2020 సంవత్సరంతోనే కరోనా పీడ విరగడువుతుందనకుంటే అది మరింత విజృంభిస్తూ ఇక్కడే తిష్ట వేసింది. దీంతో గతేడాదే వినోదానికి దూరమైన సినీ లవర్స్ ఈసారి కూడా తమకు ఎంటర్‌టైన్‌మెంట్ దొరకదా? అని నెత్తిన చేయి పెట్టుకుంటున్నారు. అయితే ఇలాంటివారికోసమే దర్శకనిర్మాతలు కొత్త రూట్‌లో పయనిస్తున్నారు. థియేటర్ లేకపోతే ఓటీటీ ఉందిగా, ఇంక టెన్షన్ ఎందుకు దండగ అని అభయమిస్తున్నారు. ఎంచక్కా ఎక్కడికీ వెళ్లకుండా కూర్చున్న చోటే కాలక్షేపం అందిస్తామంటే ఎవరు మాత్రం వద్దంటారు. అందుకే చాలామంది ఓటీటీకి జై కొడుతున్నారు. ఫలితంగా థియేటర్‌లో రిలీజైన సినిమాలు, ఇంకా విడుదల కాని సినిమాలు అన్నీ కూడా పోలోమని ఓటీటీకి క్యూ కడుతున్నాయి. తాజాగా కొన్ని పెద్ద, చిన్న సినిమాలు కూడా వేర్వేరు ఓటీటీ ప్లాట్‌ఫామ్స్‌లో రిలీజ్ డేట్స్‌ను ప్రకటించాయి. అవేంటో చూసేద్దాం..
జగమే తంత్రం..
హీరో ధనుష్- కార్తీక్ సుబ్బరాజు కలయికలో వచ్చిన చిత్రం 'జగమే తందిరమ్'. తెలుగులో 'జగమే తంత్రం' పేరుతో విడుదల అవుతోంది. ఐశ్వర్య లక్ష్మీ హీరోయిన్‌గా నటించింది. కరోనా కారణంగా చాలా నెలల నుంచి వాయిదా పడుతున్న ఈ చిత్రాన్ని ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్‌ఫ్లిక్స్ భారీ మొత్తానికి కొనుగోలు చేసింది. జూన్ 18 నుంచి ఈ సినిమా నెట్‌ఫ్లిక్స్‌లో ప్రసారం కానున్నట్లు అధికారికంగా వెల్లడించింది. ఇందులో ధనుష్ గ్యాంగ్‌స్టర్ పాత్రలో కనిపిస్తాడట.
వకీల్ సాబ్..
ఇటీవలే థియేటర్లలో విడుదలై సంచలనం సృష్టించిన సినిమా 'వకీల్ సాబ్'. 'అజ్ఙాతవాసి' డిజాస్టర్ తర్వాత పవన్ కల్యాణ్ చేసిన ఈ సినిమా రికార్డులు తిరగరాసింది. వేణు శ్రీరామ్ దర్శకత్వం వహించిన ఈ సినిమా ఏప్రిల్ 30 నుంచి అమెజాన్ ప్రైమ్‌లో స్ట్రీమింగ్ కానుంది. ఈ చిత్రంలో ప్రకాశ్ రాజ్, అంజలి, నివేదా థామస్, అనన్య, శృతి హాసన్ ముఖ్య పాత్రలు పోషించారు. దిల్ రాజు నిర్మించగా, థమన్ సంగీతం అందించాడు.
థ్యాంక్ యు బ్రదర్..
యాంకర్ అనసూయ భరద్వాజ ప్రధాన పాత్రలో నటించిన చిత్రం 'థ్యాంక్ యు బ్రదర్'. సందేశాత్మక అంశంతో తెరకెక్కిన ఈ సినిమాను థియేటర్లలోనే విడుదల చేయాలనుకున్నారు. కానీ కోవిడ్ సెకండ్ వేవ్ వల్ల థియేటర్లు మూత పడటంతో ఓటీటీలో విడుదల చేయాలని నిర్ణయించుకున్నారు. ఇక తెలుగు ఓటీటీ ప్లాట్‌ఫామ్ ఆహా నుంచి మంచి ఆఫర్ వచ్చింది. దీంతో అనసూయ సినిమా ఆహాలో మే 7 నుంచి స్ట్రీమింగ్ అవనుంది.
నారప్ప..
విక్టీర వెంకటేష్ హీరోగా దర్శకుడు శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వంలో వస్తున్న యాక్షన్ థ్రిల్లర్ 'నారప్ప'. సురేష్ బాబు నిర్మిస్తున్న ఈ సినిమా తమిళ సూపర్ హిట్ అసురన్‌కు రీమేక్ అన్న విషయం తెలిసిందే. మే 14న ఈ చిత్రాన్ని థియేటర్‌లో రిలీజ్ చేస్తామని చిత్రయూనిట్ గతంలో ప్రకటించింది. కానీ కోవిడ్ సెకండ్ వేవ్ నేపథ్యంలో సినిమా రిలీజ్‌ను వాయిదా వేస్తారా? లేదా ఓటీటీలో రిలీజ్ చేస్తారా? అన్నది అత్యంత ఆసక్తికరంగా మారింది. సోషల్ మీడియాలో వినిపిస్తున్న కథనాల ప్రకారం నారప్పను నేరుగా ఓటీటీలో రిలీజ్ చేస్తారని అంటున్నారు. మరి ఇదెంతవరకు నిజమనేది తెలియాల్సి ఉంది.
రంగ్‌దే..
నితిన్, కీర్తి సురేశ్ హీరోహీరోయిన్లుగా నటించిన చిత్రం 'రంగ్‌దే'. మార్చి 26న థియేటర్లలో రిలీజైన ఈ సినిమా పర్వాలేదనిపించింది. వెంకీ అట్లూరి దర్శకత్వం వహించిన ఈ సినిమాకు దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందించాడు. ఈ సినిమాను ఓటీటీ సంస్థ జీ 5 కొనుగోలు చేయడానికి ఆసక్తి చూపుతున్నట్లు సమాచారం. ఒకవేళ మంచి డీల్ కుదిరితే మే 21 నుంచి జీ 5లో ప్రసారం చేయడానికి రెడీ అవుతున్నట్లు తెలుస్తోంది. దీని గురించి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.
కర్ణన్..
ధనుష్ ప్రధాన పాత్రలో నటించిన చిత్రం 'కర్ణన్'. మాలి సెల్వరాజ్ దర్శకత్వం వహించిన ఈ సినిమా ఏప్రిల్ 9న థియేటర్లలో రిలీజైంది. కోట్లాది రూపాయల కలెక్షన్లు కురిపించిన ఈ సినిమా డిజిటల్ స్ట్రీమింగ్‌కు రెడీ అవుతున్నట్లు సమాచారం. ఫిల్మీ దునియాలో వినిపిస్తున్న సమాచారం ప్రకారం.. ఈ చిత్రం అమెజాన్ ప్రైమ్‌లో మే 9 నుంచి ప్రసారం కానున్నట్లు తెలుస్తోంది. రిలీజ్ డేట్‌లో మార్పు ఉండే అవకాశం ఉంది.
మోహన్ గోవింద్ డైరెక్షన్‌లో అశ్విన్ కాకుమను ముఖ్య పాత్రలో నటించిన 'పిజ్జా 3 ద మమ్మీ' సినిమా కూడా ఓటీటీలో రిలీజ్ కానుందట. కార్తీ, రష్మిక ప్రధాన పాత్రల్లో నటించిన 'సుల్తాన్' ఆహాలో మే 2న విడుదల కానున్న విషయం తెలిసిందే. సల్మాన్ ఖాన్ హీరోగా నటించిన 'రాధే: యువర్ మోస్ట్ వాంటెడ్ భాయ్' మే 13న అటు థియేటర్‌లో, ఇటు ఓటీటీలో ఒకేసారి రిలీజ్ అవుతోంది.
చదవండి:
మీ డ్యాన్స్, స్టైల్.. ఫెంటాస్టిక్, లవ్ యూ అల్లు అర్జున్: సల్మాన్
Comments
Please login to add a commentAdd a comment