ఏదైనా సమస్య వచ్చినపుడు పరిష్కారం కోసం చూడాలి. అంతేకాని ఆ సమస్య వల్ల కుంగిపోకూడదు. ఆదే సమస్య తో పాటు మరి కొన్ని సమస్యలు వచ్చినా మన మనో ధైర్యమే మనల్ని కాపాడుతుంది అన్న నమ్మకం ఉండాలి. ఈ దృక్పథంతో రూపొందిన సినిమాయే ది డైవ్. 2020 సంవత్సరంలో వచ్చిన నార్వే సినిమా బ్రేకింగ్ సర్ఫేస్ కి ఇది మూలం. ది డైవ్ సినిమాని మాక్సిమిలన్ అనే హాలివుడ్ దర్శకుడు దర్శకత్వం వహించి నిర్మించారు.
ఈ సినిమా మొత్తం ఇద్దరు వ్యక్తుల మీదే నడుస్తుంది. ఓ రకంగా ఆ ఇద్దరే ఈ సినిమా అంతా కనపడే నటులు. కనిపించేది ఇద్దరు నటులే అయినా సినిమా చూస్తున్నంతసేపు ప్రేక్షకుడు కూర్చున్న కుర్చీ బిగపట్టిన చేతిని వదలడు. అంతటి ఉత్కంఠభరితంగా నడుస్తుంది ఈ సినిమా స్క్రీన్ ప్లే.
ఈ సినిమా కథాంశం ఏమిటంటే మే, డ్రూ అక్కాచెల్లెళ్ళు. ఓ సారి ఇద్దరూ చాలా దూర ప్రాంతంలోని ఓ సముద్రపు లోయలోకి ఈతకు వెళతారు. ఇద్దరూ సముద్రంలోకి చాలా లోతుగా వెళతారు. సముద్రపు అట్టడుగు భాగంలో సరైన గాలిగాని వాతావరణంకాని ఉండదు. అలాంటిది ఆ ఇద్దరిలో ఒకరయిన మే 80అడుగుల నీళ్ళలో ఓ బండరాయి క్రింద ప్రమాదవశాత్తు ఇరుక్కుపోతుంది. ఇప్పుడు తనను కాపాడాల్సిన బాధ్యత డ్రూ మీద పడుతుంది. డైవింగ్ లో మే వాడుతున్న ఆక్సిజన్ సిలిండెర్ 20 నిమిషాల కంటే ఎక్కువ రాదు. ఒకవేళ పైకి వచ్చి ఇంకెవరినైనా సాయం అడుగుదామనుకున్నా వీళ్ళు వెళ్ళింది ఓ నిర్మానుష్య ప్రాంతానికి. ఇక మిగతా కథ మొత్తం మేని డ్రూ ఎలా కాపాడుతుంది అన్న దాని మీదే ఉత్కంఠగా నడుస్తుంది.
సినిమాలో డ్రూ తన అక్క కోసం పడిన బాధ, చూపించిన తెగువ ప్రేక్షకులను మైమరిపిస్తుంది. సినిమా ఆఖర్లో చూసే ప్రతి ప్రేక్షకుడు అమ్మయ్య బ్రతికారు అని అనుకోకుండా వుండలేరు. ఓ రకంగా నేటి తల్లిదండ్రులందరూ ఈ సినిమాని తమ పిల్లల కోసం స్ఫూర్తిగా చూడాలి. ఎందుకంటే మన జీవితమనే రోడ్డు ప్రయాణంలో సమస్యలనే అడ్డంకులు వస్తే పరిష్కారంతో ముందుకు సాగిపోవాలి అంతేకాని వచ్చిన అడ్డంకి కోసం బాధ పడుతూవుంటే ఆ అడ్డంకి మన ప్రయాణానికి పూర్తిగా అడ్డమవుతుంది. వర్త్ టు వాచ్ ది డైవ్ ఫర్ ఎ ట్రూ స్పిరిట్. (ప్రముఖ ఓటీటీ అమెజాన్ ఫ్రైమ్ వీడియోలో ఈ మూవీ అందుబాటులో ఉంది)
-ఇంటూరు హరికృష్ణ
Comments
Please login to add a commentAdd a comment