసు, చిరునవ్వుతో, సీతయ్య, అమ్మో పోలీసోళ్ళు వంటి ఎన్నో సూపర్ హిట్ సినిమాలకు కొరియోగ్రఫర్‌గా పని చేశారు.
ఆ గొప్ప డ్యాన్సర్లు ఈయన శిష్యులే
దాదాపు 1500 చిత్రాలకు కొరియోగ్రఫీ చేశారు. స్టార్ హీరోలందరికీ కొరియోగ్రఫీ చేసిన ఘనత ఆయన సొంతం. టాలీవుడ్‌లో నెంబర్ వన్ కొరియోగ్రాఫర్లుగా చెలామణీ అవుతున్న శేఖర్ మాస్టర్, జానీ మాస్టర్లు ఈయన శిష్యులే! రాకేశ్ మాస్టర్ మరణవార్త గురించి ఆయన అసిస్టెంట్ సాజిత్ మాట్లాడుతూ.. 'హనుమాన్ క్లైమాక్స్ షూటింగ్ చేసినప్పుడు రాకేశ్ మాస్టర్‌కు విరోచనాలు, వాంతులు జరిగాయి. అప్పుడు ఆయన్ను ఆస్పత్రికి తీసుకెళ్లాం.
కాళ్లు, చేతులు పడిపోవడంతో
ఈయన బతకడం కష్టమని డాక్టర్లు అప్పుడే చెప్పారు. జాగ్రత్తగా చూసుకోమని చెప్పారు. ఇది జరిగి రెండు నెలలు అవుతోంది. వారం రోజుల క్రితం ఓ ప్రాజెక్ట్ షూటింగ్ నిమిత్తం విశాఖపట్నం, భీమవరం వెళ్లి ఈ మధ్యే హైదరాబాద్ వచ్చారు. అప్పటినుంచి ఆయన అనారోగ్యం పాలయ్యారు. ఈ రోజు మధ్యాహ్నం ఆయన కాళ్లు, చేతులు పడిపోయాయి అని ఫోన్ వచ్చింది. పక్షవాతంలాగా అనిపిస్తోందని ఇంటిసభ్యులు చెప్పారు. ఇంతలోనే ఆయన మరణించినట్లు తెలిసింది' అని చెప్పుకొచ్చాడు.
Comments
Please login to add a commentAdd a comment