![Kollywood Actress Priya Bhavani Sankar About Body Shaming - Sakshi](/styles/webp/s3/article_images/2023/04/17/priya.jpg.webp?itok=A0QBabwo)
బుల్లితెర యాంకర్‌గా పరిచయమై ఆ తరువాత వెండితెర కథానాయకిగా ఎదిగిన నటి ప్రియా భవానీ శంకర్. తొలి చిత్రం మేయాదమాన్‌తోనే విజయం వరించడంతో ఆ తరువాత ఈమెకు వరుసగా అవకాశాలు వరించడం మొదలెట్టాయి. ప్రస్తుతం బిజీ కథానాయికల్లో ప్రియ భవానీ శంకర్ ఒకరు. ఇటీవల ఈమె జయంరవికి జంటగా నటించిన అఖిలన్, శింబుతో జతకట్టిన పత్తుతల, తాజాగా రాఘవలారెన్స్ సరసన నటించిన రుద్రన్ చిత్రాలు వరుసగా తెరపైకి వచ్చాయి. ఈ సందర్భంగా ఆమె ఇటీవల ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ మన శరీర రంగును పరిహాసం చేస్తూ కొందరు మిమ్మల్ని గాయపరుస్తారన్నారు.
అయితే మీరు ఎవరు? మీరు ఏం కావాలనుకుంటున్నారు? అనే విషయాలను ఇతరులు మాట్లాడి నిర్ణయం తీసుకునే అవకాశం వారికి ఇవ్వొద్దని సూచించారు. ఇక్కడ అందానికి నిర్వచనం అంటూ ఏదీ ఉండదు. స్కిన్ కేర్, తమ అందాలను మెరుగుపరచుకోవడానికి తారలు చాలా ఖర్చు చేస్తుంటారన్నారు. అయితే ఓ సాధారణ కళాశాల విద్యార్థికి అలా చేయడం సాధ్యం కాదన్నారు. అయితే రూపం, రంగు, శరీర సౌష్టవం వంటి వాటి గురించి చింతించాల్సిన అవసరం లేదన్నారు. కేవలం ఇన్‌స్టాగ్రామ్‌లో ఫొటోలు చూసి ఒక నిర్ణయానికి రాకూడదన్నారు.
ఇప్పుడు తాను తయారు కావడానికి 10 మందితో కూడిన ఒక బృందం ఉందన్నారు. అయితే ఇదే సౌందర్యం అని చెప్పడానికి నిర్వచనం ఏదీ లేదన్నారు. కాబట్టి శారీరక అందం గురించి ఎవరు బాధపడాల్సిన అవసరం లేదని.. మానసిక వేదనకు గురి కాకుండా జీవితాన్ని పరిపూర్ణంగా గడపాలన్నారు. డబ్బు ఉంటే కాకి కూడా కలర్‌గా మారుతుందని కొందరు చెబుతుంటారని.. అయితే డబ్బు ఎవరికి ఊరకనే రాదని మీరు ప్రపంచంతో పోరాడి కోరుకున్నది గెలవాల్సి ఉంటుందని నటి ప్రియ భవానీ శంకర్ పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment