తెలుగు చలన చిత్రపరిశ్రమలో విషాదం నెలకొంది. ప్రముఖ నృత్య దర్శకుడు ఎస్.రామారావు అలియాస్ రాకేష్ మాస్టర్(53) ఆదివారం మృతిచెందారు. వారం క్రితం ఓ సినిమా షూటింగ్ కోసం విశాఖపట్నం, భీమవరం వెళ్లి వచ్చిన ఆయన అప్పటినుంచి అనారోగ్యం పాలయ్యారు. ఆదివారం రక్త విరోచనాలు కావడంతో గాంధీ ఆస్పత్రికి తరలించగా అక్కడ చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు.
10 ఏళ్ల వయసులోనే డ్యాన్స్ వైపు అడుగులు
ఆంధ్రప్రదేశ్‌లోని తిరుపతి ప్రాంతంలో రాకేష్ మాస్టర్ జన్మించారు. ఆయన అసలు పేరు ఎస్.రామారావు. 10 ఏళ్ల వయస్సులో డిస్కో డాన్స్ చూసి డ్యాన్సర్‌గా మారాలనుకున్నారు. కానీ, ఎక్కడ నేర్చుకోవాలి? ఎవరు నేర్పుతారు? అని తెలియక టీవీలో వచ్చే పాటలను చూసి డ్యాన్స్ నేర్చుకున్నారు. ఆ తర్వాత తిరుపతి టౌన్‌కి వెళ్లి ఓ డ్యాన్స్ స్కూల్ ప్రారంభించారు. తొలిరోజుల్లో కేవలం రూ.5 ఫీజుతో డ్యాన్స్‌లో శిక్షణ ఇచ్చేవారు. కొన్ని రోజుల తర్వాత సినిమా అవకాశాల కోసం చెన్నై వెళ్లారు.
ప్రభుదేవాపై సంచలన వ్యాఖ్యలు
చాన్స్‌లు రాకపోవడంతో మళ్లీ తిరుపతికి వచ్చి డ్యాన్స్ ఇన్‌స్టిట్యూట్‌ను నడిపారు. ఆ తర్వాత ముక్కు రాజు మాస్టర్ దగ్గర కొంతకాలం పనిచేశారు రాకేష్ మాస్టర్. ‘ఆట’, ‘ఢీ’ లాంటి డ్యాన్స్ రియాలిటీ షోల ద్వారా డ్యాన్స్ మాస్టర్‌గా కెరీర్‌ను మొదలు పెట్టారాయన. ‘ఢీ’ షోలో బషీర్ అనే కుర్రాడికి మాస్టర్‌గా వ్యవహరిస్తున్న సమయంలో ఆ షోకి ఓ జడ్జిగా వ్యవహరించిన ప్రముఖ డ్యాన్స్ మాస్టర్, నటుడు ప్రభుదేవాతో ‘తెలుగు తెలిసిన వాళ్లే జడ్జిలుగా ఉండాలి’ అంటూ కామెంట్స్ చేసి, వార్తల్లో నిలిచారు రాకేష్ మాస్టర్.
చిరునవ్వుతో సినిమాతో మొదలైన ప్రయాణం
వేణు తొట్టెంపూడి హీరోగా నటించిన ‘చిరునవ్వుతో’ లో ‘నిన్నలా మొన్నలా లేదురా..’ పాటతో సినిమాల్లో కొరియోగ్రాఫర్‌గా తొలి అవకాశం అందుకున్నారాయన. ఆ తర్వాత ‘లాహిరి లాహిరి లాహిరిలో, దేవదాసు, సీతారామరాజు, యువరాజు, గర్ల్ ఫ్రెండ్, బడ్జెట్ పద్మనాభం, మనసిచ్చాను, సీతయ్య, అమ్మో పోలీసోళ్లు’ వంటి దాదాపు 1500 చిత్రాలకుపైగా కొరియోగ్రఫీ చేశారు రాకేష్ మాస్టర్. ‘గ్లోబల్ పీస్ యూనివర్సిటీ’ నుంచి డాక్టరేట్‌ను అందుకున్నారాయన. ప్రభాస్ వంటి పలువురు హీరోలకు డ్యాన్స్‌లో శిక్షణ ఇచ్చారు.
కామెడీ షోలోనూ పార్టిసిపేట్ చేసిన రాకేశ్
టాలీవుడ్‌లోని పలువురు స్టార్ హీరోలందరికీ కొరియోగ్రఫీ చేసిన ఘనత ఆయన సొంతం. ప్రస్తుతం తెలుగులో అగ్ర కొరియోగ్రాఫర్లుగా ఉన్న శేఖర్ మాస్టర్, జానీ మాస్టర్ రాకేష్ మాస్టర్ శిష్యులే కావడం విశేషం. ఓ టీవీ చానల్‌లో ప్రసారం అవుతున్న షోలో పలు స్కిట్లు చేసి, బుల్లితెర ప్రేక్షకుల్ని తనదైన శైలిలో నవ్వించారు రాకేష్ మాస్టర్. కొంతకాలంగా ఆయన సినిమాలకు దూరంగా ఉన్నారు. అయితే సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండేవారు. యూట్యూబ్ చానల్స్ వేదికగా పలువురు సెలబ్రిటీలపై వివాదాస్పద ఇంటర్వ్యూలు ఇచ్చి ఇటీవల మళ్లీ ట్రెండ్ అయ్యారాయన.
వివాదాలతో కుటుంబానికి దూరం
వివాదాస్పద వ్యాఖ్యలు చేయడంతో వారి అభిమానుల నుంచి రాకేష్ మాస్టర్‌కి, ఆయన కుటుంబానికి బెదిరింపులు వచ్చేవి. ఈ కారణంగా ఆయన కుటుంబానికి దూరంగా అబ్దుల్లాపూర్‌మెట్‌లోని ఓ అనాథ ఆశ్రమంలో ఉంటూ వచ్చారు. ఆయనకు భార్య లక్ష్మి, కుమారుడు చరణ్‌తేజ్, కుమార్తె శ్రీజ ఉన్నారు. రాకేష్ మాస్టర్ మృతి పట్ల పలువురు సినీ ప్రముఖులు తమ సంతాపం తెలిపారు. కాగా హైదరాబాద్‌లోని బోరబండలో నేడు రాకేష్ మాస్టర్ అంత్యక్రియలు నిర్వహించనున్నారు.
మల్టీ ఆర్గాన్ ఫెయిల్యూర్‌తోనే..
‘‘ఆదివారం మధ్యాహ్నం ఒంటిగంటకు రాకేష్ మాస్టర్‌ని గాంధీ ఆసుపత్రిలో అడ్మిట్ చేశారు. డయాబెటిక్ పేషెంట్ కావడం, సివియర్ మెటబాలిక్ ఎసిడోసిస్ కావడంతో మల్టీ ఆర్గాన్ ఫెయిల్యూర్ అయి సాయంత్రం 5గంటలకు మృతి చెందారు’’ అని గాంధీ ఆస్పత్రి సూపరింటెండెంట్ రాజారావు మీడియాకు తెలిపారు.
చదవండి: డబ్బులు తీసుకుని డేట్స్ ఇవ్వని హీరోలు.. రెడ్ నోటీసులిచ్చేందుకు చిత్రమండలి రెడీ
Comments
Please login to add a commentAdd a comment