కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్‌ను విచారించేందుకు రంగారెడ్డి జిల్లా ప్రత్యేక పోక్సో కోర్టు అనుమతించిన విషయం తెలిసిందే. మూడు రోజులుగా ఆయన్ను పోలీసులు విచారిస్తున్నారు. ఈ నెల 28 వరకు నార్సింగి పోలీసులు ఆయన్ను ప్రశ్నించనున్నారు. అత్యాచారం కేసులో ఆరోపణలు ఎదుర్కొని జానీ మాస్టర్ చిక్కుల్లో పడ్డారు. బాధితురాలు ఇచ్చిన స్టేట్‌మెంట్ కాపీని జానీ మాస్టర్ ముందు ఉంచి నార్సింగి పోలీసులు విచారించారు. అయితే, బాధితురాలే తనను గతంలో వేధించిందని తాజాగా జరిగిన పోలీసుల విచారణలో జానీ మాస్టర్ పేర్కొన్నట్లు సమాచారం.
పోలీసుల విచారణలో నేడు (సెప్టెంబర్ 27) పాల్గొన్న జానీ మాస్టర్ కాస్త అనారోగ్యంగా ఉన్నారు. దీంతో ఆయనకు వైద్య పరీక్షలు జరిపించారు. పోలీసుల విచారణలో భాగంగా బాధితురాలు ఇచ్చిన స్టేట్‌మెంట్‌తో జానీ మాస్టర్ ఏకీభవించలేదని తెలుస్తోంది. తనపై ఆమె చేస్తున్న ఆరోపణల్లో ఎలాంటి నిజం లేదని జానీ మాస్టర్ తెలిపాడు. ఒక టీవీ కార్యక్రమంలో ప్రసారం అవుతున్న ఢీ షో ద్వారా తనకు తానే పరిచయం చేసుకుందని జానీ పేర్కొన్నాడు. అయితే, తను మైనర్‌గా ఉన్న సమయంలో లైంగిక దాడి చేశాననేది అబద్ధమని చెప్పాడు.
తన టాలెంట్‌ను గుర్తించి మాత్రమే అసిస్టెంట్ కొరియోగ్రాఫర్‌గా అవకాశం ఇచ్చానన్నాడు. పెళ్లి చేసుకోవాలని బాధితురాలే తనను మానసికంగా హింసించేదని జానీ మాస్టర్ తెలిపాడు. ఈ క్రమంలో ఎన్నోసార్లు బాధితురాలు తనను బెదిరించినట్లు తెలిపాడు. దీంతో ఈ సమస్యను డైరెక్టర్ సుకుమార్ దృష్టికి తీసుకెళ్లాగా.. బాధితురాలితో మాట్లాడారు. అయినా కూడా ఆమెలో మార్పు రాలేదని అన్నాడు. తనపై కుట్ర జరిగిందని, తన వెనుక ఎవరో ఉండి ఇదంతా చేస్తున్నారని ఆయన అన్నాడు. తన ఎదుగుదలను ఓర్వలేకనే ఈ కేసులో ఇరికించారని జానీ మాస్టర్ స్టేట్‌మెంట్ ఇచ్చాడు. ఇప్పటికే మూడు రోజుల పాటు జానీమాస్టర్‌ను పోలీసులు కస్టడీలోకి తీసుకుని విచారించారు. రేపటితో (సెప్టెంబర్ 28) జానీ మాస్టర్ కస్టడీ విచారణ ముగియనుంది. రేపు ఉదయం జానీ మాస్టర్‌ను పోలీసులు కోర్టులో ప్రవేశపెట్టనున్నారు.
Comments
Please login to add a commentAdd a comment