కళారంగంపై మక్కువ.. హాస్యంలో వినూత్న పంథా.. వైవిధ్య గెటప్‌లతో నటన.. అతడికి సినిమా అవకాశాలు తెచ్చి పెట్టింది.. చిన్నతనం నుంచి సరదాగా చేసిన కామెడీ నటుడిగా నిలబెట్టింది.. వలస కుటుంబంలో పుట్టి తల్లిదండ్రులతో కలిసి కూలి పనులకు వెళ్లిన యువకుడు వెండితెరపై క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా రాణిస్తున్నాడు. అతడే శ్రీకాకుళం జిల్లా ఆకివీడు మండలం కొల్లేరు తీర గ్రామమైన కాళింగగూడెంకు చెందిన బొడ్డుపల్లి శ్రీనివాస్ ఉరఫ్ గెటప్ శ్రీను. బుల్లితెర నుంచి అంచెలంచెలుగా ఎదుగుతూ సినీ రంగంలో అవకాశాలు దక్కించుకుంటున్నాడు.
శ్రీకాకుళం నుంచి వలస కూలీలుగా కాళింగగూడెం వచ్చిన బొడ్డుపల్లి రామస్వామి, దాలమ్మ దంపతుల కుమారుడు గెటప్ శ్రీను. గ్రామంలోని పంట కాలువ పక్కన చిన్న పూరింట్లో అతడి బాల్యం గడిచింది. సిద్ధాపురం హైస్కూల్‌లో పదో తరగతి వరకు, దుంపగడప ప్రభుత్వ కళాశాలలో ఇంటర్ చదివాడు. తల్లిదండ్రులతో కలిసి కూలి పనులకు వెళ్లేవాడు. చిన్నతనం నుంచి హాస్యధోరణితో ఉండే శ్రీను తోటి కూలీల మాటలను, నడకను అనుకరిస్తూ హాస్యం పండించేవాడు. తన హావభావాలతో నవ్విస్తూ అందరినీ ఆకట్టుకునేవాడు.
పాఠశాలలో, కళాశాలలో, స్నేహితుల వద్ద అతడు సరదాగా చేసిన కామెడీ హాస్యనటుడిని చేసింది. చిన్నతనం నుంచి డ్యాన్స్‌లోనూ ప్రతిభ కనబర్చేవాడు. చిరంజీవిపై అభిమానంతో సినిమాల్లో రాణించాలని కలలుగన్నాడు. యాంకర్ నుంచి హీరో వరకూ.. ఇంటర్‌తో చదువుకు ఫుల్‌స్టాప్ పెట్టిన గెటప్ శ్రీను యాంకర్‌గా బుల్లితెరలోకి ప్రవేశించి జబర్దస్త్ అనంతరం పలు కార్యక్రమాలు, టీవీ షోలు, స్టేజ్ షోల్లో రాణించాడు. తరచూ హాస్యం, విభిన్న గెటప్‌లతో ఆకట్టుకుంటూ గెటప్ శ్రీనుగా, జూనియర్ కమల్‌హాసన్‌గా పేరు తెచ్చుకున్నాడు.
సినీ హాస్యనటుడు వేణు సహకారంతో తెలుగబ్బాయి చిత్రం ద్వారా వెండితెరకు పరిచయమయ్యాడు. ఇస్మార్ట్ శంకర్, రంగస్థలం, లైగర్, గాడ్‌ఫాదర్, జాంబిరెడ్డి, పొలిమేర తదితర 70 చిత్రాల్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా నటించాడు. ప్రస్తుతం అతడు నటిస్తున్న భోళాశంకర్ తదితర చిత్రాలు నిర్మాణ దశలో ఉన్నాయి. అలాగే రాజు యాదవ్ చిత్రంలో హీరోగా నటనతో మెప్పించాడు.
బోరు కొట్టించకుండా..
గెటప్ శ్రీను కళారంగంలో రాణిస్తూ ఆర్థికంగా స్థిరపడి హైదరాబాద్‌లో సెటిల్ అయ్యాడు. అందరూ నటిస్తారని, అందుకు భిన్నంగా, మనసును హత్తుకునేలా నటించాలన్నదే తన లక్ష్యమని గెటప్ శ్రీను చెబుతున్నాడు. బుల్లితెరపై బోరు కొట్టించకుండానే వెండి తెరపై ప్రేక్షకుల్ని రంజింపజేస్తున్నానని, సినిమాల్లో మరింత ఉన్నత స్థాయికి ఎదగడమే తన లక్ష్యమని అంటున్నాడు. తరచూ గెటప్ శ్రీను స్వగ్రామం కాళింగగూడెం వస్తుంటాడు. స్థానికంగా జరిగే సాంస్కృతిక కార్యక్రమాల్లో పాల్గొంటున్నాడు. జిల్లాలో పలు కార్యక్రమాల్లో సత్కారాలు కూడా అందుకున్నాడు.
Comments
Please login to add a commentAdd a comment