Keerthy Suresh Marks Bollywood Entry With Varun Dhawan Movie; Deets Inside - Sakshi
Sakshi News home page

Keerthy Suresh: కీర్తి సురేష్ ఉంటే ఆ సినిమా రిజల్ట్‌ ఇదేనా?

Published Thu, Aug 10 2023 8:57 AM | Last Updated on Thu, Aug 10 2023 3:04 PM

Keerthi Suresh Entry In Bollywood - Sakshi

ఒకటి రెండు చిత్రాలు ప్లాప్‌ అయితే ఆ చిత్రాల్లో నటించిన హీరోయిన్లను ఐరన్‌లెగ్‌ అనీ, వారి పని అయిపోయిందని సినీ వర్గాల్లో ప్రచారం జరగడం పరిపాటిగా మారింది. అయితే అలా ఒకటి రెండు చిత్రాల ప్లాప్‌లతో హీరోయిన్ల కెరీర్‌ను అంచనా వేయడం సరికాదు. నటి కీర్తి సురేష్ విషయంలోనూ ఇదే జరిగింది. మొదట మాలీవుడ్‌ నుంచి కోలీవుడ్‌కు ఎంట్రీ ఇచ్చిన కీర్తీసురేశ్‌ అక్కడ కొన్ని విజయవంతమైన చిత్రాల్లో నటించారు. ఆ తరువాత టాలీవుడ్‌లోకి రంగప్రవేశం చేశారు.

(ఇదీ చదవండి; Jailer Review: రజినీకాంత్ 'జైలర్' ట్విటర్ రివ్యూ)

ఇక్కడ మహానటి చిత్రంతో అనూహ్య విజయాన్ని అందుకోవడంతో పాటు జాతీయ ఉత్తమ నటి అవార్డును గెలుచుకున్నారు. అయితే ఆ తరువాత ఆమె నటించిన కొన్ని చిత్రాలు ఆశించిన విజయాలను సాధించకపోవడంతో కీర్తీసురేశ్‌ చాప్టర్‌ క్లోజ్‌ అనే ప్రచారం జరిగింది. అలాంటిది ఇటీవల తెలుగులో నటించిన దసరా, తమిళంలో నటించిన మామన్నన్‌ చిత్రాల విజయాలు ఆమెను మళ్లీ ఫామ్‌లోకి తీసుకొచ్చాయి. తాజాగ భోళా శంకర్‌లో కూడా చిరంజీవికి చెల్లెలుగా నటించింది. దీంతో కీర్తి మళ్లీ బిజీ నాయకిగా మారారు. అంతేకాదు బాలీవుడ్‌లో బెర్త్‌ను ఖరారు కూడా చేసుకున్నారు.

నిజానికి కీర్తి సురేష్‌కు ఇంతకు ముందే హిందీ చిత్రాల్లో నటించే అవకాశం వచ్చింది. అయితే ఈమె బాలీవుడ్‌ ఎంట్రీకి ఆసక్తి చూపలేదని ప్రచారం జరిగింది. కాగా తాజాగా ఈ బ్యూటీని తమిళ యువ దర్శకుడు అట్లీ బాలీవుడ్‌కు తీసుకెళుతున్నారని సమాచారం. తమిళంలో నటుడు విజయ్‌ హీరోగా వరుసగా మూడు హిట్‌ చిత్రాలను తెరకెక్కించిన ఈయన ఇటీవల బాలీవుడ్‌లోకి ప్రవేశించి షారూక్‌ ఖాన్‌ హీరోగా జవాన్‌ అనే భారీ చిత్రాన్ని తెరకెక్కించారు. ఈ చిత్రం ద్వారా నటి నయనతారను బాలీవుడ్‌కు పరిచయం చేశారు. ఈ చిత్రం త్వరలో విడుదలకు సిద్ధం అవుతోంది.

కాగా తాజాగా అట్లీ బాలీవుడ్‌లో నిర్మాతగా పరిచయం అవుతూ నటి కీర్తి సురేష్‌ను అక్కడకు తీసుకెళ్తున్నారు. తమిళంలో విజయ్‌ హీరోగా ఆయన తెరకెక్కించిన తెరి చిత్రాన్ని హిందీలో రీమేక్‌ చేయనున్నారు. ఇందులో విజయ్‌ పాత్రను వరుణ్‌ ధావన్‌ పోషించనున్నారని, నటి సమంత పాత్రలో కీర్తి సురేష్  నటించనున్నారని సమాచారం. కాగా ఎమీజాక్సన్‌ పాత్రలో నటి వామిక గబ్బి నటించనున్నట్లు తెలిసింది. దీనికి కలీస్‌ దర్శకత్వం వహించనున్నారు. ఈయన ఇంతకు ముందు తమిళంలో జీవా హీరోగా కీ చిత్రానికి దర్శకత్వం వహించారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement