తమిళనాట సినీ, రాజకీయ రంగాలను వేరుచేసి చూసే పరిస్థితి ఉండదు. దశాబ్దాలుగా సినీనటులు పొలిటికల్ సర్కిల్లో తమదైన ముద్రవేశారు. ఎంజీఆర్, జయలలిత సినీరంగం నుంచే రాజకీయ దిగ్గజాలుగా ఎదిగారు. తర్వాత రజనీకాంత్, కమల్ హాసన్ అగ్ర కథానాయకులుగా ఇండస్ట్రీని శాసించారు. ఇక విజయ్, అజిత్ ప్రస్తుతం అశేష అభిమాన గణంతో దూసుకుపోతున్నారు. ఇలాంటి తరుణంలో నంబర్ వన్ (సూపర్‌స్టార్) ఎవరనే అంశంపై మాత్రం భిన్నవాదనలు వినిపిస్తున్నాయి. ఇప్పటి వరకు సూపర్ స్టార్ స్టేటస్ అనుభవిస్తున్న రజనీకాంత్ స్థానాన్ని విజయ్ ఆక్రమించాడంటూ ఓ యూట్యూబ్ చానల్ తాజాగా వెల్లడించడంతో వివాదం ముదిరింది. రజనీ అభిమానులు ఏకంగా ఆ చానల్ నిర్వాహకులపై దాడికి పాల్పడే పరిస్థితి రావడం క్షేత్రస్థాయిలో స్టార్ వార్‌కు అద్దం పడుతోంది.
కోలీవుడ్‌లో సూపర్‌స్టార్ ఎవరు? అన్న వివాదం మరోసారి చర్చనీయంశంగా మారింది. అగ్ర నటుడు రజనీకాంత్ గత 40 ఏళ్లకు పైగా ఎవర్‌గ్రీన్ సూపర్‌స్టార్‌గా వెలుగొందుతున్న విషయం తెలిసిందే. ఆయన మాస్ యాక్షన్ స్టైల్, డైలాగ్ డెలివరీ వంటి లక్షణాలకు ప్రేక్షకులు ఫిదా అయి సూపర్ స్టార్ పట్టం కట్టారు. నిజం చెప్పాలంటే కమలహాసన్, రజనీకాంత్ సమకాలిన నటులే అయినా కమలహాసన్ కాస్త సీనియర్. ఈయన క్లాస్, మాస్ నటనతో ఉలగనాయగన్ బిరుదు పొందారు. అయితే సూపర్‌స్టార్ స్టేటస్ జోలికి పోలేదు. దీంతో రజనీకాంత్‌దే సూపర్‌స్టార్ పట్టం అని సినీ వర్గాలు చెబుతాయి. అలాంటిది ఇప్పుడు కొత్త సూపర్‌స్టార్ విజయ్ అనే ప్రచారం తెరపై రావడంతో వివాదం ముదిరింది. వాస్తవానికి రజనీకాంత్, కమలహాసన్‌ల తదుపరి తరానికి చెందిన నటులు విజయ్, అజిత్. వీరి మధ్యనే వారి అభిమానులు పోటీ అని భావిస్తుంటారు.
సంక్రాంతి బరిలో వారిసు, తుణివు చిత్రాలు
అజిత్, విజయ్ మధ్య వృత్తిపరంగా ఆరోగ్యపరమైన పోటీ ఎప్పటి నుంచో కొనసాగుతోంది. తాజాగా వీరు నటించిన వారిసు, తుణివు చిత్రాలు సంక్రాంతి బరిలో ఢీ కొనడానికి సిద్ధం అవుతున్నాయి. 1996లో వీరి చిత్రాల మధ్య తొలిసారిగా పోటీ మొదలైంది. అలా 2014 వరకు నాలుగుసార్లు వీరు నటించిన చిత్రాలు ఒకేసారి విడుదలై పోటీ పడ్డాయి. ఆ తరువాత మళ్లీ ఇప్పుడు తుణివు, వారిసు ఢీ కొనబోతున్నాయి. ఈ విషయంలో విజయ్, అజిత్ అభిమానుల మధ్య మాటల యుద్ధం జరుగుతోంది. ఇకపోతే విజయ్‌కు అభిమానులు ఇళయ దళపతి అనే పట్టం కట్టారు. అజిత్‌ను అల్టిమేట్ స్టార్ అంటారు. అయితే అభిమాన సంఘాలనే వద్దని రద్దు చేసిన అజిత్ అల్టిమేట్ స్టార్ బిరుదునూ తిరస్కరించారు. అయితే విజయ్ రూట్ మాత్రం వేరు. ఈయనకు రాజకీయ రంగ ప్రవేశం చేయాలనే ఆలోచనకు వచ్చి చాలా కాలమే అయ్యింది. కానీ పార్టీ ఏర్పాటుపై మాత్రం ముందుకెళ్లలేదు. అయితే ఎప్పటికైనా పొలిటికల్ ఎంట్రీ తప్పదనే మాట మాత్రం వినిపిస్తోంది.
విజయ్ తరచూ అభిమానులతో సమావేశం అవుతూనే ఉంటున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో ఇటీవల విజయ్ నటించిన వారీసు చిత్ర ఆడియో ఆవిస్కరణ కార్యక్రమం జరిగింది. ఆ వేదికపై చిత్ర నిర్మాత దిల్‌రాజు సూపర్‌స్టార్ విజయ్∙అని పేర్కొన్న విషయం తెలిసిందే. దీంతో ఆయన అభిమానులూ సూపర్‌స్టార్ అంటూ నినదించారు. ఆవ్యాఖ్యలను విజయ్ ఖండించే ప్ర యత్నం చేయలేదు. అంతకు ముందే దిల్‌రాజ్ అజి త్ కంటే విజయ్‌నే పెద్ద స్టార్ అంటూ మరో వ్యాఖ్య కూడా చేశారు. దీంతో సూపర్‌స్టార్ పట్టంపై రచ్చ మొదలైంది. నంబర్–1 ఎవరనే విషయంపై ఇప్పు డు కోలీవుడ్‌లో పెద్ద వివాదమే జరుగుతోంది. అయితే ఇదంతా కొందరు కావాలని సృష్టిస్తున్న హంగామా అనే వారూ లేకపోలేదు.
పోలిక ఎలా కుదురుతుంది..?
ఇక ఇప్పటికీ అత్యధిక పారితోషికం తీసుకునే నటుడు రజనీకాంత్ అనే వాదనే ఉంది. ఈ వివాదం గురించి సీనియర్ దర్శకుడు రాశియప్పన్ మాట్లాడుతూ నటుడు విజయ్‌కి, రజనీకాంత్‌కు పోటీనా? అన్న ఆశ్చర్యాన్ని వ్యక్తం చేశారు. 170 చిత్రాలు చేసిన రజనీకాంత్, తమిళంలో పాటు తెలుగు, బెంగాలీ, హిందీ, ఇంగ్లీషు మొదలగు పలు భాషల్లో నటించి ప్రపంచ వ్యాప్తంగా పేరు గాంచారన్నారు. ఇంకా 70 చిత్రాలు కూడా పూర్తి చేయని విజయ్ సూపర్‌స్టార్ ఎలా అవుతారనే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. మరి ఈ వివాదం ఎటువైపుకు దారి తీస్తుందో చూడాలి.
రజనీ అభిమానుల ఆగ్రహం..
ఈ విషయంపై నటుడు రజనీకాంత్ అభిమానులు ఆగ్రహంతో రగలిపోతున్నారు. ఒక యూట్యూబ్ ఛానల్ నిర్వహించిన చర్చలో తాజా సూపర్‌స్టార్ విజయ్ అనే అభిప్రాయాన్ని వ్యక్తం చేయడంతో ఆ యుట్యూబ్ ఛానల్ కార్యాలయంపై రజనీకాంత్ అభిమానులు దాడి చేశారు. ఈ ఘటనపై నామ్ తమిళర్ పార్టీ నేత సీమాన్ స్పందిస్తూ సూపర్‌స్టార్ హోదా ఏ నటుడికి నిరంతరం కాదన్నారు. ప్రారంభదశలో నటుడు త్యాగరాజ భాగవతార్ సూపర్‌స్టార్‌గా వెలుగొందారని ఆ తరువాత మక్కల్ తిలకం ఎంజీఆర్‌ను ప్రేక్షకులు సూపర్‌స్టార్‌గా గుండెలో పెట్టుకున్నారని పేర్కొన్నారు. ఆ తరువాత రజనీకాంత్ సూపర్‌స్టార్ అయ్యారని గుర్తు చేశారు. నటుడు విజయ్ నే సూపర్‌స్టార్ అనే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు.
Comments
Please login to add a commentAdd a comment