ది డీల్ తెలుగు సినిమా రివ్యూ
ప్రభాస్ ఈశ్వర్ సినిమాతో వెండితెరకు పరిచయం నటుడు 'హను కోట్ల'. ఆయన హీరోగా నటించిన కొత్త చిత్రం 'ది డీల్'.. అయితే, ఈ మూవీకి ఆయనే దర్శకుడు కావడం విశేషం. హను కోట్ల ఇప్పటికే బుల్లితెరలో ప్రసారం అయ్యే మాయాబజార్ సీరియల్ 150 ఎపిసోడ్స్ చేయడమే కాకుండా పలు యాడ్స్ చేశారు. ఈ మూవీతో ఆయన వెండితెరకు దర్శకుడి పరిచయం కావడం విశేషం. సిటాడెల్ క్రియేషన్స్, డిజిక్వెస్ట్ బ్యానర్స్ పై డాక్టర్ అనిత రావు సమర్పణలో హెచ్ పద్మా రమకాంతరావు, రామకృష్ణ కొళివి నిర్మించారు. ఇందులో చందన, ధరణి ప్రియా హీరోయిన్లుగా నటించారు. ఈ సస్పెన్స్ థ్రిల్లర్ మూవీ నేడు శుక్రవారం (అక్టోబర్ 18) న విడుదలైంది. సినిమా ఎలా ఉందో రివ్యూలో తెలుసుకుందాం.
కథేంటి..?
భైరవ (హనుకోట్ల) యాక్సిడెంట్‌కి గురై కోమాలోకి వెళ్తాడు. మూడు నెలల తర్వాత నెమ్మదిగా ఆ కోమా నుంచి బయట పడుతాడు. కానీ తను గతం మర్చిపోతాడు. కోమాలో నుంచి బయటకు వచ్చినప్పుడు లక్ష్మి(ధరణి ప్రియా)ని తలుచుకుంటాడు. ఆమె తన భార్య అని, ఆమెని చూడాలని, కలవాలని అంటుంటాడు. తానెవరో తెలుసుకునే ప్రయత్నం చేస్తుంటాడు. ఈ క్రమంలో ఓ విలన్ ఇందు(సాయి చందన)ని చంపేసే ప్రయత్నం చేస్తుంటాడు. దీని వెనకాల మాదవ్(రవి ప్రకాష్) ఉంటాడు. ఇందు ఎవరూ లేని ఒంటరి మహిళ. తను బ్యాంక్ లో ఎంప్లాయ్‌గా పని చేస్తుంటుంది. ఇందుని కాపాడి ఆమెకి దగ్గరవుతాడు భైరవ. తనని ఎందుకు చంపాలనుకుంటున్నారనేది, అదే సమయంలో తాను ఎవరనేది తెలుసుకునే ప్రయత్నం చేస్తుంటాడు.
ఇందుని ఆసుపత్రిలో కలవడానికి మాదవ్, లక్ష్మి వస్తారు. అక్కడ లక్ష్మిని చూసి ఆమెని కలిసేందుకు భైరవ వెళ్లగా, ఎవరో తెలియనట్టుగా వెళ్లిపోతుంది. మరోసారి తను నా భార్య అంటూ ఆసుపత్రిలో గొడవ చేస్తారు. తమ ప్లాన్స్ కి అడ్డుగా వస్తున్న భైరవని కూడా చంపేయాలనుకుంటారు మాధవ్, లక్ష్మి. మరి భైరవ భార్య అయిన లక్ష్మి మాదవ్‌ని భైరవగా ఎందుకు చెబుతుంది..? ఆయనతో ఎందుకు తిరుగుతుంది..? ఇందుని ఎందుకు చంపాలనుకుంటున్నారు..? మధ్యలో ఇందు గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్ కంపెనీ అధినేత రావు(రఘు కుంచె).. ఇందుకి ఒక సామాన్యుడిగా ఎందుకు పరిచయం అయ్యాడు..? ఈ మొత్తం కథకి ఇందుకి ఉన్న సంబంధమేంటి..? చివరికి కథ ఎలాంటి మలుపులు తిరుగుతుందో తెలుసుకోవాలంటే 'ది డీల్' చూడాల్సిందే.
ఎలా ఉందంటే..
టాలీవుడ్‌లో కంటెంట్ బేస్డ్ సినిమాలు ఇప్పుడు చాలా వస్తున్నాయి. చిన్న పాయింట్ చుట్టూ కథని అల్లుతూ సినిమాలు చేసి హిట్ కొడుతున్నారు మేకర్స్. అయితే ఇలాంటి సినిమాలకు చాలా వరకు ఓటీటీలో మంచి ఆదరణ ఉంటుంది. థియేటర్లో రీచ్ తక్కువగా ఉంటుంది. కానీ కొత్తగా వస్తున్న మేకర్స్ చేసే ఇలాంటి ప్రయోగాలు అభినందనీయంగా ఉండటం విశేషం. స్క్రీన్‌ప్లేలో చేసే మ్యాజిక్‌లు హైలైట్‌గా నిలుస్తుంటాయి. ది డీల్ సినిమా కూడా అలాంటి కోవకు చెందిన చిత్రమే. ఇదొక సస్పెన్స్ థ్రిల్లర్ మూవీ. దాని చుట్టూ అల్లుకున్న డ్రామా ఈ సినిమాలో హైలైట్ పాయింట్. ఆద్యంతం ట్విస్ట్ లతో సినిమాని నడిపించడం మరో హైలైట్ పాయింట్.
ఓ అమ్మాయిని హత్య చేసేందుకు ఓ గ్యాంగ్ సుఫారీ తీసుకుని ఆమె హత్యకు చేసే ప్రయత్నాలు, అవి బెడిసికొట్టడం, ఈ క్రమంలో యాక్సిడెంట్, అనంతరం ట్విస్ట్ లు ఆకట్టుకునే అంశాలు. ఫస్టాఫ్ అంతా హీరో యాక్సిడెంట్ తర్వాత తానెవరు అని తెలుసుకునేందుకు చేసే ప్రయత్నాలతో సాగుతుంది. ఎవరు ఇందుని చంపాలనుకుంటారు? తాను ఎందుకు కాపాడతాడు? భైరవ భార్య లక్ష్మి మరో వ్యక్తితో ఎందుకు ఉంది? తన ఇంట్లో వాళ్లెందుకు ఉన్నారనే అంశాలు ఆద్యంతం సస్పెన్స్ తో సాగుతున్నాయి. ఇంటర్వెల్‌లో లక్ష్మి పాత్ర ఇచ్చే ట్విస్ట్ బాగుంది. అనంతరం అసలు కథ స్టార్ట్ అవుతుంది. అసలు భైరవ ఎవరు? అనే ట్విస్ట్ రివీల్ అయిన తీరు బాగుంది.
సెకండాఫ్ తర్వాత డ్రామా మరింత ఆసక్తికరంగా అనిపిస్తుంది. ప్రీ క్లైమాక్స్ నుంచి, క్లైమాక్స్ వరకు ఒక్కో ట్విస్ట్ రివీల్ అవుతుంటుంది. సినిమా స్క్రీన్‌ప్లే పరంగా, ట్విస్ట్‌ల పరంగా బాగా రాసుకున్నాడు దర్శకుడు. సినిమాని నడిపించిన తీరులో మాత్రం ఆ గ్రిప్పింగ్ మిస్ అయ్యింది. ప్రారంభం నుంచి స్లోగా, సాగదీసినట్టుగా సాగుతుంది. ఎక్కడా వేగం కనిపించదు. కానీ ట్విస్ట్‌లు కొంత రిలీఫ్ ఇస్తాయి. అమ్మ సెంటిమెంట్ ఆకట్టుకునేలా ఉంది. ఫ్యామిలీకి సంబంధించిన ఎలిమెంట్లు కూడా బాగున్నాయి. అయితే కథ రొటీన్‌గానే ఉంది.
ఆ విషయంలో దర్శకుడు మరింత కేర్ తీసుకోవాల్సింది. ఇంకోవైపు సెకండాఫ్‌లో భైరవ ఎవరు అని తెలిసే సీన్లు, దీనికితోడు ఇందుని చంపే సీన్లు కూడా తేలిపోయేలా ఉన్నాయి. అవి కాస్త రొటీన్‌గానే ప్లాన్ చేశారు. సినిమాని వేగంగా పరిగెత్తించేలా తీసి ఉంటే బాగుండేది. స్లోగా సాగడంతో కొన్ని చోట్ల సీరియల్‌ని తలపిస్తుంది. మరోవైపు ఆర్టిస్ట్‌ల నటన కూడా చాలా వరకు అసహజంగానే అనిపిస్తాయి. అనుభవ లేమి కనిపిస్తుంది. మ్యూజిక్, ముఖ్యంగా బీజీఎం పరంగా మరింత శ్రద్ధ పెట్టాల్సింది. దీంతో ఓ మంచి సినిమా యావరేజ్‌గా మారిపోయింది.
టెక్నీషియన్లు
సినిమాకి ఆర్ ఆర్ ధృవన్ సంగీతం ఓకే అనిపించేలా ఉంది. బీజీఎం మైనస్‌గా చెప్పొచ్చు. శ్రవణ్ కటికనేని ఎడిటింగ్ కూడా ఇంకా బాగా ఎడిటింగ్ చేయాల్సింది. సురేంద్ర రెడ్డి కెమెరా వర్క్ ఓకే అని చెప్పొచ్చు. ఇంకా బెటర్‌గా చేయోచ్చు. నిర్మాణ విలువలు ఉన్నంతలో ఓకే అనిపించాయి. ఇక దర్శకుడు కథ రెగ్యూలర్‌గానే తీసుకున్నా, తాను ట్విస్ట్ లతో రాసుకున్న తీరు బాగుంది. అయితే దర్శకుడిగా కొంత అనుభవ లేమి కనిపించినా, ట్విస్ట్ లు సినిమాకి రిలీఫ్‌నిచ్చే అంశాలు. సినిమాలో డ్రామా మేజర్ పార్ట్‌ని పోషిస్తుంది.
Comments
Please login to add a commentAdd a comment