పల్లె సంప్రదాయాన్ని కళ్లకు కట్టినట్టుగా చూపించిన చిత్రం బలగం. తెలంగాణ పల్లెల్లో కుటుంబ సభ్యుల మధ్య ఉండే ప్రేమానురాగాలను తెరపై చక్కగా చూపించారు. చిన్న సినిమా హృదయాలకు హత్తుకునేలా చేశారు దర్శకుడు వేణు. అంతలా విజయం సాధించిన ఈ చిత్రంపై ప్రముఖులు సైతం ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. ఇక గ్రామాల్లో అయితే ఏకంగా అందరూ ఒకచోట చేరి మరీ పెద్ద తెరలపై చూస్తున్నారు. కుటుంబ సభ్యుల భావోద్వేగాలకు కనెక్ట్ కావడంతో సినిమా చూసిన వారు కన్నీళ్లు ఆపులేకపోతున్నారు.
ఇంతగా భారీ విజయం సాధించిన ఈ చిత్రం కలెక్షన్ల పరంగా దూసుకెళ్తూ.. అవార్డులు కూడా కొల్లగొడుతోంది. అయితే తాజాగా బలగం సినిమా మీద పోలీసులకు ఫిర్యాదు చేశారు. అది కూడా ఎవరో కాదు. ఈ చిత్రాన్ని నిర్మించిన దిల్ రాజు టీమ్ కావడం గమనార్హం. వేణు ఎల్దండి మొదటిసారి దర్శకుడిగా తెరకెక్కించిన ఈ చిత్రంలో ప్రియదర్శి, కావ్య కళ్యాణ్ రామ్ జంటగా నటించారు. ఈ చిత్రాన్ని దిల్ రాజు వారసులు హన్షిత, హర్షిత్ రెడ్డి దిల్ రాజు ప్రొడక్షన్స్ బ్యానర్‌పై నిర్మించారు.
తన సినిమాకు సక్సెస్ వస్తే ఏ నిర్మాత అయినా సంతోషం వ్యక్తం చేస్తారు. కానీ అందుకు భిన్నంగా దిల్ రాజు మాత్రం పోలీసులకు ఫిర్యాదు చేశారు. అందుకు ప్రధాన కారణం ఈ చిత్రాన్ని గ్రామాల్లో పెద్ద స్క్రీన్స్ ఏర్పాటు చేసి ప్రదర్శించడమే. ఇలా చేయడం నేరమని ఆరోపిస్తూ నిజామాబాద్ ఎస్పీకి ఫిర్యాదు చేసింది దిల్ రాజు టీం. తమ అనుమతి లేకుండా ఇలా చేస్తున్న వారిపై వెంటనే చర్యలు తీసుకోవాలంటూ ఎస్పీని కోరారు. ఇలా చేయడం వల్ల తమ ఆదాయానికి గండి పడుతోందని చెబుతున్నారు. ప్రస్తుతం ఈ టాపిక్ సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది. ఈ సినిమాకు వచ్చిన ఆదరణ చూసి సంతోషించాల్సింది పోయి.. ఫిర్యాదు చేస్తారా అంటూ నెటిజన్స్ మండిపడుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment