మాలీవుడ్ నుంచి కోలీవుడ్‌కి ఆ తర్వాత టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చి కథానాయకిగా దుమ్ము రేపుతున్న నటి కీర్తి సురేష్ కథానాయకిగా పరిచయమైన కొద్ది కాలంలోనే మహానటి చిత్రంలో దివంగత నటి సావిత్రి పాత్రకు ప్రాణం పోసి జాతీయ అవార్డును గెలుచుకున్న నటి ఈమె. తెలుగు తమిళం భాషల్లో ప్రముఖ హీరోల సరసన నటిస్తున్న కీర్తి సురేష్ మరోపక్క ఉమెన్ సెంట్రిక్ కథా పాత్రల్లోను నటిస్తూ రాణిస్తుండటం విశేషం. అలా తాజాగా ఈమె నటించిన హీరోయిన్ ఓరియంటెడ్ కథా చిత్రం రఘుతాత. రవీంద్ర విజయ్, ఎమ్మెస్ భాస్కర్ ఆనంద్ సామి, దేవదర్శిని తదితరులు ముఖ్య పాత్రలు పోషించిన ఈ చిత్రాన్ని హోం భలే ఫిలిమ్స్ పతాకంపై సుమన్ కుమార్ దర్శకత్వంలో విజయ్ కిరకిందర్ నిర్మిస్తున్నారు.
శ్యాన్ రోల్డన్ సంగీతం, యామిని జ్ఞానమూర్తి చాయగ్రహణం అందించారు. నిర్మాణ కార్యక్రమం పూర్తి చేసుకున్న ఈ చిత్రం ఆగస్టు 15న తెరపైకి రానుంది. ఈ సందర్భంగా చిత్ర ఆడియో, ట్రైలర్ ఆవిష్కరణ కార్యక్రమాన్ని శనివారం సాయంత్రం చెన్నైలోని ఓ స్టార్ హోటల్లో నిర్వహించారు. ఈ సందర్భంగా దర్శకుడు సుమన్ కుమార్ మాట్లాడుతూ ఇది హిందీ భాషకు వ్యతిరేకంగా తెరకెత్తిస్తున్న కథాచిత్రం అనే ప్రచారం జరుగుతోందని అది వాస్తవం కాదని హిందీ భాషపై ఒత్తిడిని వ్యతిరేకిస్తూ రూపొందించిన వినోదంతో కూడిన కుటుంబ కాథా చిత్రంగా ఉంటుందని చెప్పారు.
అనంతరం నటి కీర్తి సురేష్ మీడియాతో ముచ్చటిస్తూ దర్శకుడు చెప్పిన కథ విన్న తర్వాత ఈ చిత్రానికి తాను న్యాయం చేయగలనా? అనే సందేహం కలిగిందన్నారు. అయితే దర్శకుడు ఇచ్చిన ధైర్యంతో ఇందులో నటించడానికి అంగీకరించినట్లు చెప్పారు. దర్శకుడు చెప్పినట్లు ఇది హిందీ భాషను నేర్చుకోవడం తప్పనిసరి అనే విధానాన్ని వ్యతిరేకించడంతోపాటు మహిళలపై జరుగుతున్న పలు సంఘటనలను ఖండిస్తూ సాగే ఫ్యామిలీ ఎంటర్‌టైయినర్‌గా రఘుతాత ఉంటుందన్నారు.
తాను చదివింది కేంద్ర విద్యాలయం పాఠశాలలో అని, అక్కడ కూడా ఇంగ్లిష్, హిందీ, సంస్కృతం భాషల్లో మాత్రమే బోధనలు ఉండేవని చెప్పారు. కాగా తాను మహానటి చిత్రం తర్వాత ఫిట్నెస్‌పై దృష్టి సారించినట్లు చెప్పారు. ఆ తర్వాత యోగ వంటివి చేయడంతో ప్రస్తుతం చాలా ఆరోగ్యంగా ఉన్నట్లు పేర్కొన్నారు. రాజకీయ రంగ ప్రవేశం చేసే ఆలోచన ఉందా? అన్న ప్రశ్నకు రాజకీయాల్లోకి రావచ్చు, రాకపోవచ్చు అంటూ తెలివిగా బదులిచ్చారు. అలాగే ప్రేమ పెళ్లి గురించి జరుగుతున్న ప్రచారం గురించి స్పందిస్తూ పెళ్లి కాదు కానీ ఒక విషయం మాత్రం జరుగుతోందని, దాని గురించి త్వరలోనే వెల్లడిస్తానని నటి కీర్తి సురేష్ పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment