
పా. రంజిత్
దళితుల ఉన్నతికి దళిత సాహితీవేత్తలే దిశా నిర్దేశం చేశారు
సాక్షి, చెన్నై: దళిత రచనలతోనే తన సినీ పయనం మొదలైందని దర్శక, నిర్మాత పా.రంజిత్ పేర్కొన్నారు. తన చిత్రాల ద్వారా సమాజంలోని అసమానతలు, అణగారిన జీవితాలను ఆవిష్కృతం చేసే దర్శకుడీయన. అలా తనకంటూ ప్రత్యేక బాటను ఏర్పరచుకుని సక్సెస్‌ఫుల్‌గా పయనిస్తున్న పా.రంజిత్ తన నీలం ఫౌండేషన్ ద్వారా ఏప్రిల్ నెల అంతా దళిత చరిత్ర మాసం పేరుతో చెన్నైలో సాంస్కృతిక కళలు, ఫొటో ఎగ్జిబిషన్, చిత్ర ప్రదర్శనలు నిర్వహించారు.
అందులో భాగంగా మదురైలో శుక్ర, శనివారాల్లో దళితుల రచయితల కోసం దళిత సాహితీ సమావేశాలను నిర్వహించారు. ఈ సందర్భంగా జ్ఞాపికలు అందజేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ దళిత రచనలతోనే తన సినీ పయనం మొదలైందని తెలిపారు. దళితుల ఉన్నతికి దళిత సాహితీవేత్తలే దిశా నిర్దేశం చేశారని పేర్కొన్నారు. 1990 ప్రాంతంలో దళిత సాహిత్యం మొదలైనప్పుడు పలు ప్రశ్నలు ఎదురయ్యాయని అన్నారు. ఇప్పుడు దళిత సాహిత్యం ఎంతో అభివృద్ధి చెందిందని పా.రంజిత్ పేర్కొన్నారు.