‘‘మీరు(అభిమానులు) నన్ను ‘గాడ్‌ఫాదర్’ అని అంటున్నారు. కానీ, ఏ గాడ్‌ఫాదర్ లేకుండా వచ్చిన నాకు ఈ సినిమా ఇండస్ట్రీలో నిలదొక్కుకోవడానికి అవకాశం కల్పించి, ఈ స్థాయి ఇచ్చిన ప్రతి అభిమాని నాకు ‘గాడ్‌ఫాదర్’. చిరంజీవి వెనకాల ఏ గాడ్‌ఫాదర్ లేరని అంటుంటారు.. కానీ నేను ఇప్పుడు అంటున్నాను.. నా వెనకాల లక్షలమంది గాడ్‌ఫాదర్స్ ఉన్నారు.. నా అభిమానులే నా ‘గాడ్‌ఫాదర్స్’’ అని చిరంజీవి అన్నారు.
మోహన్ రాజా దర్శకత్వంలో చిరంజీవి హీరోగా రూపొందిన చిత్రం ‘గాడ్ ఫాదర్’. నయనతార, సల్మాన్‌ఖాన్, సత్యదేవ్, పూరి జగన్నాథ్ ప్రధాన పాత్రల్లో నటించారు. కొణిదెల సురేఖ సమర్పణలో ఆర్‌బీ చౌదరి, ఎన్వీ ప్రసాద్ నిర్మించిన ఈ చిత్రం అక్టోబరు 5న రిలీజ్ కానుంది. ఈ సందర్భంగా బుధవారం అనంతపురంలో జరిగిన ఈ సినిమా ప్రీ రిలీజ్ వేడుకలో నిర్మాతలు ఆర్‌బీ చౌదరి, ఎన్వీ ప్రసాద్ ‘గాడ్‌ఫాదర్’ ట్రైలర్‌ను రిలీజ్ చేశారు. అనంతరం చిరంజీవి మాట్లాడుతూ– ‘‘నేను ఎప్పుడు రాయలసీమకు వచ్చినా ఈ నేల తడుస్తుంది. ఈ రోజు కూడా ఇలా వర్షం కురవడం శుభ పరిణామంగా అనిపిస్తోంది.
ఇక ‘గాడ్‌ఫాదర్’ విషయానికొస్తే.. మలయాళ హిట్ మూవీ ‘లూసిఫర్’ చిత్రాన్ని నేను తెలుగులో ‘గాడ్‌ఫాదర్’గా చేయడానికి ప్రధాన కారణం రామ్‌చరణ్. దర్శకుడు మోహన్ రాజా పేరును కూడా చరణే సూచించాడు. మాపై నమ్మకం, ప్రేమ, గౌరవంతో ‘గాడ్‌ఫాదర్’ కథ వినకుండా నటించిన సల్మాన్‌ఖాన్‌గారికి థ్యాంక్స్. నయనతార ఈ సినిమా ఒప్పుకోవడం మా విజయానికి తొలిమెట్టు. ఆర్‌బీ చౌదరి, ఎన్వీ ప్రసాద్ ఈ సినిమాలో భాగస్వాములవడంసంతోషం. తెలుగువారికి జాతీయ అవార్డులు రావడం అరుదు. అలాంటిది చిన్న వయసులోనే జాతీయ అవార్డు సాధించిన తమన్‌కు అభినందనలు.
మా సినిమాకి రీ రికార్డింగ్ అద్భుతంగా ఇచ్చాడు. పొలిటికల్ అండ్ ఫ్యామిలీ డ్రామా సినిమా ఇది.. ప్రేక్షకులను అలరిస్తుందని నేను గ్యారంటీ ఇస్తున్నాను. నేను సినిమా చూశాను కాబట్టే ఇంత ఆత్మ విశ్వాసంతో మాట్లాడుతున్నాను. కానీ, ప్రేక్షకుల తీర్పును ఎప్పుడూ గౌరవిస్తాం. మా సినిమాతో పాటు విడుదలవుతున్న నా మిత్రుడు నాగార్జున ‘ది ఘోస్ట్’, గణేష్ ‘స్వాతిముత్యం’ సినిమాలు కూడా విజయం సాధించాలి. పెద్ద సినిమాలు, చిన్న సినిమాలు.. రెండూ ప్రేక్షకులచేత ఆదరించబడినప్పుడే పరిశ్రమ పచ్చగా ఉంటుంది’’ అన్నారు. ఈ కార్యక్రమంలో తమన్, ఫైట్‌మాస్టర్స్ రామ్–లక్ష్మణ్ పాల్గొన్నారు.
ఈ మధ్యకాలంలో కాస్త స్తబ్ధత ఏర్పడింది. జయాపజయాలు మన చేతుల్లో ఉండవని తెలుసు. కానీ ప్రేక్షకులను అలరించలేకపోయామే, వారిని అసంతృప్తికి గురిచేశామే అనే బాధ ఉంది. దానికి సమాధానం, నాకు ఊరట ఈ ‘గాడ్‌ఫాదర్’. ఈ సినిమా కచ్చితంగా నిశ్శబ్ధ విస్ఫోటనం అవుతుంది.. ఇందుకు ప్రేక్షకుల ఆశీస్సులు ఉండాలి.
బుధవారం ఉదయం ఓ విషాదం చోటు చేసుకుంది. సూపర్‌స్టార్ కృష్ణ గారి సతీమణి, సోదరుడు మహేశ్‌బాబుగారి మాతృమూర్తి ఇందిరాదేవిగారు మృతిచెందారు. ఆ కుటుంబం విషాదంలో ఉంది. వారి కుటుంబానికి నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను. ఆమె ఆత్మకు శాంతి చేకూరాలి.
Comments
Please login to add a commentAdd a comment