నా విజయం వాయిదా పడిందనుకున్నా! | director subbu talking about solo brathuke so better movie | Sakshi
Sakshi News home page

నా విజయం వాయిదా పడిందనుకున్నా!

Published Mon, Aug 10 2020 2:36 AM | Last Updated on Mon, Aug 10 2020 2:36 AM

director subbu talking about  solo brathuke so better movie - Sakshi

దర్శకుడు సుబ్బు

‘‘నా చిన్నప్పుడు దూరదర్శన్‌ రోజుల్లో మా ఊర్లో మాకు టీవీ ఉండేది. ఆ టీవీ ముందు మా ఊరు మొత్తం ఉండేది. వీసీఆర్‌లో సినిమాలు వేసుకొని చూసే వాళ్లం. వీసీఆర్‌ని నేనే ఆపరేట్‌ చేసేవాడ్ని. దాంతో అక్కడ నన్ను అందరూ స్పెషల్‌గా చూసేవారు. అలా సినిమా మీద ఆసక్తి, ఇష్టం, పిచ్చి మొదలైంది’’ అన్నారు దర్శకుడు సుబ్బు. సాయి ధరమ్‌ తేజ్, నభా నటేష్‌ జంటగా నూతన దర్శకుడు సుబ్బు తెరకెక్కిస్తున్న చిత్రం ‘సోలో బ్రతుకే సో బెటర్‌’. శ్రీ వెంకటేశ్వర సినీ క్రియేషన్స్‌ బ్యానర్‌ పై బీవీయస్‌ఎన్‌ ప్రసాద్‌ నిర్మిస్తున్నారు. నేడు సుబ్బు పుట్టినరోజు. ఈ సందర్భంగా సుబ్బు చెప్పిన విశేషాలు..

► ‘‘సోలో బ్రతుకే సో బెటర్‌’ అనే ఫిలాసఫీని నమ్మే ఓ కుర్రాడి కథే ఈ సినిమా. దానివల్ల అతను ఎదుర్కొన్న సంఘటనలు, సమస్యలు ఈ సినిమాలో ఉంటాయి. సాయి ధరమ్‌ తేజ్‌ పాత్ర, స్టోరీ ట్రీట్మెంట్‌ కొత్తగా ఉంటుంది. ప్రేక్షకులు కచ్చితంగా కనెక్ట్‌ అవుతారు. స్నేహితులకు, తెలిసినవాళ్లకు ఇలాంటి సందర్భం ఎదురయినట్టు ఉండే సీన్స్‌ చాలా ఉంటాయి.  పాటలు మినహా ఈ సినిమా చిత్రీకరణ పూర్తయింది. రిలీజ్‌ డేట్‌ కూడా ఫిక్స్‌ అయ్యాము. ఈలోగా లాక్‌ డౌన్‌ వచ్చింది. దాంతో మా సినిమా విడుదల వాయిదా పడింది. నా సక్సెస్‌ కాస్త పోస్ట్‌ పోన్‌ అయిందనుకున్నాను. ఈ సినిమాను మరింత మెరుగుపరచుకునే అవకాశం వచ్చిందని భావించి సినిమా మీద ఇంకా వర్క్‌ చేశా.

► ఈ లాక్‌డౌన్‌లో కథలు వర్కవుట్‌ చేశాను. ఆల్రెడీ 3 కథలకు ఆలోచనలు ఉన్నాయి. ఒకదాన్ని పూర్తి చేశా.  ‘బొమ్మరిల్లు’ భాస్కర్, విరించి వర్మ దగ్గర దర్శకత్వ శాఖలో పని చేశాను. శ్రీ వెంకటేశ్వర సినీ క్రియేషన్స్‌ బ్యానర్‌ లో వచ్చిన ‘ఊసరవెల్లి, ఒంగోలు గిత్త’ సినిమాలు చేశాను. ఇదే బ్యానర్‌ లో దర్శకుడిగా నా మొదటి సినిమా చేయడం సంతోషంగా ఉంది. నా రెండో సినిమా ఈ బ్యానర్‌ లోనే ఉంటుంది. మొదటి సినిమా పట్టాలెక్కాలంటే చాలా కష్టం అంటారు. కానీ అదష్టవశాత్తు నా ప్రయాణం చాలా సాఫీగా జరిగినట్లే. మంచి నిర్మాత, అర్థం చేసుకునే హీరో దొరికారు.

► మాది తుని. పూరి జగన్నాథ్‌ గారు, గుణశేఖర్‌ గారు మా పక్కన ఊరే. వాళ్లు సినిమాల్లో సక్సెస్‌ అయ్యారు మనం కూడా అవొచ్చనే బూస్ట్‌ వచ్చింది.  మనం చెప్పే కథలతో కేవలం వినోదం పంచాం అన్నట్టు కాకుండా మన కథలకు కనెక్ట్‌ అయి ప్రేక్షకులు ఆలోచించేలా, వాళ్లకు ఓ నమ్మకం కలిగించేలా నా సినిమాలు ఉండాలనుకుంటాను. చిరంజీవిగారితో ఓ సినిమా చేయాలని నా డ్రీమ్‌.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement