ఛలో ఫారిన్‌ | Indian movies shooting begins at foriegn countrys | Sakshi
Sakshi News home page

ఛలో ఫారిన్‌

Published Thu, Aug 27 2020 2:11 AM | Last Updated on Thu, Aug 27 2020 2:23 AM

Indian movies shooting begins at foriegn countrys - Sakshi

‘సర్కారువారి పాట’లో.. ; ప్రభాస్, పూజా హెగ్డే

సినిమా చిత్రీకరణలు మెల్లిగా ప్రారంభం అవుతున్నాయి. పకడ్బందీగా సినిమాలను పూర్తి చేయాలని ప్లాన్‌ చేస్తున్నాయి చిత్రబృందాలు. విదేశీ షూటింగ్స్‌ వీలవుతుందా? అనే సందేహం చాలామందిలో ఉంది. కానీ పక్కా ప్లానింగ్‌తో విదేశాల్లోనూ సురక్షితంగా చేయొచ్చు అని బాలీవుడ్‌లో ఓ చిత్రబృందం లండన్‌ వెళ్లి చూపించింది. మరో ఇద్దరు స్టార్‌ హీరోలు కూడా విదేశాలు ప్రయాణం అవుతున్నారు. ‘ఛలో ఫారిన్‌’ అంటున్న చిత్రబృందాల వివరాలు చూద్దాం.

మహేశ్‌బాబు హీరోగా తెరకెక్కనున్న తాజా చిత్రం ‘సర్కారువారి పాట’. పరశురామ్‌ దర్శకత్వం వహించనున్నారు. ఈ సినిమాకి సంబంధించిన ఓ షెడ్యూల్‌ను అమెరికాలో ప్లాన్‌ చేశారట. ఫారిన్‌ షెడ్యూల్‌తోనే ఈ సినిమా చిత్రీకరణ ప్రారంభిస్తారని టాక్‌. తమన్‌ సంగీతం అందిస్తున్న ఈ సినిమాను మైత్రీ మూవీ మేకర్స్, 14 రీల్స్‌ ప్లస్, జీయంబీ ఎంటర్‌టైన్‌మెంట్స్‌ బ్యానర్లు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. త్వరలోనే ఈ టీమ్‌ అమెరికా ప్రయాణం ఉంటుందని సమాచారం.

ప్రభాస్, పూజా హెగ్డే జంటగా తెరకెక్కుతున్న చిత్రం ‘రాధే శ్యామ్‌’. రాధా కృష్ణ దర్శకుడు. 1970ల బ్యాక్‌డ్రాప్‌లో తెరకెక్కుతున్న లవ్‌స్టోరీ ఇది. లాక్‌డౌన్‌ ముందు వారం కూడా ఈ సినిమాలో ఓ కీలక షెడ్యూల్‌ను జార్జియాలో పూర్తి చేశారు చిత్రబృందం. కొన్ని కీలక ఎపిసోడ్ల కోసం మరోసారి విదేశాలు వెళ్తారని సమాచారం. యూవీ క్రియేషన్స్, గోపీ కృష్ణ మూవీస్‌ సంస్థలు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి.

అక్షయ్‌ కుమార్‌: ఫారిన్‌లో షూటింగ్‌ ప్రారంభించిన తొలి చిత్రం అక్షయ్‌ కుమార్‌ నటిస్తున్న ‘బెల్‌ బాటమ్‌’. సుమారు 120 మందితో లండన్‌ వెళ్లింది ‘బెల్‌ బాటమ్‌’ టీమ్‌. 14 రోజులు క్వారంటైన్‌లో ఉండి ఇటీవలే చిత్రీకరణ ప్రారంభించారు. సినిమా చిత్రీకరణ దాదాపు లండన్‌లోనే పూర్తి చేయనున్నారని సమాచారం. 1980లలో జరిగే కథాంశంగా ఈ చిత్రకథ ఉండబోతోంది. ఇందులో డిటెక్టివ్‌గా కనిపించనున్నారు అక్షయ్‌. హ్యూమా ఖురేషి, వాణీ కపూర్, లారా దత్తా ముఖ్య పాత్రలు చేస్తున్న ఈ చిత్రానికి రంజిత్‌ యం. తివారీ దర్శకుడు.

ఆమిర్‌ ఖాన్‌: హాలీవుడ్‌ క్లాసిక్‌ చిత్రం ‘ఫారెస్ట్‌ గంప్‌’ను ‘లాల్‌ సింగ్‌ చద్దా’గా హిందీలో రీమేక్‌ చేస్తున్నారు ఆమిర్‌ ఖాన్‌. ఈ ఏడాది డిసెంబర్‌లో ఈ సినిమాను విడుదల చేయాలనుకున్నారు. అయితే కోవిడ్‌ వల్ల వచ్చే ఏడాదికి విడుదలను పోస్ట్‌పోన్‌ చేశారు. ఈ సినిమా చిత్రీకరణ సగం వరకూ అయిందట. మిగతా భాగాన్ని టర్కీలో పూర్తి చేస్తారట. దీనికి సంబంధించిన లొకేషన్స్‌ చూడటానికి ఇటీవలే టర్కీ కూడా వెళ్లి వచ్చారు ఆమిర్‌. త్వరలోనే ఈ చిత్రబృందం టర్కీ ప్రయాణం కానుంది. ఇందులో కరీనా కపూర్‌ కథానాయిక. అద్వైత్‌ చందన్‌ దర్శకుడు.

షారుక్‌ ఖాన్‌: ‘జీరో’ (2018) తర్వాత రెండేళ్లు విరామం తీసుకున్నారు షారుక్‌. తాజాగా రాజ్‌కుమార్‌ హిరాణీ దర్శకత్వంలో ఓ సినిమా చేయడానికి కమిట్‌ అయ్యారు. ఉపాధి కోసం వలస వెళ్లే హీరో చుట్టూ ఈ సినిమా తిరుగుతుందని టాక్‌. పంజాబ్, కెనడా బ్యాక్‌డ్రాప్‌లో ఈ సినిమా షూటింగ్‌ జరగనుంది. సుమారు కొన్ని నెలలపాటు కెనడాలో చిత్రీకరణ కోసం ప్లాన్‌ చేస్తుందట చిత్రబృందం. ప్రస్తుతం ప్రయాణానికి కావాల్సిన ప్రయత్నాలు చేస్తున్నారని టాక్‌.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement