డ్రగ్స్ కేసులో అనుమానితుడిగా ఉన్న సినీ డైరెక్టర్ క్రిష్ హైకోర్టులో ముందస్తు బెయిల్ కోసం పిటిషన్ దాఖలు చేశారు. అలాగే ఈ కేసులో అనుమానితులుగా ఉన్న రఘు చరణ్ అట్లూరి, సందీప్‌లు కూడా హైకోర్టులో బెయిల్ కోసం పిటిషన్ దాఖలు చేశారు. మిగిలిన అనుమానితులు కూడా ముందస్తు బెయిల్ తీసుకునే ప్రయత్నాల్లో ఉన్నట్లు తెలుస్తోంది. కొకైన్ తీసుకున్నారన్న కేసులో మంజీరా గ్రూపు డైరెక్టర్ వివేకానందతో పాటు నిర్భర్, కేదార్, డ్రగ్ పెడ్లర్ అబ్బాస్‌ను పోలీసులు అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో పోలీసులు అనుమానితులుగా ఉన్న డైరెక్టర్ క్రిష్‌తో పాటు చరణ్, సందీప్, లిషీ, శ్వేత, నీల్ ఇళ్లకు 160 సీఆర్‌పీసీ నోటీసులు అంటించారు.
బెంగళూరులో ఉన్న రఘు చరణ్ అట్లూరి గురువారం గచ్చిబౌలి పోలీస్ స్టేషన్‌లో విచారణకు హజరయ్యారు. ఆయనను వైద్య పరీక్షలకు తరలించారు. కాగా, లిషీ సోదరి నటి కుషిత గచ్చిబౌలి స్టేషన్‌కు వచ్చి తన సోదరి లిషీ ఇంటికి రావడం లేదని పోలీసులకు తెలిపింది. దీంతో ఎట్టి పరిస్థితుల్లోనూ విచారణకు హాజరు కావాలని, దీనిపై లిషీకి సమాచారం ఇవ్వాలని పోలీసులు కుషితకు చెప్పినట్టు సమాచారం. సందీప్, శ్వేతల ఫోన్లు స్విచ్చాఫ్ ఉన్నాయని, ఇప్పటి వరకు వారు అందుబాటులోకి రాలేదని పోలీసులు పేర్కొంటున్నారు.
విదేశాలకు నీల్!
ఇదిలా ఉండగా సైంధవ్ సినిమా నిర్మాత వెంకట్ బోయినపల్లి కుమారుడు నీల్ (ఏ9) విదేశాలకు పారిపోయినట్లు పోలీసులు గుర్తించారు. అమెరికా పౌరసత్వం ఉన్న ఆయనను కొకైన్ తీసుకున్నట్లు అనుమానితుల జాబితాలో చేర్చడంతో దేశం విడిచి పారిపోయినట్లు పోలీసులు చెపుతున్నారు.
మరో డ్రగ్ పెడ్లర్ అరెస్ట్
రాడిసన్ బ్లూ హోటల్ డ్రగ్ పార్టీ కేసులో మరో పెడ్లర్, పాతబస్తీకి చెందిన మీర్జా వాహెద్‌ను గచ్చిబౌలి పోలీసులు అరెస్ట్ చేశారు. మొదట డ్రగ్ పెడ్లర్ అబ్బాస్‌ను అరెస్ట్ చేసిన పోలీసులు ఆ తరువాత వివేకానంద డ్రైవర్ గద్దల ప్రవీణ్‌ను కూడా అరెస్ట్ చేశారు. దీంతో డ్రగ్ పార్టీ కేసులో అరెస్ట్ అయిన వారి సంఖ్య ఆరుకు చేరింది.
Comments
Please login to add a commentAdd a comment