ఈ సినిమా పరిశ్రమ పరిస్థితి ఏంటి? ఈ కరోనా ఎటువైపు తీసుకెళుతోంది? కరోనా ఫస్ట్ వేవ్ చాలా నష్టాన్ని మిగిల్చింది. తొలి తాకిడి తట్టుకుని, మెల్లిగా తేరుకుంటున్న సమయంలో... ఇప్పుడు సెకండ్ వేవ్ వచ్చిపడింది. మళ్లీ సినిమా షూటింగ్‌లకు ‘సెకండ్ బ్రేక్’ వేయక తప్పడం లేదు. సెకండ్ వేవ్ ప్రభావంతో తాజాగా అర్ధంతరంగా షూటింగ్ ఆగిన చిత్రాల గురించి తెలుసుకుందాం...
కరోనా ప్రభావం ఎక్కువగా ఉన్నప్పటికీ అన్ని జాగ్రత్తలూ తీసుకుని, చిరంజీవి ‘ఆచార్య’ సినిమా షూటింగ్ చేస్తూ వచ్చారు. కానీ, రోజురోజుకీ కరోనా కేసులు ఎక్కువ అవుతుండడం, ఇదే చిత్రం షూటింగ్‌లో పాల్గొన్న సోనూ సూద్ కరోనా బారినపడటంతో ఈ సినిమా షూటింగ్‌కి బ్రేక్ ఇచ్చేశారు. చిత్రీకరణ ఆపాలనే నిర్ణయాన్ని సోమవారం తీసుకుంది చిత్రబృందం. కొరటాల శివ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని మే 13న విడుదల చేయాలనుకున్నారు. కానీ షూటింగ్‌కి పడిన బ్రేక్ కారణంగా ఆ సమయానికి ‘ఆచార్య’ తెరపైకి రావడం కుదరకపోవచ్చు.
మరోవైపు ఇంకో పదంటే పది రోజులు మాత్రమే షూటింగ్ చేస్తే, ప్రభాస్ ‘రాధేశ్యామ్’ పూర్తయిపోతుంది. రాధాకృష్ణకుమార్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రం కోసం కృష్ణంరాజు–ప్రభాస్ కాంబినేషన్ సీన్స్ తీస్తే సినిమా పూర్తయిపోతుంది. పది రోజుల షూటింగ్ ఎలాగోలా పూర్తి చేయాలనుకున్నారు కూడా! కానీ, ఇప్పుడు మాత్రం షూటింగ్ ఆపేయాలని నిర్ణయించుకున్నారు. ‘ఆచార్య’, ‘రాధేశ్యామ్’ చిత్రాల షూటింగ్ ఆపాలనుకున్న విషయం సోమవారం బయటికొచ్చింది. ఇక, ఇప్పటికే కరోనా వల్ల ఆగిన సినిమాల విషయానికొస్తే...
మహేశ్‌బాబు హీరోగా నటిస్తున్న ‘సర్కారు వారి పాట’ సినిమా షూటింగ్ తాత్కాలికంగా నిలిచిపోయింది. షూటింగ్‌లో పాల్గొనే ముందు యూనిట్ సభ్యులకు కరోనా పరీక్షలు చేయగా నలుగురికి పాజటివ్ నిర్ధారణ అయిందట. వీరిలో హీరో వ్యక్తిగత సహాయకుల్లో ఒకరు కూడా ఉన్నారు. దీంతో హైదరాబాద్‌లో జరగాల్సిన ‘సర్కారువారి పాట’ సెకండ్ షెడ్యూల్ చిత్రీకరణకు బ్రేక్ పడింది. పరశురామ్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా వచ్చే ఏడాది సంక్రాంతికి రిలీజ్ కావాల్సి ఉంది.
ఇక రామ్‌చరణ్, జూనియర్ ఎన్టీఆర్ హీరోలుగా రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ‘రౌద్రం... రణం... రుధిరం’ (ఆర్‌ఆర్‌ఆర్)కి బ్రేక్ పడింది. ఈ చిత్రానికి సంబంధించిన ఓ షెడ్యూల్‌ను ముంబయ్‌లో గ్రీన్ మ్యాట్ బ్యాక్‌డ్రాప్‌లో ప్లాన్ చేశారట. అయితే మహరాష్ట్రలో చిత్రీకరణలను ఆపేయాల్సిందిగా ప్రభుత్వం నిబంధన విధించడంతో ‘ఆర్‌ఆర్‌ఆర్’ ప్లాన్ ముందుకు సాగలేదని సమాచారం.
‘ఎఫ్ 2’లో బోలెడంత ఫస్ అందించిన వెంకటేశ్, వరుణ్ తేజ్ మళ్లీ నవ్వించడానికి ‘ఎఫ్ 3’ చిత్రీకరణతో బిజీ అయ్యారు. సరదా సరదాగా సాగుతున్న ఈ సినిమా చిత్రీకరణకు చిత్రదర్శకుడు అనిల్ రావిపూడికి కరోనా సోకడం వల్ల బ్రేక్ పడింది. ఈ చిత్రం ఆగస్టు 27న రిలీజ్‌కు ప్లాన్ చేసుకున్న సంగతి తెలిసిందే.
ఇక ఇటీవల పవన్‌కల్యాణ్ కరోనా బారిన పడ్డారు. అంతే కాదు... ఆయన చిత్రబృందంలో ఇంకా పాజిటివ్ నిర్ధారణ అయినవాళ్లు చాలా ఉన్నారట. దర్శకత్వ శాఖలో పనిచేస్తున్న సీనియర్ కో–డైరెక్టర్ సత్యం కరోనా బారిన పడి కన్నుమూశారు. దీంతో పవన్‌కల్యాణ్–రానా నటిస్తున్న మలయాళ హిట్ ‘అయ్యప్పనుమ్ కోషియమ్’ రీమేక్ షూటింగ్ నిలిచిపోయింది.
మరోవైపు వేగంగా షూటింగ్ సాగుతున్న హీరో గోపీచంద్ ‘పక్కా కమర్షియల్’ సినిమాకు కూడా కరోనా బ్రేక్ వేసింది. హీరో వ్యక్తిగత సహాయకుల్లో ఒకరికి పాజిటివ్ రావడంతో షూటింగ్ నిలిపివేసినట్లు తెలిసింది. మారుతి దర్శకత్వంలో రూపొందుతోన్న ఈ సినిమాను ఈ ఏడాది అక్టోబరు 1న విడుదల చేయాలనుకుంటున్నారు.
ఈ సినిమాలతో పాటు మరికొన్ని చిన్నా పెద్ద సినిమాల చిత్రీకరణలు ఆగాయి. మొత్తానికి షూటింగ్స్ తేదీలన్నీ తారుమారవుతున్నాయి. విడుదల తేదీలు తారుమారయ్యే అవకాశం ఉంది. కరోనా చేస్తున్న కల్లోలం అంతా ఇంతా కాదు.
సినిమా షూటింగ్‌లకు ‘సెకండ్ బ్రేక్’
Published Tue, Apr 20 2021 4:51 AM | Last Updated on Tue, Apr 20 2021 9:00 AM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment