బాలీవుడ్ సీనియర్ నటి షబానా ఆజ్మీ కెరీర్‌లో గోల్డెన్ ఇయర్‌లోకి అడుగు పెట్టారు. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని ‘ఇంటర్‌నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ సౌత్ ఆసియా (ఐఎఫ్‌ఎఫ్‌ఎస్‌ఏ) టొరంటో’ షబానా ఆజ్మీ సినీ స్వర్ణోత్సవాన్ని జరపనుంది. 13వ ఐఎఫ్‌ఎఫ్‌ఎస్‌ఏ–టొరంటో వేడుకలు కెనడాలో ఈ ఏడాది అక్టోబరు 10 నుంచి 20 వరకు జరగనున్నాయి. 22 భాషల్లోని 120 చిత్రాలు ఈ ఫిల్మ్ ఫెస్టివల్లో ప్రదర్శితమవుతాయని అలాగే సినిమా రంగానికి విశేష సేవలు అందించిన సీనియర్ నటి షబానా ఆజ్మీ స్వర్ణోత్సవాన్ని ఘనంగా నిర్వహిస్తామని, ఈ కార్యక్రమంలో పలువురు సినీ ప్రముఖులు పాల్గొంటారని, ‘ఐఎఫ్‌ఎఫ్‌ఎస్‌ఏ–టొరంటో ఫెస్టివల్’ నిర్వాహక అధ్యక్షుడు సన్నీ గిల్ పేర్కొన్నారు.
ఇక 1950 సెప్టెంబరు 18న కైఫీ ఆజ్మీ (దివంగత ప్రముఖ గీత రచయిత), దివంగత నటి షౌకత్ కైఫీ దంపతులకు హైదరాబాద్‌లో జన్మించారు షబానా ఆజ్మీ. 150పైగా చిత్రాల్లో నటించారామె. షబానా ఆజ్మీ తొలి చిత్రం ‘అంకుర్’ 1974లో విడుదలైంది. దాంతో నటిగా షబానా ఫిల్మ్ ఇండస్ట్రీలో 50 ఏళ్ల జర్నీని పూర్తి చేసుకున్నట్లయింది. ‘అంకుర్, అర్థ్ (1982), కందార్ (1984), పార్ (1984), గాడ్ మదర్ (1999) వంటి సినిమాలకు గాను షబానా జాతీయ ఉత్తమ నటి అవార్డులను అందుకున్నారు.
ఇంకా ‘శత్రంజ్ కే ఖిలాడీ – 1977 (ది చెస్ ప్లేయర్స్), మండీ (1983), ఫైర్ (1996), మక్డీ (2002)’ వంటి ఎన్నో హిట్ ఫిల్మ్స్‌లో నటించారామె. అంతేకాదు... అమెరికన్ మిలటరీ సైన్స్ ఫిక్షన్ టెలివిజన్ సిరీస్ ‘హాలో’ (2022–2024)లోనూ నటించి, హాలీవుడ్ ప్రేక్షకుల మెప్పు పొందారు. సినీ రంగానికి షబానా అందించిన సేవలకుగాను 1998లో పద్మశ్రీ, 2012లో పద్మభూషణ్ పురస్కారాలు ఆమెను వరించాయి.
Comments
Please login to add a commentAdd a comment