ఓ వైపు యాక్షన్ హీరోగా దూసుకుపోతూనే కుటుంబ కథాచిత్రాల్లో నటించారు హీరో సుమన్. 1959, ఆగస్టు 28న చెన్నైలో జన్మించిన సుమన్ కోలీవుడ్ లో నీచల్ కులం సినిమాతో వెండితెరపై ఎంట్రీ ఇచ్చారు. ‘తరంగిణి’ సినిమాతో టాలీవుడ్‌కు పరిచయమై అతి తక్కువ కాలంలోనే తెలుగు, కన్నడ భాషల్లో స్టార్ హీరో ఇమేజ్‌ను సొంతం చేసుకున్నారు.మార్షల్ ఆర్ట్స్ హీరోగా సుమన్ చేసిన యాక్షన్ సినిమాలకు మంచి గుర్తింపు లభించింది.
అంతేకాకుండా టాలీవుడ్ అందగాడిగా సుమన్‌కు లేడీ ఫ్యాన్ ఫాలోయింగ్ కూడా బాగానే ఉండేది. ఇక సుమన్ కెరీర్‌లో ముఖ్యంగా చెప్పుకోవాల్సింది భక్తి సినిమాల గురించి. ఆయన కెరీర్‌లో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్‌గా నిలిచిన సినిమాల్లో అన్నమయ్య ఒకటి. సినిమాలో వెంకటేశ్వరస్వామిగా కనిపించి ప్రేక్షకుల నీరాజనాలు అందుకున్నారు సుమన్. అంతేకాదు అప్పట్లో ఈ సినిమాను అప్పటి రాష్ట్రపతితో కలిసి రాష్ట్రపతి భవన్‌లో వీక్షించడం అనేది సుమన్ తన జీవితంలో మరిచిపోలేని రోజు అని ఒకానొక ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారాయన.
శ్రీరామదాసు, ‘దేవుళ్లు’ వంటి సినిమాల్లో దేవుడి పాత్రలో ఒదిగిపోయారాయన. రజనీకాంత్ హీరోగా తెరకెక్కిన శివాజీ సినిమాలో విలన్‌గా నటించి తన విశ్వరూపాన్ని చూపారు. తెలుగులో సుమారు వందకి పైగా చిత్రాల్లో నటించి ఎంతోమంది అభిమానులను సంపాదించుకున్నారు. సుమన్ కెరీర్ టాప్‌లో ఉండగానే శిరీష అనే అమ్మాయిని పెళ్లి చేసుకున్నారు.
ఈమె టాలీవుడ్ లెజెండరీ రైటర్ డి.వి.నరసరాజు మనవరాలు. అనుకోకుండా ఓ కేసులో ఇరుక్కున్న సుమన్ అనంతరం దాన్నుంచి బయటికొచ్చాక డి.వి.నరసరాజు సుమన్‌ను పిలిచి మరీ తన మనువరాలికి ఇచ్చి పెళ్లి జరిపించడం అప్పట్లో ఇండస్ట్రీలో హాట్‌టాపిక్‌గా మారింది.
సుమన్ నిజంగా తప్పు చేసి ఉంటే అంత పెద్ద లెజెండరీ రైటర్ పిలిచి మరీ సంబంధం కలుపుకోడు కదా అంటూ ఇండస్ట్రీలో చర్చ నడిచింది. ఇక కేసు నుంచి బయటపడిన తర్వాత పడిలేచిన కెరటంలా సుమన్ మళ్లీ సినిమాల్లో బిజీ అయ్యారు. పెద్దింటి అల్లుడు, బావ బావమరిది, అబ్బాయిగారి పెళ్లి వంటి బ్లాక్ బస్టర్ సినిమాల్లో నటించి సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించి ముక్కున వేలేసుకునేలా తన నటనతో సమాధానమిచ్చారు.
Comments
Please login to add a commentAdd a comment