Kamal Haasan Completes 64 Years In Film Industry - Sakshi
Sakshi News home page

64 Years Of Kamal Haasan: 64 ఏళ్ల సినీ ప్రస్థానం.. ఆ ఫోటోలోని బుడ్డోడి సినీ ప్రయాణం!

Published Sat, Aug 12 2023 7:08 PM | Last Updated on Sat, Aug 12 2023 8:48 PM

Kamal Haasan completes 64 years in film industry Today - Sakshi

నాలుగేళ్ల వయసులోనే సినిమాల్లో బాల నటుడిగా ఎంట్రీ ఇచ్చాడు. 1960లో తమిళ భాషా చిత్రం కలతుర్ కన్నమ్మ సినిమాలో చైల్డ్ ఆర్టిస్ట్‌గా ప్రేక్షకులను ఆకట్టుకున్నాడు. ఆ తర్వాత అతని ప్రయాణం ఇంత సుదీర్ఘంగా సాగుతుందని ఎవరూ ఊహించి ఉండరు. కానీ అతనే ఇప్పుడొక సూపర్ స్టార్. ఏకంగా ఆరు భాషల్లో నటించిన చిత్రాలు సూపర్ హిట్స్‌గా నిలిచాయి. ఏకంగా 232 చిత్రాలతో 64 సంవత్సరాల పాటు స్టార్‌గా కొనసాగిన హీరో అతనొక్కడే. ఇంతకీ ఆ సూపర్ స్టార్ ఎవరో తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే ఈ స్టోరీ చదివేయండి. 

64 ఏళ్ల సినీ ప్రయాణం

సినిమాల్లోకి చైల్డ్ ఆర్టిస్ట్‌గా ఎంట్రీ ఇచ్చి ఇప్పటికీ ఆరు దశాబ్దాలు గడిచిపోయింది. కానీ ఇప్పటికీ అతను యంగ్ హీరోలతో సమానంగా పోటీ పడుతున్నాడు. సినీ ప్రపంచంలో ఎందరో యువ నటులకు సైతం స్ఫూర్తిగా నిలిచిన మన హీరో ఆయనే తమిళ స్టార్ కమల్ హాసన్. చైల్డ్ ఆర్టిస్ట్ నుంచి బిగ్గెస్ట్ సూపర్ స్టార్ వరకు 64 ఏళ్లగా పరిశ్రమలో ఆయన చేసిన ప్రయాణం చరిత్రలో నిలిచిపోతుంది. బాలనటుడిగా తాను నటించిన మొట్టమొదటి చిత్రానికే జాతీయ పురస్కారం అందుకున్న కమల్.. ఆ తరువాత జాతీయ ఉత్తమ  నటుడిగా పురస్కారాన్ని మూడు సార్లు గెలుచుకున్నాడు. 

తెలుగులోనూ బ్లాక్ బస్టర్స్

1975లో కె. బాలచందర్ దర్శకత్వంలో వచ్చిన అపూర్వ రాగంగల్‌ మూవీ ఆయన కెరీర్‌నే మార్చేసింది. ఈ చిత్రం ద్వారా బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నారు. ఆ తర్వాత తమిళంతో పాటు ఇతర భాషల్లో సైతం బ్లాక్‌బస్టర్లుగా నిలిచాయి. మలయాళంలో సైతం స్టార్‌డమ్‌ను సంపాదించుకున్నారు. మలయాళంలో దాదాపు 40కి పైగా చిత్రాలలో నటించారు. హిందీ, తెలుగు సినిమాల్లోనూ తనదైన ముద్రవేశారు.  తెలుగులో ఆయన నటించిన మరో చరిత్ర, సాగర సంగమం, స్వాతి ముత్యం వంటి చిత్రాలు కమల్‌ను సూపర్‌స్టార్‌ను చేసేశాయి. హిందీలో ఏక్ దుజే కే లియే, సద్మా, సాగర్ వంటి చిత్రాల విజయం తర్వాత బాలీవుడ్‌లో ఫేమ్ సంపాదించారు. ఆ తర్వాత కన్నడ, బెంగాలీ చిత్రాల్లోనూ నటించారు.

ఆయన నటించిన ఉలగనాయగన్ చిత్రం భారతీయ సినిమాలో ఓ రికార్డ్ క్రియేట్ చేసింది. ఈ చిత్రం ద్వారా కమల్ హాసన్ భారతీయ చలనచిత్ర పరిశ్రమకు కొత్త సాంకేతికతను పరిచయం చేశారు. ఈ చిత్రంలో వినియోగించిన సాంకేతిక అంశాలను మెరుగుపరచడమే కాకుండా.. భారతీయ చలనచిత్ర పరిశ్రమలో విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చింది. ఆ తర్వాత 1992లో తన చిత్రం తేవర్ మగన్‌తో మొట్టమొదటిసారి ఆస్కార్ ఎంట్రీతో భారతీయ సినిమాను ప్రపంచానికి పరిచయం చేశారు. 1985 మరియు 1987 మధ్య ఏకంగా మూడు సినిమాలు ఆస్కార్‌కు నామినేషన్స్ సాధించాయి.

వయసు పెరుగుతున్నా ఇప్పటికీ వరుస సినిమాలతో బిజీగా ఉన్నారు. చివరిగా బ్లాక్ బస్టర్ చిత్రం విక్రమ్‌లో కమల్ హాసన్ కనిపించారు. లోకేష్ కనగరాజ్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం దేశవ్యాప్తంగా అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రంగా నిలిచింది. ప్రస్తుతం ఇండియన్2, ప్రాజెక్ట్- K చిత్రాల్లో నటిస్తున్నారు. 68 ఏళ్ల వయసులోనూ ప్రభాస్ చిత్రం కల్కి 2898-AD లో ప్రతి నాయకుడిగా కనిపించనున్నారు. తన 64 ఏళ్ల సినీ ప్రస్థానం సందర్భంగా ఆయన కూతురు శ్రుతి హాసన్,  విజయ్ సేతుపతి వంటి పలువురు ప్రముఖులు సోషల్ మీడియా ద్వారా శుభాకాంక్షలు తెలిపారు.


 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement