సినీ కుటుంబం నుంచి వచ్చిన బ్యూటీ.. కీర్తీ సురేశ్. సినీ బ్యాగ్రౌండ్ వల్ల నటిగా రంగప్రవేశం చేయడం చాలా సులభమే అవుతుంది. అయితే కథానాయికగా కొనసాగడం మాత్రం చాలా కష్టతరం. దాన్ని కీర్తీసురేశ్ తన ప్రతిభతో సాధించిందనే చెప్పాలి. నటి మేనక, నిర్మాత సురేశ్‌ల వారసురాలు ఈ బ్యూటీ. బాల నటిగా రంగప్రవేశం చేసి మూడు చిత్రాల్లో నటించిన కీర్తీసురేశ్ ఆ తరువాత గీతాంజలి అనే మలయాళం చిత్రం ద్వారా హీరోయిన్‌గా పరిచయమైంది. ఈ చిత్రం ఈమెకు చాలా ప్రత్యేకం. కారణం తొలి చిత్రంతోనే మలయాళ సూపర్‌స్టార్ మోహన్‌లాల్‌కు జంటగా నటించడం, ద్విపాత్రాభినయం చేసింది.
ఆ సినిమాతో ఎంట్రీ
ఈ చిత్రం 2013 నవంబర్ 14న విడుదలైంది. అలా కీర్తీ నటిగా పది సంవత్సరాలు పూర్తిచేసుకుంది. మలయాళంలోనే కాకుండా తెలుగు, తమిళ భాషల్లోనూ నటించి స్టార్ హీరోయిన్‌గా రాణిస్తున్న ఈమె 2015లో ఇదు ఎన్న మాయం చిత్రం ద్వారా కోలీవుడ్‌కు ఎంట్రీ ఇచ్చింది. ఆ చిత్రం ఆశించిన విజయాన్ని అందుకోలేకపోయినా 2016లో శివకార్తికేయన్‌కు జంటగా నటించిన రజనీ మురుగన్ చిత్రం మంచి విజయాన్ని సాధించింది. దీంతో హిట్ చిత్రాల నాయికగా ముద్రవేసుకుంది.
పదేళ్ల ప్రయాణం
అదేసమయంలో తెలుగులో నేను శైలజ చిత్రంతో రంగప్రవేశం చేసి తొలి చిత్రంతోనే విజయాన్ని అందుకుంది. ఇక దివంగత నటి సావిత్రి జీవిత చరిత్రతో తెరకెక్కిన మహానటి చిత్రంలో టైటిల్ పాత్రను పోషించి ఏకంగా జాతీయ ఉత్తమ నటి అవార్డును గెలుచుకుంది. అలా చాలా తక్కువ సమయంలోనే హీరోయిన్‌కు ప్రాధాన్యత కలిగిన పాత్రల్లో నటించిన నటిగానూ గుర్తింపు పొందింది. ప్రస్తుతం తమిళంలో సైరన్, రఘుతాతా, రివాల్వర్ రీటా, కన్నివెడి చిత్రాల్లో నటిస్తూ బిజీగా ఉంది. నటిగా దశాబ్ద కాలాన్ని విజయవంతంగా పూర్తిచేసుకున్న సందర్భంగా తనను ఆదరించిన చిత్ర పరిశ్రమకు చెందిన వారికి, అభిమానులకు కృతజ్ఞతలు తెలుపుతూ ఎక్స్ మీడియాలో వీడియో పోస్ట్ చేసింది.
చదవండి: భారత్ గెలిస్తే అంటూ.. 'బోల్డ్ ఆఫర్' ప్రకటించిన తెలుగు హీరోయిన్
Comments
Please login to add a commentAdd a comment