తన్నిష్ఠ ఛటర్జీ, జేడీ చక్రవర్తి ప్రధాన పాత్రలో జాతీయ పురస్కార గ్రహీత, ప్రముఖ దర్శకుడు రాజేష్ టచ్‌రివర్ తెరకెక్కించిన సినిమా 'దహిణి'. ఓరియన్ పిక్చర్స్ ఇంటర్నేషనల్ ప్రైవేట్ లిమిటెడ్, సన్‌టచ్ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై పద్మశ్రీ అవార్డు గ్రహీత, మానవతావాది సునీత కృష్ణన్, ప్రదీప్ నారాయణన్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మించారు. తాజాగా ఈ చిత్రం స్వీడిష్ ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్‌కు ఎంపిక అయ్యింది. ఈ సినిమాకు ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్‌లో గౌరవం దక్కడం ఇది రెండోసారి. ఇప్పటికే ఈ చిత్రానికి పసిఫిక్ బీచ్ ఇంటర్నేషనల్ ఫెస్టివల్‌లో 'బెస్ట్ ఇంటర్నేషనల్ ఫీచర్ ఫిల్మ్' అవార్డు లభించింది.
వాస్తవ ఘటనలు ఆధారంగా రాజేష్ టచ్‌రివర్ సినిమాలు తీస్తుంటారు. దర్శకుడిగా ప్రయాణం ప్రారంభించినప్పటి నుండి ఆయనది అదే పంథా. గతంలో ఎన్నో సమస్యలను సినిమాల ద్వారా ఆయన వెలుగులోకి తీసుకొచ్చారు. ఇప్పుడు 'విచ్ హంటింగ్' పేరుతో పలు రాష్ట్రాలలో జరుగుతున్న దారుణాలను వెలుగులోకి తీసుకురావాలనే ప్రయత్నంతో... వివాదాస్పద అంశాలను స్పృశిస్తూ 'దహిణి' తెరకెక్కించారు. ఒరిస్సాలోని మయూర్ బంజ్ జిల్లా, పరిసర ప్రాంతాల్లో జరిగిన యథార్థ ఘటన ఆధారంగా, వాస్తవికతకు దగ్గరగా 'దహిణి' చిత్రాన్ని రూపొందించారు.
ఆధునిక కాలంలో కూడా లింగ ఆధారిత హింసతో, ఇప్పటికీ అనాగరిక చర్యలను కొంత మంది పాటిస్తున్నారు. ఇది మానవ హక్కుల ఉల్లంఘన అయినప్పటికీ ఎవ్వరూ ఈ దారుణాల గురించి మాట్లాడకపోవడం దురదృష్టం. ఈ వాస్తవాలను అందరికీ తెలియజేయడానికి మేం చేసిన ప్రయత్నం ఈ సినిమా అని మానవ హక్కుల కార్యకర్త, పద్మశ్రీ పురస్కార గ్రహీత సునీత కృష్ణన్ అన్నారు. ‘నేటి భారతంలో వేలాది మంది మహిళలను మంత్రగత్తెల పేరుతో ఎలా వేటాడుతున్నారు? మా సినిమాలో ఈ అంశం గురించి చాలా ఓపెన్‌గా ఈ ఇష్యూ గురించి చర్చిస్తున్నాం. దీని తర్వాత ప్రేక్షకులు మాట్లాడతారని ఆశిస్తున్నాం’అని నిర్మాత ప్రదీప్ నారాయణన్ అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment