ఆమెను చూడగానే మతి పోయింది: నటుడి లవ్‌ స్టోరీ | Govinda, Neelam Breakup Love Story | Sakshi
Sakshi News home page

ఒకరిని ప్రేమించి మరొకరిని పెళ్లి చేసుకున్న నటుడు

Published Sun, Mar 7 2021 9:47 AM | Last Updated on Sun, Mar 7 2021 12:22 PM

Govinda, Neelam Breakup Love Story - Sakshi

గోవిందా, నీలం

డాన్స్‌.. మాస్‌ అప్పీల్‌తో దేశమంతా అభిమానులను సంపాదించుకున్న నటుడు గోవిందా..
పసితనం వీడని మోము..నాజూకు మేనితో తెరమీద మెరిసిపోయిన అందాల నటి.. నీలం.
మేకప్‌ తీసేశాక నటించడం మరిచిపోయే గోవిందా అంటే గౌరవం పెంచుకుంది ఆమె. స్థాయీభేదాల్లేకుండా మనిషిని మనిషిగానే చూసే నీలం వ్యక్తిత్వాన్ని ఇష్టపడ్డాడు అతను. అది వన్‌సైడ్‌ లవ్‌గా గోవిందా మనసులోనే  ఉండిపోయి.. విఫల్యగాథగా మిగిలిపోయింది. అది ఎలా మొదలైందంటే...

గోవిందా, నీలం జంటగా నటించిన తొలి సినిమా ‘ఇల్‌జామ్‌’. వీళ్లద్దరూ మొదటిసారి కలిసింది ప్రాణ్‌లాల్‌ మెహతా ఆఫీస్‌ (ముంబై)లో.  గోవిందాను చూడగానే నవ్వుతూ ‘హలో’ అంది నీలం. బదులు చెప్పడానికి గోవిందా భయపడ్డాడు. న్యూనతగా ఫీలయ్యాడు. ఎందుకూ? ‘నా ఇంగ్లిష్‌ విని ఆమె నవ్వుకుంటుందేమోనని’ చెప్పాడు గోవిందా ఓ ఇంటర్వ్యూలో.  ‘ఆమె ఫారిన్‌ రిటర్డ్న్‌ (హాంకాంగ్‌లో పుట్టిపెరిగింది). నేను శుద్ధ దేశీ.. పక్కా మాస్‌. ఆమెను చూడగానే నా మతి పోయింది. ఆ రోజు నాకింకా గుర్తు.. వైట్‌ డ్రెస్‌.. జడకాని, పోనీ కాని వేయకుండా అలా వదిలేసిన లాంగ్‌ హెయిర్‌తో నాకు దేవకన్యలా కనిపించింది. అంతకుముందే ఆమె యాక్ట్‌ చేసిన ‘జవానీ’ చూశాను. ఒక్కసారి కాదు ఎన్నిసార్లో.. కేవలం నీలం కోసమే చూశా. మర్యాదకు పోతపోసినట్టుంటుంది’ అంటూ నీలంను తలచుకున్నాడు గోవిందా అదే ఇంటర్వ్యూలో.

ఇల్‌జామ్‌ విడుదలైంది. భిన్న నేపథ్యాలు, పెంపకాల గ్యాప్‌ను అధిగమించి వాళ్ల మధ్య స్నేహం కుదురుకుంది. తనకున్న హాస్య చతురతనూ బయటపెట్టేంత చనువు సాధించాడు గోవిందా.. నీలం దగ్గర. షూటింగ్‌లో ఏ కొంచెం టైమ్‌ దొరికినా తన జోక్స్‌తో తెగ నవ్వించేవాడు ఆమెను. ఆ నవ్వును చూస్తూ తన ఒత్తిడిని మరిచిపోయేవాడు. ప్రశాంతతలో మైమరిచిపోయేవాడు. ఎప్పుడూ అలా నీలం సాంగత్యంలోనే ఉంటే బాగుండు అనే భావన ప్రారంభమైంది అతనిలో. అది ప్రేమ అనీ అర్థమైంది. ఆ భావం మెదలగానే గోవిందా ఒక్కసారిగా అలెర్ట్‌ అయ్యేవాడు. 


సునీత

కారణం.. 
అప్పటికే అతని జీవితంలో సునీత ఉంది. భార్యగా కాదు.. చిన్ననాటి స్నేహితురాలిగా.. కాబోయే జీవిత భాగస్వామిగా. నిశ్చితార్థం అయింది. గోవిందా, నీలం కాంబినేషన్‌లో మరిన్ని సినిమాలు సెట్స్‌ మీదకు వచ్చాయి. కొన్ని థియేటర్లకూ వెళ్లి మంచి కలెక్షన్స్‌ తెచ్చిపెడ్తున్నాయి. ప్రేక్షకుల్లోనూ బెస్ట్‌ పెయిర్‌ అనే పేరు వచ్చింది ఈ జంటకు. షూటింగ్స్‌ లేకపోయినా నీలంను కలవసాగాడు గోవిందా. ఆమె గురించి తెలుసుకున్న కొద్దీ ఆమె మీద ప్రేమ, గౌరవం పెరగసాగాయి అతనికి. ‘ఆమె స్ట్రెంత్‌ ఆఫ్‌ క్యారెక్టర్‌ ఎలాంటిదంటే.. నన్నూ చాలా మార్చేసింది. ఆమెను చూసిన ఏ మగవాడైనా ఇలాంటి స్త్రీ తన జీవితభాగస్వామి అయితే బాగుండని అనుకునేంత గ్రేట్‌ ఉమన్‌ నీలం’ అంటాడు గోవిందా. ‘నేనూ అనుకున్నాను జీవితమంతా ఆమె చేయిపట్టుకొని నడవాలని’ అని నిట్టూరుస్తాడు. 

అమ్మ వద్దంది..
నీలం అతని మీద ఎంత ప్రభావం చూపిందంటే గోవిందా.. సునీతను నీలంలా మారమని పోరు పెట్టేంతగా. వినీవినీ విసిగివేసారిపోయిన సునీత ఒకసారి ‘నేను నేనులా ఉండడాన్ని చూసే నన్ను ఇష్టపడ్డావన్న నిజాన్ని మరిచిపోయావా?’అంటూ హెచ్చరించిందట. అయినా తన మనసులోంచి నీలంను తప్పించలేకపోయాడు గోవిందా. ఇంట్లో వాళ్లతో ఎప్పుడూ నీలం గురించిన కబుర్లే... ‘నీలం అలా.. నీలం ఇలా.. నీలం ఇలా అంది.. అలా చూసింది.. నీలం .. నీలం’ అంటూ. ఒకసారి ఆమెను ఇంటికి పిలిచి ఇంటిల్లిపాదికీ పరిచయం చేశాడు. గోవిందా వాళ్ల నాన్న ఆమెలోని వినయానికి ముచ్చటపడ్డాడు. ‘నిశ్చితార్థం మరిచిపో.. ఈ అమ్మాయినే పెళ్లి చేసుకో’ అని సలహా కూడా ఇచ్చాడట. కానీ.. గోవిందా వాళ్లమ్మకు తండ్రీకొడుకుల తీరు నచ్చలేదు.

కొడుకు నీలం మీద పెంచుకుంటున్న ప్రేమను మొగ్గలోనే తుంచేయాలనుకుంది. సమయం చూసి గోవిందాకు చెప్పింది.. ‘పెళ్లి చేసుకుంటానని సునీతకు మాటిచ్చావ్‌. నీలంతో ఈ వ్యవహారం ఏంటీ? మాట తప్పకు. సునీత మనసు కష్టపెట్టకు. ఆ అమ్మాయి కంటతడి పెడితే నేను ఊరుకోను. ఈ జన్మకు సునీతే నీ భార్య. నీలంతో నీ హద్దుల్లో నువ్వుండు’ అంటూ. అమ్మ మాట నెమ్మదిగానే ఉన్నా ఆ స్వరంలోని తీవ్రతను గ్రహించాడు గోవిందా. ‘అప్పుడు అనుకున్నాను సునీతకు మాటిచ్చి తప్పు చేశాను అని. నిజానికి ఆమెతో రిలేషన్‌ అంత సీరియస్‌గా ఉంటుందని.. పెళ్లిదాకా వస్తుందని ఊహించలేదు. జస్ట్‌ క్యాజువల్‌ ఫ్రెండ్‌షిప్‌గా మొదలైంది అంతే’ అంటూ కన్‌ఫెస్‌ చేశాడు గోవిందా. 

పెళ్లి.. 
నీలం మాత్రం తన కెరీర్‌కే ప్రాధాన్యం ఇచ్చింది. నంబర్‌ వన్‌ హీరోయిన్‌ కావాలన్నదే ఆమె లక్ష్యం. ఆ దిశగానే ఆమె ప్రయాణం ఉండింది. పెళ్లి గురించి గోవిందా ఎప్పుడు టాపిక్‌ తెచ్చినా పెద్దగా నవ్వేసేదట. అనుకున్నట్టుగానే నీలం కెరీర్‌ మలుపు తిరిగింది. సన్నీ డియోల్, మిథున్‌ చక్రవర్తి, చుంకీ పాండే వంటి హీరోల పక్కనా అవకాశాలు వచ్చాయి. గోవిందాలో అసూయ పుట్టింది. అది అణిగివున్న ఆత్మన్యూనతను ఉనికిలోకి తెచ్చింది. ఈలోపు గోవిందా వాళ్లమ్మ ఒత్తిడీ పెంచింది సునీతతో పెళ్లి గురించి. ఒప్పుకోక తప్పలేదు గోవిందాకు. చాలా నిరాడంబరంగా గుడిలో సునీతను పెళ్లి చేసేసుకున్నాడు కనీసం నీలంకూ సమాచారమివ్వకుండా. (తర్వాత ఏమైందో తెలుసుకోవాలంటే మార్చి 14న వచ్చే ఫండేలో తెలుసుకోండి)

చదవండి: 

సైబర్‌ పోలీసులకు ఫిర్యాదు చేసిన టాలీవుడ్‌ దర్శకుడు

ఓర చూపుతో చంపేస్తున్న రష్మీ.. మైండ్‌ బ్లాక్‌ చేస్తున్న కాజల్‌

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement