తెనాలి(గుంటూరు జిల్లా): హొయలొలికే కృష్ణానదీ పరవళ్లు.. అబ్బురపరిచే ‘సంద్రమా’శ్చర్యాలు.. ఒంపుసొంపులతో కట్టిపడేసే సాగర్ కాలువలు.. మడమ తిప్పనియ్యని మడ అడవులు.. అద్భుత శిల్పకళతో అలరారే చారిత్రక ఆలయాలు.. ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో..ఎన్నెన్నో సుమనోహర ప్రాంతాలు ఉమ్మడి గుంటూరు జిల్లా సొంతం. ప్రకృతి రమణీయతకు ఈ జిల్లా పెట్టింది పేరు. సినిమా షూటింగ్‌లకు అనువైన వేదిక.
అందుకే గతంలో ఎందరో సినీప్రముఖులు తమ చిత్రాలను ఈ ప్రాంతంలో చిత్రీకరించి తరించారు. రాష్ట్ర విభజన తర్వాత ప్రస్తుత ప్రభుత్వం ఇస్తున్న రాయితీలతోపాటు పర్యాటక సొగసులద్దుకున్న లొకేషన్లు సినీ పరిశ్రమకు సుహాసినీ సుమాలతో ఆహ్వానం పలుకుతున్నాయి. ఫలితంగా షూటింగ్‌లు మరింత విస్తృతమయ్యే అవకాశాలు పుష్కలంగా కనిపిస్తున్నాయి.
హైదరాబాద్‌లో కేంద్రీకృతమైన తెలుగు సినిమా రాష్ట్ర విభజన అనంతరం అక్కడే కార్యకలాపాలు సాగిస్తోన్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్‌మోహన్‌రెడ్డి నేతృత్వంలోని రాష్ట్ర ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్‌లోనూ సినిమాల చిత్రీకరణను ప్రోత్సహిస్తోంది. లోకేషన్లలో ఉచితంగా షూటింగ్‌లకు అనుమతి ఇవ్వడమే కాక రాయితీలను ప్రకటించిన విషయం తెలిసిందే. దీంతో మన రాష్ట్రంలోనూ సినిమా షూటింగులు విస్తృతమయ్యే అవకాశాలు పుష్కలంగా కనిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో సినీ ప్రముఖులకు గుంటూరు జిల్లాలోని సుందర ప్రాంతాలు మొదటి చాయిస్ అవుతాయనడంలో సందేహం లేదు.
ఎవర్‌గ్రీన్ లొకేషన్లు
పరవళ్లు తొక్కే కృష్ణ, చంద్రవంక, నాగులేరు నదుల ఒడ్డున, నాగార్జునసాగర్ కాలువల మధ్య అందంగా ఒదిగిపోయిన గుంటూరు జిల్లాలోని సహజ అందాలు, పుణ్యక్షేత్రాలు, కొండ శిఖరాలు సినిమా షూటింగులకు ఎవర్‌గ్రీన్ లోకేషన్లు. కృష్ణానది ఒడ్డున విజయవాడ నుంచి అమరావతి వరకు, ఇటుపక్క రేపల్లె తీరం వరకు పంటపొలాలు, పూలతోటలు, వాణిజ్యపంటలతో ఏడాదంతా పచ్చదనం పరుచుకుని ఉంటుంది. ఆయా మార్గాల్లోని పడవల రేవులు, సమీప లంకల్లో సహజమైన గ్రామీణ వాతావరణం అందరినీ ఆకట్టుకుంటుంది. సూర్యలంక బీచ్, అక్కడి రిసార్టులు, నిజాంపట్నం హార్బర్, పెనుమూడి రేవు, పరిసరాల్లోని బ్యాక్ వాటర్స్... షూటింగులకు అనువైన ప్రదేశాలు.
మూడేళ్లుగా మళ్లీ..
గత మూడేళ్లుగా మళ్లీ జిల్లాలో షూటింగులు కొనసాగుతున్నాయి. జిల్లాకు చెందిన ప్రభుత్వ ఉపాధ్యాయులు ‘రా...కిట్టూ’ సినిమాని చిత్రీకరించారు. దూరదర్శన్ సప్తగిరి చానల్ ‘జై బోలో’ సీరియల్ కూడా ఇక్కడ తీసిందే. తెనాలికే చెందిన సినీ దర్శకుడు దిలీప్‌రాజా ఎంతోకాలంగా ఇక్కడి పరిసరాల్లోనే టీవీ చిత్రాలు తీస్తున్నారు. గతేడాది ఆలీ హీరోగా ‘పండుగాడి ఫొటో స్టూడియో’ సినిమానూ జిల్లాలోనే చిత్రీకరించారు.
దూరదర్శన్‌లో ప్రసారమైన 100 ఎపిసోడ్ల డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ టెలీఫిలింను దర్శకుడు దిలీప్‌రాజా ఇక్కడే తీర్చిదిద్దారు. మంచి విజయం సాధించిన ‘మిడిల్‌క్లాస్ మెలోడీస్’ సినిమా కొలకలూరు, గుంటూరులోనే చిత్రీకరించారు. శేఖర్‌వర్మ, వైభవీరావ్ హీరోహీరోయిన్లుగా నటించిన, ప్రస్తుతం పోస్ట్‌ప్రొడక్షన్ చేసుకుంటున్న ‘కల్యాణమస్తు’లోని రెండు పాటలకు ఇక్కడి లోకేషన్లను వినియోగించారు. ‘నేను అను’, నాగశార్య ‘ఛలో’, రమేష్ చౌహాన్–మౌనికల రామ్‌నాయక్ వంటి సినిమాల్లో కొన్ని సన్నివేశాలను జిల్లాలోనే తీశారు.
అందాల అమరావతి.. అద్భుత కొండవీడు..
పంచారామాల్లో ఒకటిగా ప్రసిద్ధికెక్కి జిల్లాకు మణిహారంగా ఉన్న అమరావతి పుణ్యక్షేత్రం పరిసరాలు ఇప్పటికే పలు సినిమాల్లో ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేశాయి. ఘాట్‌రోడ్డు నిర్మాణంతో సహా అభివృద్ధి చేసిన కొండవీడు దుర్గంలో ఎన్నో విశేషాలు ఉన్నాయి. ఆనాటి యుద్ధతంత్ర నైపుణ్యానికి నిదర్శనంగా 30 మైళ్ల చుట్టుకొలత గల ఈ దుర్గం పర్యాటకంగా మరింత సొబగులద్దుకుంది. ఈ నేపథ్యంలో ఈ లోకేషన్లు అందరినీ సంభ్రమాశ్చర్యాలల్లో ముంచెత్తుతున్నాయి.
ఇక ఉండవల్లి గుహలు, అక్కడి అనంత పద్మనాభ ఆలయం, అజంతా అందాలను తలపించే శిల్పకళ చూపరులను కళ్లు తిప్పుకోనివ్వవంటే అతిశయోక్తి కాదు. మంగళగిరి కొండపై పానకాలస్వామి ఆలయం ప్రకృతి రమణీయతకు ఆలవాలం. ఇక ఎత్తిపోతల సోయగాలు, కృష్ణానదిలో బోటింగ్ గురించి ఎంత వర్ణించినా తక్కువే. ఇవన్నీ సినీ షూటింగులకు అనువైనవే.
ఏఎన్నార్ కాలం నుంచీ చిత్రీకరణలు
సినిమా షూటింగులు జిల్లాకు కొత్త కాదు. ఎప్పుడో అక్కినేని నాగేశ్వరరావు నటించిన సిపాయి చిన్నయ్య సినిమాలో ‘నా జన్మభూమి’ అనే పాటను తెనాలి సమీపంలోని దుగ్గిరాలలో చిత్రీకరించారు. తెనాలి పక్కనున్న బుర్రిపాలెం సూపర్‌స్టార్ కృష్ణ జన్మస్థలమని తెలిసిందే. ఈ ప్రాంతంలోని సుందర దృశ్యాలను ఆయన తన సినిమాల్లో వినియోగించుకున్నారు.
ప్రజారాజ్యం, బుర్రిపాలెం బుల్లోడు, సావాసగాళ్లు, పచ్చని సంసారం సినిమాలను ఇక్కడి పరిసరాల్లోనే చిత్రీకరించారాయన. శోభన్‌బాబు, విజయశాంతి నటించిన దేవాలయం సినిమా తోపాటు సప్తపది చిత్రంలోని పాటలను అమరావతిలోని అమరేశ్వర ఆలయంలో చిత్రీకరించారు. గోపీకృష్ణా మూవీస్ కృష్ణవేణి సినిమాలో కీలక సన్నివేశాలనూ కృష్ణానదీ పాయలో తీశారు. ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో సినిమాల్లో జిల్లాలోని లోకేషన్లు, పుణ్యక్షేత్రాలు కనువిందు చేశాయి.
Comments
Please login to add a commentAdd a comment